Bookmark and Share   Cinevinodam
Subscribe
 
 
డబ్బు కంటే అభిమానాన్ని సంపాయించా

     ముప్పై ఏళ్ల క్రితం చరిత చిత్ర బ్యానర్‌ని ప్రారంభించా. ఇంతకాలం సినిమాల్లో ఉంటాననుకోలేదు. సినిమాలకు దూరంగా ఉండాలనుకున్నవాణ్ణి అనుకోకుండా నిర్మాతనయ్యా. ఇంతకాలం నాకు అండదండగా ఉంది మీడియానే. నన్ను మీలో ఒకడిగా చూశారు. ఇవాళ నా స్థాయి, నా స్థితి అంతా మీడియా పెట్టిన భిక్షే. సాటి నిర్మాతలు, కార్మికులు, టెక్నీషియన్లు, ఆర్టిస్టుల అందరి అభిమానం, సహకారమే నన్ను నిలబెట్టింది. 1979లో 'కోతల రాయుడు'తో నిర్మాతగా నా కెరీర్ మొదలయ్యింది. సోలో హీరోగా చిరంజీవికి అదే తొలి సినిమా. ఆ సినిమాతో ఆయనా, నేనూ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇంతదాకా నిర్మాతగా కానీ, దర్శకుడిగా కానీ 32 సినిమాలు చేశా. ఈ మధ్య కాలంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా. అందరూ వెన్నుతట్ట బట్టే నిలవగలిగా. ఇక నేను ఇండస్ట్రీలో ఉండలేనేమో అనుకున్న సమయంలో టీవీలో పని మొదలుపెట్టా. ఆ పని విజయవంతంగా నడుస్తోంది. వివిధ చానళ్లలో రకరకాల కార్యక్రమాలు చేస్తూ వస్తున్నా.

మళ్లీ సినిమా తీస్తా :
సినిమా నిర్మాణం ఓ వ్యసనం. అందువల్ల తియ్యకుండా ఎలా ఉంటాను. 'అలజడి' తర్వాత అంత పర్ఫెక్టుగా చేసిన సినిమా లేదు. 'పచ్చని సంసారం', 'స్వర్ణక్క' చిత్రాలు కొంత సంతృప్తినిచ్చాయి. నా చివరి చిత్రం 'పోతే పోనీ' మంచి స్క్రిప్టే అయినా స్క్రీన్‌ప్లేలో ఫెయిల్ అయ్యా. ఎదుటివాళ్లని విమర్శించే ముందు, నేను మంచి సినిమా తియ్యాలనుకుంటున్నా. మంచి సినిమా చేయగలననే ధైర్యం వచ్చాక సినిమా తీస్తా.

ఖరీదైన సీరియల్ 'అలజడి' :
ప్రస్తుతం నా కెరీర్ బెస్ట్ ఫిల్మ్ 'అలజడి' పేరుతో ఓ టీవీ సీరియల్ తీస్తున్నా. తెలుగు సీరియళ్లలో ఖరీదైన సీరియల్. దానికి నేనే డైరెక్టర్. ఎస్. గోపాల్‌రెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. రామ్-లక్ష్మణ్ థ్రిల్స్ సమకూరుస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో తీస్తున్న ఈ సీరియల్ తెలుగువాళ్లు గర్వపడే రీతిలో ఉంటుందని చెప్పగలను.

ఫెడరేషన్ పనుల్లోకి వస్తాననుకోలేదు:
అప్పటి డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ప్రభాకరరెడ్డి పట్టుబట్టి ఆ అసోసియేషన్‌లో నాకు సభ్యత్వం ఇచ్చారు. అలా ఈ యూనియన్ విషయాల్లో పనిచేస్తూ వచ్చా. ఒకప్పుడు ట్రేడ్ యూనియన్‌లోకి వెళ్లాలనుకున్నవాణ్ణి నలభై ఐదేళ్ల వయసులో సినిమా యూనియన్లలోకి వచ్చా. అయితే నేను కార్మికులకి చేసింది చాలా తక్కువ. చెయ్యాల్సింది చాలా ఉంది. వాళ్ల బాధలు కొన్ని వింటానికే బాధేసింది. నా హయాంలో వేతనాల ఒప్పందాలు చేయించానని గర్వంగా చెప్పుకోగలను. అయితే కార్మికులకి ఇప్పటికీ పూర్తిగా న్యాయం జరగడం లేదు.

అభిమానాన్ని సంపాదించుకున్నా :
కెరీర్‌లో పోగొట్టుకుంది తక్కువ, సాధించింది ఎక్కువ. డబ్బుకంటే ఎక్కువమంది అభిమానాన్ని సంపాదించుకున్నా. నేను సంపాదించినంత మంది అభిమానాన్ని పరిశ్రమలో ఇంకెవరూ సాధించలేదని గట్టిగా చెప్పగలను. వచ్చినప్పుడు తమ్మారెడ్డి కృష్ణమూర్తిగారి అబ్బాయిగా వచ్చి, తమ్మారెడ్డి భరద్వాజ్‌గా పేరు సంపాదించుకున్నా. అదే పెద్ద విజయమనుకుంటున్నా.

నాది పామరుడి భాష :
నేను మామూలు మనిషిని. నా మాటల్ని కొంతమంది వివాదాస్పదం లేదా సంచలనాత్మకం చేస్తుంటారు. యధాలాపంగా చెప్పడమే కానీ, సంచలనాత్మకం చెయ్యాలనే ఉద్దేశంతో నేనేమీ చెప్పను. పోతే మన హీరోలంతా ఒకే రకమైన కథలతో సినిమా చేస్తున్నారు. భిన్న పాత్రలు చేయగలిగీ చేయడానికి ప్రయత్నించడం లేదు. ఆ ఉద్దేశంతోటే 'గజిని', 'మై హూ నా', 'లగాన్', 'తారే జమీన్ పర్' వంటి సినిమాలు చెయ్యగల మగాళ్లు తెలుగు హీరోల్లో లేరని చెప్పా. దాన్ని పాజిటివ్‌గా తీసుకోవాలే కానీ నెగటివ్‌గా తీసుకుంటే నేనేం చెయ్యలేను. నాకు భాషా పరిజ్ఞానం లేదు. నాది పామరుడి భాష. కావాలనో, సెన్సేషనల్ చెయ్యాలనో ఆ మాటలు చెప్పలేదు. నేను మాట్లాడే విధానమే అది. నా మాటలకు ఎన్టీఆర్ పాజిటివ్‌గా స్పందించి 'అదుర్స్'లో భిన్న పాత్ర చేశాననీ, ఇక నుంచీ తన ప్రతి సినిమాలో డిఫరెంట్ పాత్రలు చేస్తాననీ చెప్పాడు నాతో. అలాగే వెంకటేశ్ 'ఈనాడు'లో డిఫరెంట్ రోల్ చేశా కదా అని చెప్పారు. అలాంటి స్క్రిప్టులు వస్తే తాను చేస్తానని మోహన్‌బాబూ అన్నారు. ఇక్కడో సంగతి చెప్పాలి. ఎనిమిదేళ్ల క్రితమే 'గజిని' వంటి గెటప్ ఉండే స్క్రిప్టుని మన హీరోలకు ఇచ్చా. వారు 'ఛీ ఛీ' అని దాన్ని విసిరికొట్టారు.

 
 

Copy right reserved for www.cinevinodam.com 2005