'ప్రేక్షకులు ప్రేమించినంత కాలం నటిగా కొనసాగుతా. వాళ్లకు నేను నచ్చడం లేదనే విషయం తెలిస్తే...ఆ క్షణమే సినిమాలకు దూరం అవుతా'నని చెబుతోంది అందాల భామ తాప్సీ. జీవితంలో ఉన్న అనుభవాల్ని తనివితీరా ఆస్వాదించాలని, ప్రతీ రోజు కొత్తగా ఉండాలని తాప్సీ భావిస్తుందట ! అందుకే సినిమాల్లోకి ప్రవేశించిందని, ఇందుకు తగ్గట్టే తెలుగు, తమిళ ప్రేక్షకులకు దగ్గరైందట ! కొత్త పాత్రలు, వింతైన వేషాలు వేయాలని...థింక్ డిఫరెంట్‌గా ఉండాలని పక్కనున్న వాళ్లకూ క్లాసులిస్తోంది ! ఆవిడ ఇంకా ఏమందంటే...
* పనిలోనే ఆనందాన్ని వెతుకుతున్నా. సినిమాలనే ప్రేమిస్తూ గడిపేస్తున్నా. సమయం దొరికినప్పుడల్లా ప్రేమ గురించి ఆలోచిస్తా. నా వృత్తిని అర్థం చేసుకున్నవాడితో జీవితాన్ని పంచుకుంటా.
* వ్యాపార దృక్పతంతో సాగే వ్యవహారాలకు నేను దూరం. ర్యాంప్‌పై నడపటం, ఎవరివో బ్రాండ్ల కోసం అలంకరించుకోవటం నాకు అస్సలు ఇష్టముండదు. నిజానికి అలాంటివాటి పట్ల జనానికి ఆసక్తి కూడా లేదు. ర్యాంప్‌పై నడిచే మోడల్ పేరు కూడా చూసేవారికి తెలిసే అవకాశం లేదు.
* నిజానికి సినిమా వాతావరణం కూడా నాకు కొత్తే. ఇక్కడ ఎలా మెదలాలి. సెట్లో ఎలా ఉండాలి...అన్నవి నాకు తెలియవు. కానీ కొన్నాళ్లకు ఈ వాతావరణానికి అలవాటు పడ్డా. మొదటిసారి షూటింగ్‌లో పాల్గొన్న ప్రదేశం మధురై. అక్కడ రోజుకు మూడు సన్నివేశాలు చిత్రీకరించారు. తర్వాతేంటి అన్నది ఆలోచించడానికి కూడా అక్కడ అవకాశముండేది కాదు.
* సినిమా జీవితం తొలిరోజుల్లో చాలా కంగారుగా ఉండేది. ప్రేక్షకులు నన్ను గుర్తిస్తారో లేదో అన్న బెంగ చాలానే ఉండేది. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. సినిమా రంగంలోకి రావాలని ఎంతోమంది కలలు కంటారు. ఇండిస్టీలోకి ప్రవేశం పొందే అదృష్టం అందరికీ దక్కదు. చాలాకొద్దిమందికి దొరికే అవకాశం నాకు వచ్చింది. తెరమీద నేటితరం అమ్మాయిలకు ప్రతినిధిలా కనిపిస్తున్నా.
* ప్రస్తుతం దక్షిణాది భాషలను నేర్చుకునే పనిలో ఉన్నా. ఇది కూడా చాలా ఆసక్తిగొలిపే పనే. 'మిస్టర్ పర్‌ఫెక్ట్' సినిమా కోసం తెలుగులోనే డబ్బింగ్ చెప్పా. మిగతా భాషల సంగతి కూడా చూడాలి.
* గంటలు గంటలు ప్రయాణం చేయటం నావల్ల కాని పని. బస్, రైల్, విమానం ఏదైనా సరే...ప్రయాణమంటేనే నాకెందుకో ఆయాసం వచ్చేస్తుంది. మరుక్షణమే చేరుకోవాల్సిన చోటులో ఉండాలని భావిస్తా. అలాంటి సౌకర్యం ఎవరైనా కనిపెడితే ముందు కొనే వ్యక్తిని నేనే.