మసాలా
 
 
 
 
అతడు నాకు మంచి మిత్రుడు

పబ్‌లు, పార్టీలకు వెళ్లేది సంతోషం కోసమేనని అంటున్నారు నటి త్రిష. చిత్రరంగ ప్రవేశం చేసి పదేళ్లు దాటినా చెక్కు చెదరని అందాలతో అభిమానుల గుండెల్లో నిలిచి పోయిన సుందరి త్రిష. ఆమెతో చిన్న భేటీ..

మీరు చిత్ర రంగంలోకి ప్రవేశించి పదేళ్లు దాటింది. ఇన్నేళ్లలో ఎవరి అవకాశాన్నయినా చేజిక్కించుకోవడం గాని, మీ అవకాశాన్ని ఇతర హీరోయిన్లు కాజేయడం గాని జరిగిందా?
అలా ఏమీ జరగలేదు. నేను నటించాల్సిన చిత్రంలో కొన్ని కారణాల వల్ల మరో నటి నటించి ఉండవచ్చు. అలాగే వేరే నటి నటించాల్సిన పాత్ర నన్ను వరించి ఉండవచ్చు. ఆడుగళం చిత్రంలో హీరోయిన్‌గా మొదట నేను ఎంపికయ్యాను. నాలుగు రోజులు షూటింగ్ కూడా చేశాను. ఆ తరువాత కాల్‌షీట్స్ సమస్య తలెత్తడంతో ఆ చిత్రం నుంచి వైదొలిగాను.

ఇంటర్‌నెట్‌లో బాత్‌రూమ్ దృశ్యాలంటూ మీ జీవితంలో జరిగిన ఒక దురదృష్టకరమైన సంఘటన నుంచి ఎలా బయటపడగలిగారు?
ఆ సంఘటనతో నేను నా కుటుంబం దిగ్భాంతికి గురైన విషయం విదితమే. బేలత్వంతో కృంగి పోలేదు. ఉన్నత స్థితికి చేరుకున్నందుకు నేను చెల్లించుకున్న మూల్యం అది. తాటాకు చప్పుళ్లకు బెదిరిపోయే అమ్మాయిని కాదు. ఏడుస్తూ కూర్చుంటే నన్ను అబాసుపాలు పాలు చేసిన వాళ్లు సంతోషపడతారు. అలాంటి అవకాశాన్ని వారికి నేనెందుకు ఇవ్వాలి? ప్రస్తుతం చాలామంది అబలలు ఇలాంటి అపాయాల్లో చిక్కుకుని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వారికి నేను చెప్పేది ఒక్కటే. అన్యాయాలు, అక్రమాలను ధైర్యంగా ఎదుర్కొని పోరాడాలని.

సిడ్నీ అనే కాస్టూమర్‌తో చనువుగా మసలుకుంటున్నారని, ఆయనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారనే ప్రచారం జరుగుతోంది?
సిడ్నీ ఒక ఫ్యాషన్ డిజైనర్. నాకు మంచి మిత్రుడు కూడా. సినిమాలో మనతో పని చేసే వాళ్లతో ఫ్రెండ్స్‌గా నడుచుకుంటే చాలా సౌకర్యాలున్నాయి. సిడ్నీకి సంబంధించినంత వరకు నాకేది ఇష్టమో అయిష్టమో బాగా తెలుసు. నా అందాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నించే మంచి స్నేహితుడు అతడు. అలాంటి వ్యక్తికి ప్రాధాన్యత నివ్వడంతో తప్పేముంది.

త్రిష అనగానే ఒక పార్టీ గర్ల్ అని జరుగుతున్న ప్రచారం గురించి మీ స్పందన?
సినిమాలో చాలా టెన్షన్స్ ఉంటాయి. మాకు కొంచెం రిలీఫ్ కావాలి. పార్టీలు జరుపుకోవడం అనేది నా స్వంత విషయం. నా కోసం నేను వెతుక్కునే సంతోషమైనా ఇలాంటివి నేనే మీ రహస్యంగా చేసుకోవడం లేదుగా. అందరికీ తెలిసిన విషయమే. అందువల్లే ఇలాంటి సంచలన ప్రచారం జరుగుతోంది. నేనెక్కడికి వెళ్లినా మా అమ్మకు చెప్పే వెళతాను.

నటించింది చాలు. పెళ్లి చేసుకుని సెటిల్ అవుతామని ఎప్పుడైనా అనిపించిందా?
ఇప్పటి వరకు అలాంటి ఆలోచన రాలేదు. ఏ విషయంలోనైనా అనాలోచనగా ప్రవర్తించే యువతిని కాదు నేను. ఎవరినో మోహించి పెళ్లి చేసుకుని పది నెలల్లోనే డైవర్స్ కోరుకోవడం లాంటి కార్యాలకు నేను వ్యతిరేకిని.