మసాలా
 
 
 
 
తెలుగు చిత్ర నిర్మాతలకు కొత్త ఊపిరి
భారీ ఎత్తున సినిమాలను తీయడమేకాదు అందులో విషయం కూడా ఉందా లేదా అనేది చూస్తున్నాడు తెలివైన సగటు ప్రేక్షకుడు. సినిమా నిర్మాణం అనేది ఈ రోజుల్లో కత్తిమీద సాము మాదిరిగా తయారయింది. హంగామా చేసి సినిమా విడుదల చేయడంతో పాటు , దానికి ప్రచారం కల్పించడం సినిమా నిర్మాణం కన్నా కష్టసాధ్యమైపోయింది. తీరా అన్నీ ఏర్పాట్లు పూర్తిచేసుకుని విడుదల చేశాక పైరసీ సీడీలు మర్నాడే ప్రత్యక్షం అవుతున్నాయి. డిజిటల్‌ టెక్నాలజీతో దానిని కొంతవరకూ అరికట్టగలిగారు . ఇప్పుడు తాజాగా విడుదలయిన ‘దూకుడు’, ‘శ్రీరామరాజ్యం’ మళ్లీ భారీ తెలుగు చిత్ర నిర్మాతలకు కొత్త ఊపిరి పోశాయని చెప్పవచ్చు.

ఇదే ఊపు కొనసాగితే భవిష్యత్‌లో మరిన్ని భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తాయని చెప్పవచ్చు. నిర్మాణ ఖర్చులు పెరిగిపోయి ఒక్కో సినిమాకు 30 నుంచి 50 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టవలసి వస్తోంది. అయితే అంత భారీ ఎత్తున ఒక సినిమాకు పెట్టుబడిగా పెట్టి తిరిగి రాబట్టగలమా ?అనే ప్రశ్నలకు ఇటీవల విడుదలైన పెద్ద సినిమాల కలెక్షన్లే చెబుతున్నాయి. అయితే ఊరికే భారీ సెట్టింగులు పెట్టి అనవసర ఖర్చులతో తీసిన సినిమాలు ప్రేక్షకుల ఆదరణకు నోచుకోక బాక్సాఫీస్‌ వద్ద బొక్కబోర్లా పడ్డాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని నిర్మాత- అందులో విషయం ఉందా లేదా? అని ఆలోచించుకుని .. .. బలమైన కథ, సన్నివేశాలతో ప్రేక్షకులను మెప్పిస్తే అది భారీ చిత్రామా లేక చిన్న చిత్రమా అని ఆలోచనలేకుండా ప్రేక్షకులు వాటికి బ్రహ్మరథం పడతారు.

బాపు-రమణల అపురూప దృశ్యకావ్యంగా మలచబడిన ‘శ్రీరామరాజ్యం’ విడుదలై అఖండ విజయం సాధించడం ఇండస్ట్రీ గర్వించదగ్గ అంశం. ఈ రోజుల్లో పౌరాణికాలు చూస్తారా?- అనే సందేహాలకి ఈ చిత్ర విజయం గట్టి సమాదానమే చెప్పింది. త్వరలో శ్రీరామరాజ్యం ను తమిళంలో డబ్‌ చేస్తున్నారని సమాచారం. ఇంత చక్కని చిత్రాన్ని ఏ భాషలోనైనా డబ్‌ చేసి విడుదల చేయవచ్చు. విదేశాలలో కూడా ఈ చిత్రానికి గొప్ప స్పందన వస్తోంది. తెలుగుదనాన్ని అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శించగలిగే అద్భుత దృశ్యకావ్యం అందించిన నిర్మాత యలమంచిలి సాయిబాబు-బాపు అభినంద నీయులని అని తెలుగునాట ప్రశంసల వర్షం కురుస్తోంది. . ‘శ్రీరామరాజ్యం’ ఇచ్చిన సరికొత్త ప్రోత్సాహంతో మరికొన్ని తెలుగుదనం పరిమళించే తేటతెలుగు చిత్రాలను ఆదరిద్దాం. మరుగు బడి పోయిన మన తెలుగుదనాన్ని తిరిగి మన చిత్రాల్లోకి తెచ్చుకుందాం.