తన కెరీర్‌లో ఆస్కార్, బాఫ్టా, గోల్డెన్ గ్లోబ్, స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ లాంటి అన్ని అంతర్జాతీయ అవార్డులను అందుకున్న ప్రముఖ హాలీవుడ్ నటుడు సర్ బెన్ కింగ్‌స్లే. వైవిధ్యమైన నటనతో అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించగల సత్తా ఉన్న బెన్‌కు భారతీయ అభిమానులకు కూడా సుపరిచితుడే. 1982లో మహాత్మాగాంధీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన ‘గాంధీ’ చిత్రంతో సినీరంగప్రవేశం చేసిన కింగ్‌స్లే ఆ తరువాత ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించాడు. ‘గాంధీ’ చిత్రంలో నటించి ప్రపంచవ్యాప్త అభిమానులను సంపాదించుకున్న కింగ్‌స్లే 1984లో భారత అత్యున్నత పౌర పురస్కారం ‘పద్మశ్రీ’ని కూడా అందుకున్నాడు.
ఇప్పుడు మరో చారిత్రక చిత్రంలో హీరోగా నటించడం ద్వారా సంచలనం సృష్టించబోతున్నాడు. నిస్వార్థ ప్రేమకు చిహ్నమైన తాజ్‌మహల్‌ను నిర్మించిన మొఘల్ చక్రవర్తి షాజహాన్ పాత్రలో నటించబోతున్నాడు. గాంధీ చిత్రం నటించిన ఇరవై ఏడేళ్ళ తరువాత బాలీవుడ్ తెరపై నటించబోతున్నాడు కింగ్‌స్లే. ఇక్కడ మరో విశేషమేమిటంటే బాలీవుడ్ అందాల తార ఐశ్వర్యారాయ్ ముంతాజ్ పాత్రలో నటిస్తోంది. సుమారు 30 మిలియన్ డాలర్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న సినిమా ఇది.
తన సొంత నిర్మాణ సంస్థ ‘ఎస్‌బీకే ప్రొడక్షన్’ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రం గురించి మాట్లాడిన కింగ్‌స్లే... ‘‘తాజ్‌మహల్ ఇండియాకే కాక ప్రపంచానికే ప్రేమ విలువను చాటిచెప్పిన అద్భుత కట్టడం. ఏడు ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్‌మహల్ ఇటీవలికాలం లో పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. అలాంటి పాలరాతి అద్భుతాన్ని తీర్చిదిద్దిన షాజహాన్ పాత్రలో నటించడం నాకు చాలా ఆనందంగా ఉంది.’’ అని అన్నాడు. త్వరలో నిర్మాణం ప్రారంభం కానున్న ఈ చిత్రానికి కథను అందుస్తున్న ప్రముఖ హాలీవుడ్ రచయిత డేవిడ్ ఆస్టన్, తాజ్‌మహల్ చరిత్రను తెలుసుకోవడానికి త్వరలో భారత్‌కు రానున్నాడని సమాచారం..
|