Bookmark and Share   Cinevinodam
Subscribe
 
 
టాలీవుడ్ ట్వంటీ20 విజేత ‘నాగ్ కింగ్స్’

     తెరపై తళుకులీనే తారలు బ్యాటూ, బాల్‌తో అదరగొట్టారు. క్రికెటర్ల క్రికెట్‌ మ్యాచ్‌లకు ఏమాత్రం తీసిపోని రీతిలో పోటాపోటీగా సాగిన మ్యాచ్‌లతో కిక్కిరిసిన స్టేడియంలోని క్రీడాభిమానులు క్రికెట్‌ మజాను రుచి చూశారు. పేద కళాకారులు... చేనేత కార్మికుల కోసం ఆదివారం హైదరాబాద్‌లోని లాల్‌బహుదూర్‌ స్టేడియంలో నిర్వహించిన టాలీవుడ్‌ ట్వంటీ20 క్రికెట్‌ మ్యాచ్‌లు రసవత్తరంగా సాగాయి. చిరు చీతాస్‌, బాలయ్య లయన్స్‌, నాగ్‌ కింగ్స్‌, వెంకీ వారియర్స్‌ల మధ్య పోటీ నువ్వానేనా అన్నట్లుగా సాగింది. ఆదివారం ఉదయం ప్రారంభమైన ఈ పోటీలకు ముందు జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తెదేపా అధినేత చంద్రబాబు హాజరయ్యారు. 'పేద కళాకారులు, కార్మికులు, చేనేత కార్మికుల కోసం తెలుగు చలన చిత్రసీమ చేస్తున్న ఈ కార్యక్రమం దేశానికే స్ఫూర్తిదాయకం. భవిష్యత్తులో ఇలాంటి పెద్ద కార్యక్రమాలు నిర్వహించడంద్వారా మీరు చేస్తున్న సామాజిక సేవను ప్రజలు అనుసరిస్తారు' అని చంద్రబాబు ప్రశంసించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో అక్కినేని నాగేశ్వరరావు, సుబ్బరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

డ్రా ప్రకారం బాలయ్య లయన్స్‌, వెంకీ వారియర్స్‌ మధ్య మొదటి మ్యాచ్‌ మొదలైంది. టాస్‌ గెలుచుకున్న వెంకీ వారియర్స్‌ ఫీల్డింగ్‌ ఎంచుకున్నారు. బ్యాటింగ్‌ ప్రారంభించిన బాలయ్య లయన్స్‌ జట్టు 16 ఓవర్లలో 59 పరుగులకే ఆలౌట్‌ అయింది. 60 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెంకీ వారియర్స్‌ బ్యాట్స్‌మన్లు అద్భుతంగా రాణించడంతో కేవలం 9.4 ఓవర్లలోనే 60 పరుగులు వచ్చాయి.

చిరు చీతాస్‌, నాగ్‌ కింగ్స్‌ జట్ల మధ్య పోటీలో టాస్‌ గెలిచిన నాగ్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్నారు. 20 ఓవర్లు ముగిసేసరికి కింగ్స్‌ టీం ఆరు వికెట్ల నష్టానికి 159 పరుగులు సాధించింది. 160 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్‌ ప్రారంభించిన చిరు చీతాస్‌ 147 పరుగులకు ఆలౌట్‌ కావడంతో నాగ్‌ కింగ్స్‌ జట్టు గెలుపొందింది.

వెంకీ వారియర్స్‌, నాగ్‌ కింగ్స్‌ మధ్య ఫైనల్‌ పోరు మొదలైంది. సమయం మించిపోవడంతో ఫైనల్‌ మ్యాచ్‌ను 10 ఓవర్లకు కుదించారు. నాలుగు జట్లలోని సభ్యులను ఫైనల్‌ పోరులో తలపడే రెండు జట్లలో సర్దుబాటు చేశారు. తొలుత వెంకీ వారియర్స్‌ జట్టు బ్యాటింగ్‌కు దిగి నిర్ణీత 10 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. ఇందులో హ్యాపీడేస్‌లో విలన్‌ పాత్రధారి ఆదర్శ్‌ అర్ధ సెంచరీ చేయడం విశేషం. అనంతరం బరిలోకి దిగిన నాగ్‌ కింగ్స్‌ మరో ఓవర్‌ మిగిలి ఉండగానే 89 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఫైనల్‌లో అఖిల్‌ అర్ధ సెంచరీ చేశాడు. మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా అఖిల్‌ ఎంపికయ్యాడు. బ్యాటింగ్‌, బౌలింగ్‌తో మొత్తం టోర్నమెంటులో అఖిల్‌ ఆట పలువుర్ని ఆకట్టుకుంది.

అందరికీ కప్‌...: వర్షం కారణంగా ఫైనల్‌ మ్యాచ్‌ ఆలస్యం కావడం... ముఖ్యమంత్రి రోశయ్య రాకతో ఆటను కాసేపు నిలిపేశారు. మ్యాచ్‌ద్వారా వచ్చిన ఆదాయాన్ని ముఖ్యమంత్రి చేతుల మీదుగా సంబంధీకులకు అందజేశారు. నాలుగు జట్ల కెప్టెన్లకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ట్రోఫీని అందజేశారు. అనంతరం రోశయ్య మాట్లాడుతూ 'రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎప్పుడూ ముందుంటుంది. ఇలా సాయం చేస్తున్న సినీ పరిశ్రమకు ఎలాంటి పరిస్థితి ఏర్పడ్డా ప్రభుత్వం తోడ్పాటును అందిస్తుంది. వారి సమస్యల్ని పరిష్కరిస్తుంది' అని పేర్కొన్నారు. 1990 నుంచి సినీ పరిశ్రమ ఆరు టోర్నీలను నిర్వహించిందని, అందులో అత్యుత్తమైంది ఈ రోజు జరుగుతున్న టీ20 టోర్నీ అని దాసరి నారాయణరావు పేర్కొన్నారు.

మ్యాచ్‌ల ద్వారా వచ్చిన సొమ్ముతో చేసిన సాయమిదీ...
*మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌కు రూ.1.5 కోట్లు.
*చేనేత కార్మికుల సహాయ నిధికి రూ.15 లక్షలు.
*ఏపీ ఫిలిం ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌కు రూ.5 లక్షలు.
*ఏపీ సినీ డ్యాన్సర్స్‌ అసోసియేషన్‌కు రూ.3 లక్షలు.
*హైదరాబాద్‌ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌కు రూ.8 లక్షలు.
*సింహా నిర్మాత పరుచూరి కిరీటి, సమర్పకుడు పరుచూరి శివప్రసాద్‌, దర్శకుడు బోయపాటి శ్రీను సిటీ పోలీసు సంక్షేమ నిధికి రూ.5లక్షల చెక్కు

 
 

Copy right reserved for www.cinevinodam.com 2005