Bookmark and Share   Cinevinodam
Subscribe
 
 
2009లో కుదేలయిన తెలుగు సినిమా

     క్రికెట్‌, స్వైన్‌ఫ్లూ, ఎన్నికలు, వై.ఎస్‌. మరణం, వరదలు, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం... ఇలా ఎన్నో ఎదురుదెబ్బలు తిన్న తెలుగు సినిమా 2009లో దయనీయమైన పరిస్థితిని ఎదుర్కొంది. దీనికి తోడు, మన దర్శక నిర్మాతలు ప్రేక్షకులను సృజనాత్మకంగా ఆకట్టుకోలేక పోవడం మరో కారణం. ఈ ఏడాది దాదాపు 130 వరకూ స్ట్రెయిట్‌ చిత్రాలు, 40 వరకూ డబ్బింగ్‌, 20 వరకూ ఇంగ్లీషు అనువాదాలు వచ్చాయి. అందులో విజయవంతమైన చిత్రాలను వేళ్ళ మీద లెక్కించొచ్చు. ఇంతవరకూ ఇంత తక్కువ 'సక్సెస్‌ రేట్‌' ఎప్పుడూ లేదు. అందులో 'మగధీర' సూపర్‌ డూపర్‌ హిట్‌ అయ్యి దాదాపు 66 కోట్లు వసూలు చేసి తెలుగు సినిమా స్టామినాను పెంచింది. 'అరుంధతి' కూడా సూపర్‌హిట్‌ అయ్యింది. ఈ రెండు చిత్రాలు వసూళ్ళ విషయంలోనే కాకుండా సాంకేతికంగా కూడా తెలుగు సినిమాను మరింత ముందుకు తీసుకెళ్ళాయి. 'కిక్‌' కూడా సూపర్‌ హిట్‌ అయ్యింది. 'బెండు అప్పారావు' మంచి విజయాన్ని సాధించింది. 'ఫిట్టింగ్‌ మాస్టర్‌', 'శశిరేఖా పరిణయం', 'బిల్లా'; 'మస్కా', 'రైడ్‌', 'బంపర్‌ఆఫర్‌' వంటి చిత్రాలు ఫర్వాలేదని అనిపించుకున్నాయి. 'గోపి - గోపిక - గోదావరి', 'మెంటల్‌ కృష్ణ' మంచి పేరు తెచ్చుకోలేకపోయినా వ్యాపార విజయం సాధించాయి. ఆంగ్ల అనువాద చిత్రాల్లో '2012', 'అవతార్‌' భారీ తెలుగు చిత్రాలను మించి వసూళ్ళు సాధించడం విశేషం. ఇతర అనువాద చిత్రాల్లో 'ఆకాశమంత', 'నింగీ నేలా నాదే' చిత్రాలకు మంచి పేరు వచ్చింది.

అగ్రహీరోలు నాగార్జున, మహేష్‌బాబు, ఎన్టీఆర్‌, పవన్‌కళ్యాణ్‌లు నటించిన ఒక్క చిత్రం కూడా విడుదల కాకపోవడం ఈ ఏడాది మరో విశేషం. బాలకృష్ణ 'మిత్రుడు', విక్రమ్‌ 'మల్లన్న', గోపీచంద్‌ 'శంఖం', విష్ణు 'సలీమ్‌', కళ్యాణ్‌రామ్‌ 'జయీభవ', కమల్‌- వెంకటేష్‌ల 'ఈనాడు', మనోజ్‌ 'ప్రయాణం', రామ్‌ 'గణేష్‌', విశాల్‌ 'పిస్తా', ప్రభాస్‌ 'ఏక్‌నిరంజన్‌', డా||రాజశేఖర్‌ 'సత్యమేవ జయతే', 'నా స్టైలే వేరు', వరుణ్‌ సందేశ్‌ 'ఎవరైనా ఎపుడైనా', 'కుర్రాడు', నితిన్‌ 'ద్రోణ', 'అడవి', 'రెచ్చిపో', జగపతిబాబు 'సిద్ధం', 'అధినేత', 'బంగారుబాబు',; 'ప్రవరాఖ్యుడు', నారాయణమూర్తి ''కూతురు కోసం'', పోసాని కృష్ణమురళి 'రాజావారి చేపల చెరువు' పరాజయం పాలయ్యాయి.

