Bookmark and Share   Cinevinodam
Subscribe
 
 
పార్టీలంటూ పరుగెత్తను! : తమన్నా

     నేను పుట్టి పెరిగింది ముంబయిలో. కానీ తెలుగు నేలన్నా, ప్రజలన్నా నాకెంతో అభిమానం. అవును మరి, నటనకు 'శ్రీ'కారం చుడుతున్న సమయంలోనే వెన్ను తట్టారు. రంగుల ప్రపంచంలో ఓనమాలు దిద్దుతున్నప్పుడే 'హ్యాపీడేస్‌'ని అందించారు. ఆ అభిమానం వల్లనో...నాకు భాష పట్ల ఉన్న మమకారం వల్లనో... తెలుగు చాలా త్వరగా నేర్చుకున్నా. కేవలం ఆర్నెల్లలో తెలుగు అర్థం చేసుకుని, చక్కగా మాట్లాడే స్థితికి చేరుకున్నా. అలాగే తమిళం కూడా త్వరగానే నేర్చేసుకున్నానని అంటోంది ‘హ్యాపీడేస్’ అమ్మాయి తమన్నా.

చాలా చిన్నప్పుడే... చెప్పాలంటే ఉన్నత పాఠశాలలో ఉండగానే నేనీ రంగంలోకి వచ్చేశాను. కళాశాలకు వెళ్లలేకపోయానని నాకస్సలు అనిపించదు. జీవితంలో కళాశాల రోజులుంటేనే ఆనందం అని ఎక్కడుంది! నేనిష్టపడి ఈ ప్రపంచంలోకి వచ్చాను. ఆనందంగా ఉన్నాను. నా ఉనికి నాకు సంతోషాన్నిస్తోంది. ఇక కాలేజీ రోజులంటే, నేను కొన్నాళ్లు జూనియర్‌ కళాశాలకు వెళ్లాను. దూరవిద్యలో డిగ్రీ మొదటి సంవత్సరం పూర్తిచేశాను. నాకింకా చదువుకోవాలనే ఉంది. కానీ ఏడాదికి నాలుగు సినిమాలు... తీరిక దొరకడం లేదు. మున్ముందు తప్పకుండా చదువు కొనసాగిస్తాను. అయినా మీకు తెలియనిదేముంది, హ్యాపీడేస్‌ చిత్రీకరణ జరిగిన వంద రోజుల్లో కళాశాల వాతావరణంలో గడిపాం. స్నేహాలు, సరదాల మధ్య కాలక్షేపం చేశాం.

అందంగా కనిపించడం కోసం నేను తిండి మానేయను. బాగా కష్టపడను. యోగా, ధ్యానం వంటివి చేయను. కానీ రోజూ కచ్చితంగా వ్యాయామానికి సమయం కేటాయిస్తాను. చిన్నప్పుడు జంక్‌ఫుడ్‌ బాగా తినేదాన్ని. ఇప్పుడు సమతులాహారం తీసుకుంటాను. అందం, ఆరోగ్యం కోసం మనసుకు నచ్చిన పదార్థాలను ఒక్కసారిగా, మొత్తంగా మానేయడం చేయను. అప్పుడప్పుడూ... తక్కువ మొత్తంలో తీసుకుంటాను. అయితే శీతల పానీయాలు తాగడం మాత్రం మానేయాలనుకుంటున్నాను. ఓ ప్రణాళిక ప్రకారం పని చేసుకుపోతాను. అనవసర ఒత్తిళ్లకు లోనవ్వను. దైవభక్తి ఉంది. చాలామందిలానే పూజలు చేస్తాను. అయితే చాదస్తాలు లేవు.

ఏ ఆలోచన చేసినా, నిర్ణయం తీసుకున్నా నాన్న సలహా అడుగుతాను. అందానికి ప్రాధాన్యమున్నవా... మహిళా సమస్యలను ప్రస్తావించేవా అని కాకుండా... అవి మంచి కథలు, పాత్రలేనా అని ఆలోచిస్తాను. ఇలా ఎంపిక చేసుకున్న వాటిల్లో మహిళల సమస్యలకు పరిష్కారాలు చూపే పాత్రలుంటే నటించడానికి నేను సిద్ధమే. అయినా ఒక కర్తవ్యం... ప్రతిఘటన... వంటివి ఎప్పుడో ఒకటి వస్తాయి. వరుసగా ఒకే మూసలో వచ్చినా ఆదరణకు నోచుకోవు.

రెండేళ్లుగా తీరిక దొరక్క పండగలకు మా కుటుంబమంతా కలుసుకోవడం కుదరడం లేదు. అందుకే నేను ముంబయి వెళితే వీలైనంత వరకు ఇంటిపట్టునే ఉంటాను. హాయిగా సినిమాలు చూస్తూ, అమ్మ చేసిపెట్టిన పదార్థాలు లాగిస్తాను. నాకు మాత్రం వంట చేయడం అస్సలు రాదండోయ్‌. ఇక మహా నగరంలో పెరిగిన అమ్మాయినైనా పార్టీలంటూ పరుగెత్తను. ఆ సమయంలో స్నేహితురాళ్లను కలిసి బోలెడు కబుర్లు చెప్పుకోవచ్చు కదా! అదీకాక నాకు నృత్యమంటే అమితాసక్తి. ఎంచక్కా బాలీవుడ్‌ పాటలకు నృత్యం చేస్తూ ఆనందిస్తా. ఫేస్‌బుక్‌లో నాకు ఖాతా ఉంది. రోజూ నెట్‌ బ్రౌజ్‌ చేస్తా. బ్లాగు ఆరంభించి, తరచూ టపాలు ఉంచే ఆలోచన ఇప్పుడైతే లేదు.

 
 

Copy right reserved for www.cinevinodam.com 2005