మసాలా
 
 
 
 
మహత్‌ తాప్సీ స్నేహితుడు మాత్రమేనట
యువ నటుడు మహత్‌తో తన స్నేహాన్ని భూతద్దంలో చూస్తున్నారెందుకని నటి తాప్సీ ప్రశ్నిస్తున్నారు. వీరి గురించి రకరకాల వార్తలు ప్రచారం అవుతున్నాయి. తాప్సీ షూటింగ్‌కు వెళ్లినా, పార్టీలకు హాజరైనా మహత్ పక్కనే ఉంటున్నారని, ఇద్దరు ప్రేమలో మునిగిపోయారని కోలీవుడ్ కోడై కూస్తోంది. ఇలాంటి వార్తలపై తాప్సీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహత్ తనకు మంచి మిత్రుడు మాత్రమేనని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ఇప్పటికే చాలాసార్లు చెప్పానని, అయినా వదంతుల ప్రవాహం ఆగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహత్, తాను రహస్యంగా ఏమీ కలుసుకోవడం లేదన్నారు.

షూటింగ్ సెట్‌లో దర్శకుడు, హీరో, ఇలా యూనిట్ సభ్యులందరికీ తమ స్నేహం గురించి తెలుసన్నారు. మహత్‌కు సినిమా పరిశ్రమతో మంచి అనుబంధం ఉందని చెప్పారు. నటుడు శింబుకు మహత్ బాల్యమిత్రుడని, అలాగే నిర్మాత దయానిధి అళగిరికి సన్నిహితుడని తెలిపారు. అలాంటి వ్యక్తిని తాను సిఫార్సు చేయాల్సిన అవసరం లేదన్నారు. ఆయన తనకు సిఫార్సు చేసిన దాఖలాలు కూడా లేవన్నారు. తన చిత్రాల వ్యవహారాలను తన తల్లిదండ్రులకు కూడా చెప్పనన్నారు. అలాంటిది మహత్ సిఫార్సులను తానెందుకు ఒప్పుకుంటానని ప్రశ్నించారు.

తాను కోలీవుడ్, టాలీవుడ్ చిత్రాలలో నటిస్తున్నానని, కెరీర్ పరంగా తాము ఇంకా ప్రారంభదశలోనే ఉన్నామని చెప్పారు. ఇలాంటి దుష్ర్పచారం వల్ల తమ కెరీర్ ఎఫెక్ట్ అవుతుందని తాప్సీ ఆవేదన వ్యక్తం చేశారు.