రాజకీయ నేపధ్యంలో దాసరి తీసిన 'మేస్త్రి'ని ప్రేక్షకులు ఆదరించలేదు. నాగార్జున కుమారుడు నాగచైతన్యను హీరోగా పరిచయం చేస్తూ, ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మించిన 'జోష్‌' పెద్ద ఫ్లాప్‌ అయ్యింది. నారా చంద్రబాబు సోదరుని కుమారుడు రోహిత్‌ హీరోగా పరిచయం అయిన 'బాణం' మంచిపేరు సంపాయించినా, ఆర్థిక విజయం సాధించలేదు. శ్రీకాంత్‌ 100వ చిత్రంగా కృష్ణవంశీ దర్శకత్వంలో నిర్మించిన 'మహాత్మ' విజయవంతం కాలేదు. గత ఏడాది విజయవంతం అయిన 'మంత్ర', 'అనసూయ' దారిలో ఈ ఏడాది నిర్మించిన 'కావ్యాస్‌ డైరీ', 'రాత్రి', 'డైరీ', 'ఆ ఇంట్లో', 'అమరావతి' పరాజయం పాలయ్యాయి. 'జీ టివి' వారు నిర్మించిన 'మస్త్‌', 'మనోరమ' నష్టాలు మిగిల్చాయి. గున్నం గంగరాజు నిర్మించిన 'కథ', అతని కుమారుడు సందీప్‌ దర్శకత్వం వహించిన 'కుర్రాడు' ఫ్లాప్‌ అయ్యాయి. తక్కువ ప్రచారంతో చిన్న బడ్జెట్‌లో ఉషాకిరణ్‌వారు గత ఏడాది నిర్మించిన 'నచ్చావులే' విజయవంతం అయితే, ఈ ఏడాది అదే తరహాలో చేసిన 'నిన్ను కలిశాక' పరాజయం పొందింది. హీరో అయిన విలన్‌ అజయ్‌ నటించిన 'ఆ ఒక్కడు', 'సారాయి వీర్రాజు', ముమైత్‌ ఖాన్‌ హీరోయిన్‌గా చేసిన 'టార్గెట్‌', 'పున్నమినాగు', నమిత హీరోయిన్‌గా చేసిన 'జగన్మోహిని' ఫ్లాప్‌ కావడం వారి కెరీర్‌కి ఇబ్బందికరంగా మారింది. తారకరత్న హీరోగా చేసిన 'వెంకటాద్రి', విలన్‌గా చేసిన 'అమరావతి' ఫ్లాపయ్యాయి. శివాజి, గణేష్‌, కళ్యాణి, రమణగోగుల నిర్మాతలుగా మారారు. రామానాయుడు మనవడు రానా 'లీడర్‌'తో హీరోగా సినిమా రంగ ప్రవేశం చేశాడు.

