Bookmark and Share   Cinevinodam
Subscribe
 
 
వంద కోట్లు దాటిన సినిమా నష్టం

     తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం అన్ని పరిశ్రమల మీద ప్రభావం చూపినట్లే సినిమా పరిశ్రమ మీద కూడా తీవ్ర ప్రభావాన్ని చూపింది. ముఖ్యంగా తెలుగు సినిమా పరిశ్రమ టాలీవుడ్‌ సుమారు వందకోట్ల మేర నష్టాన్ని చవిచూసింది.బాక్స్‌ ఆఫీస్‌ కలెక్షన్‌లు గతంలో ఎన్నడు లేని విధంగా అతి దారుణంగా దిగజారడం సినిమా పరిశ్రమను కుదిపేసింది. ప్రత్యేక తెలంగాణ కోసం జరిగిన ఉద్యమంలో భాగంగా వివిధ సందర్భాల్లో ఉద్యమ కారులు ఇచ్చిన బంద్‌ పిలుపులతో రాష్ట్రంలోని సుమారు 2,600 థియేటర్లు మూతపడ్డాయి. దీంతో రెవెన్యూ పూర్తిగా దిగజారిందని వ్యాపార వర్గాలు అంటున్నాయి. ఈ ఉద్యమాల వల్ల మేము రోజుకు కనీసం రూ.7 కోట్ల వరకు నష్టపోయాము. చాలామంది చిన్న తరహా ఎగ్జిబిటర్స్‌ అయితే తీవ్రంగా నష్టపోయారని ఎ.పి ఫిలిం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ కార్యదర్శి శేఖర్‌బాబు అన్నా రు.

దీంతో ప్రస్తుతం విడుదల కావలసిన చాలా చిత్రాలను వాయిదా వేశామని, చాలా మంది నిర్మాతలు సైతం తమ చిత్రాల విడుదల విషయంలో వెనకడుగు వేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రేక్షకులు ఎన్నో ఆశలు పెట్టుకున్న నందమూరి తారకరామరావు(జూ.ఎన్టీఆర్‌) నటించిన ‘అదుర్స్‌’ చిత్రం విడుదల కూడా నిరవధికంగా వాయిదా పడింది. వాస్తవానికి ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కావలసి ఉంది. అయితే ఎన్‌టిఆర్‌ తండ్రి, నటుడు, రాజ్యసభ సభ్యుడు అయిన హరికృష్ణ సమైఖ్యాంధ్రకు మద్దతునివ్వడం, మామ, టీడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబునాయుడు తెలంగాణా విషయంలో ఎటూ తేల్చకపోవడంతో సహజంగానే తెలంగాణ ప్రాంతంలో చిత్రాన్ని అడ్డుకుంటామని తెలంగాణా వాదులు హెచ్చరించిన నేపథ్యంలో చిత్ర విడుదలను వాయిదా వేశారు. మా కొత్త చిత్రం ‘సలీమ్’ను వెనుకకు తీసుకుంటున్నాము. ఇప్పటికే రెవెన్యూ 50 శాతం వరకు పడిపోయిందని నిర్మాత, డిస్టిబ్యూటర్‌ అయిన డి.సురేష్‌బాబు అన్నారు.

ఇక థియేటర్స్‌ ఆదాయం కూడా 30 శాతం వరకు పడిపోయింది. ప్రస్తుతమున్న పరిస్థితికి మరింత ఆజ్యం పోస్తూ ప్రజారాజ్యం పార్టీ అధినేత, మెగాస్టార్‌ చిరంజీవి సమైఖ్యాంధ్రకు మద్దతుగా నిర్ణయం తీసుకోవడంతో పాటు తన ఎమ్మెల్యే స్తానానికి సైతం రాజీనామా చేశాడు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు నటించిన చిత్రాలపై తెలంగాణాలో తీవ్ర ప్రభావం పడింది. చిరంజీవి తనయుడు రామ్‌చరణ్‌తేజ, అల్లుడు అల్లుఅర్జున్‌ చిత్రాలపై తెలంగాణా వాదులు తమ ప్రతాపాన్ని చూపారు. హైదరాబాద్‌తో పాటు తెలంగాణ ప్రాంతంలోని అన్ని థియేటర్లలో చరణ్‌ నటించిన ‘మగధీర’, అర్జున్‌ నటించిన ‘ఆర్య -2’ చిత్రాలను నిలిపివేశారు.

మూడు కుటుంబాలకు చెందిన అగ్రహీరోల చిత్రాలను బ్యాన్‌ చేయడంతో డిస్ట్రిబ్యూటర్స్‌ అసోసియేషన్‌ దృష్టి డబ్బింగ్‌ చిత్రాలపై పడింది. పలు ఇంగ్లీషు చిత్రాలు తెలుగులోకి అనువ దింపబడుతుండడంతో ఆ చిత్రాల కోసం డిస్టిబ్యూటర్‌లు పరుగులు పెడుతున్నారు.

 
 

Copy right reserved for www.cinevinodam.com 2005