‘ఝుమ్మంది నాదం’ చిత్రం ద్వారా కె.రాఘవేంద్రరావు పరిచయం చేస్తోన్న ఉత్తరాది భామ తాప్సీ. ఫెమినా మిస్ ఇండియా -
2008 ఫైనలిస్ట్ గా ఎంపికైన ఈమె తమిళంలో కూడా ఓ చిత్రంలో నటించింది. శింబు సరసన ‘ఆడుకలం’ అనే చిత్రంలో
నటించిన ఆమె తెలుగులో నటించిన చిత్రం ఇంకా విడుదల కాకముందే ప్రభాస్ సరసన మరో చిత్రంలో చేసే అవకాశం
పొందింది. హైదరాబాద్ మరో ఢిల్లీలా ఉందంటోన్న ఈ పంజాబీ భామ అవకాశం వస్తే ఇక్కడే స్టార్ గా వెలుగొందాలని ఉందని
తన మనసులోని మాటను బయటపెట్టింది. సమ్ థింగ్ డిఫరెంట్ గా ఉండాలంటున్న ఆమెతో కాసేపు...
సినిమా రంగంలోకి వస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు. నాకు స్కూల్ లో ఉన్నప్పుడు స్పోర్ట్స్, స్టడీ, డ్యాన్స్... ఇవే ధ్యాస.
ఇంజనీరింగ్ లో చేరిన తరువాతే నా లక్ష్యం అది కాదేమోననిపించింది. రోజూ కాలేజికి వెళ్లటం... చదువు అయిన తరువాత
ఉద్యోగం.. ఎప్పుడూ చూసే మొహాలే చూడటం... ఇవన్నీ తలుచుకుంటే లైఫ్ ఇంతేనా అనిపించింది. నాకంటూ గుర్తింపు
ఉండాలి. అదీ ప్రత్యేకమైన గుర్తింపు కావాలి అనుకున్నప్పుడు మా అమ్మ నాకు సినిమాల్లో ట్రై చేయమని చెప్పింది. ఈ
ఆలోచనలతోనే కంప్యూటర్ సైన్స్ లో ఇంజనీరింగ్ చేసేశాను.
నేను సినిమా రంగానికి వస్తానంటే మా నాన్న అసలు ఒప్పుకోలేదు. అంతకుముందు మా ఇంట్లోనే కాదు... మాకు తెలిసిన
వారికెవ్వరికీ సినిమా రంగంతో అనుబంధం లేదు. పైగా సినిమా రంగం గురించి రోజూ ఎన్నో వార్తలు. ఇక్కడ గాడ్ ఫాదర్
లేకపోతే కష్టమని... హిపోక్రసీ... ఇలా! ఇవన్నీ మా నాన్న నాకు చెప్పి వద్దన్నారు. అయితే నేను మాత్రం మా నాన్నతో ఓ
విధంగా పోరాటమే చేశాను. మీరు నాకు కొంత సమయం ఇవ్వండి. ఆ సమయం లోపల నేను, నన్ను నిరూపించుకోలేకపోతే
మీరు చెప్పినట్టే చేస్తానన్నాను. ఆయన అందుకు ఒప్పుకోవడంతో సినిమా రంగంలోకి రావటానికి మార్గం సులువైంది.
నా మొదటి సినిమా తమిళంలో చేశాను. ‘ఆడుకలం’ చిత్రంలో శింబు సరసన నటించాను. మంచి క్యారెక్టర్ నాది.
తప్పకుండా నాకు మంచి పేరు వస్తుందన్న నమ్మకం ఉంది. తమిళ చిత్రం పూర్తయిన వెంటనే తెలుగులో ‘ఝుమ్మంది
నాదం’ చిత్రంలో అవకాశం వచ్చింది. నా తొలి చిత్రమే ఓ పెద్ద దర్శకుడు, గొప్ప బ్యానర్... నాకు అంతా మంచే
జరుగుతుందనుకుంటున్నాను. ఇప్పుడు ప్రభాస్ తో దశరథ్ దర్శకత్వంలో రాజు గారు చేస్తోన్న చిత్రంలో చేస్తున్నాను. ఇవి
కాక తమిళంలో మరో ఆరు ప్రాజెక్టులు లైన్ లో ఉన్నాయి. వాటిలో మంచిది ఎంచుకుని ప్రొసీడ్ అవుతాను.
నేను క్లాసికల్ డ్యాన్సర్ ను. ఆరేళ్లు కథక్ లో శిక్షణ తీసుకున్నాను. తరువాత నాలుగేళ్ల పాటు షామక్ దావర్ వద్ద శిక్షణ
పొందాను. డ్యాన్స్ చక్కగా చేయగలగడం ఇప్పుడు నటనలో నాకు బాగా ఉపయోగపడింది. ఎక్స్ ప్రెషన్స్ కూడా ఈజ్
అయ్యాయి.
నాకు అత్యంత చికాకు కలిగించే విషయం ప్రయాణం. నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఏ పనీ చేయకుండా ఒకే చోట
ఉండాలంటే అమ్మో అనిపిస్తుంది. ఇప్పుడంటే షూటింగ్ ల వల్ల తప్పటం లేదు. మీకో విషయం చెప్పనా ఈ వేసవి మొత్తం
నేను ఇతర దేశాలు తిరుగుతూనే ఉంటా. జూలై వరకూ ఇలా షూటింగ్ ల కోసం నాలుగైదు దేశాలు తిరగనున్నాను.
నేను ఢిల్లీ అమ్మాయినైనా ఇక్కడి వారు ఎవరూ నన్ను వేరుగా చూడలేదు. ఆప్యాయంగా మట్లాడతారు. చేతల్లో కూడా అదే
ఆప్యాయత చూపుతారు. ‘ఝుమ్మంది నాదం’ షూటింగ్ కోసం దాదాపు 40 రోజులు హైదరాబాద్ లోనే ఉండాల్సి వచ్చింది.
దీంతో నాకు తెలుగు కొద్ది కొద్దిగా అర్థమవుతుంది కూడా..(నవ్వు). మరి కొన్ని రోజులు ఇక్కడ ఉంటే ఖచ్చితంగా తెలుగులోనే
మాట్లాడతాను. స్వీట్ లాంగ్వేజ్..!
నా లైఫ్ ఎంబిషన్... సమ్ థింగ్ డిఫరెంట్ గా ఉండాలి. అందరిలా మనమూ ఉంటే విశేషం ఏముంటుంది. అందుకే విభిన్నంగా
ఉండటానికి ప్రయత్నిస్తాను.
|