'మగధీర'తో రామ్‌చరణ్‌ తేజ, 'అరుంధతి'తో అనూష్కలు అగ్రస్థానానికి చేరారు. 'ఆర్య - 2'లో అల్లు అర్జున్‌ స్టైలిష్‌ నటనకు విశేష ప్రశంసలు అందుకున్నారు. ఈ ఏడాది ఆకాష్‌, చిన్నా, ప్రకాష్‌రాజ్‌లు దర్శకులుగా మారారు. ఆకాష్‌ 'స్వీట్‌ హార్ట్‌', చిన్నా 'ఆ ఇంట్లో' పరాజయం పాలయ్యాయి. 'మగధీర'తో దర్శకుడిగా రాజమౌళి తిరుగులేని స్థానాన్ని అధిరోహించారు. 'అరుంధతి' విజయం ఘనత కోడిరామకృష్ణకు బదులు శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, రాహుల్‌ నంబియార్‌లకు దక్కింది. 'కిక్‌'తో సురేందర్‌ రెడ్డి మరోసారి ప్రేక్షకులకు దగ్గరయ్యారు. 'ఫిట్టింగ్‌ మాస్టర్‌', 'బెండు అప్పారావు'లతో ఇవివి సక్సెస్‌ బాటలోనే ఉన్నారు. పూరి జగన్నాథ్‌కి 'ఏక్‌నిరంజన్‌', కృష్ణవంశీకి 'మహాత్మా' ఆశించిన ఉత్సాహాన్ని ఇవ్వలేదు. 'ఒక్క మగాడు' తరహాలోనే 'సలీమ్‌' కూడా నడవడంతో వై.వి.ఎస్‌.చౌదరి డీలా పడిపోయాడు. హాలీవుడ్‌కు మనం ఏం తక్కువ? అంటూ ప్రశ్నించిన రవిబాబు 'అమరావతి'ని చూసిన వాళ్ళు జడుచుకున్నారు. 'ఆర్య-2'తో కొత్తదనానికి ప్రతీకగా సుకుమార్‌ అభినందనలు పొందారు. 'బాణం'తో చైతన్య, 'ఓయ్‌'తో ఆనంద్‌ రంగా, 'కొంచం ఇష్టం - కొంచం కష్టం'తో డాలీ మంచి పేరు సంపాయించారు.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయశాంతి పార్లమెంట్‌కు ఎన్నికకాగా, కృష్ణంరాజు, మురళీమోహన్‌, అల్లు అరవింద్‌ ఓడిపోయారు. అసెంబ్లీకి చిరంజీవి పోటీ చేసిన రెండుస్థానాల్లో ఒకటి గెలిచి, ఒకటి ఓడారు. అధికారం కోసం పోటీపడ్డ చిరంజీవికి రాజకీయ భవిష్యత్‌ లేదని ప్రజలు తేల్చేశారు. జయసుధ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. రోజా, పోసాని కృష్ణమురళి, బాబూమోహన్‌ ఓడిపోయారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎన్టీఆర్‌ తన ప్రజాకర్షణ శక్తిని నిరూపించుకున్నారు.

పాప్‌కింగ్‌ మైఖేల్‌ జాక్సన్‌ మరణం వినోద ప్రపంచానికి పెద్ద షాక్‌ ఇచ్చింది. ఎ.ఆర్‌.రెహమాన్‌కు ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్‌ అవార్డు లభించడం ఈ ఏడాది మనం గర్వించాల్సిన మరో విశేషం. హీరో కృష్ణకు పద్మభూషణ్‌, బ్రహ్మానందంకు పద్మశ్రీ, ప్రకాష్‌రాజ్‌కు జాతీయ ఉత్తమనటుడు అవార్డు లభించాయి.

కాంతారావు, ఎస్‌.వరలక్ష్మీ, నగేష్‌, నిర్మలమ్మ, కె.ఎస్‌.రామిరెడ్డి, గుత్తా రామినీడు, ఫైట్‌మాస్టర్‌ రాజు వంటి సినిమా ప్రముఖులను పరిశ్రమ కోల్పోయింది.

థియేటర్ల గుత్తాధిపత్యం పోవాలని పర్సంటేజి విధానంలో సినిమాలు ప్రదర్శిచాలంటూ చిన్న నిర్మాతలు ఉద్యమించి, కొంతమేరకు విజయం సాధించారు. 'చిన్న చిత్రాల పరిరక్షణ సమితి'ని ఏర్పాటు చేసి కొన్ని చిత్రాల విడుదలకు తోడ్పడ్డారు. వరద బాధితుల సహాయార్థం దాసరి ఆధ్వర్యంలో సినిమా కళాకారులు ఏర్పాటు చేసిన 'స్పందన' కార్యక్రమం ద్వారా 6 కోట్లకు పైగా వసూలు చేశారు. ఏడాది చివరిలో ప్రత్యేక, సమైక్య ఉద్యమాల వల్ల చిత్ర పరిశ్రమ తీవ్రమైన నస్టాలను చవిచూసింది.

- రాజేష్‌

 
 

Copy right reserved for www.cinevinodam.com 2005