మసాలా
 
 
 
 
శవం పక్కనే శృంగారం వార్తలతో వర్మ షాక్
ఇటీవల రక్తచరిత్ర తీసి సంచలనం సృష్టించిన రామ్‌గోపాల్ వర్మ.. ఇలాంటిదే మరో సినిమాను ప్రేక్షకుల ముంగిటికి తీసుకువస్తున్నాడు. నీరజ్ గ్రోవర్ అనే టీవీ చానెల్ ఉద్యోగిని మరియా సుసైరాజ్, ఆమె ప్రియుడు కలిసి హత్య చేయడాన్ని ఆధారంగా తీసుకొని వర్మ ‘నాట్ ఏ లవ్ స్టోరీ’ని రూపొందించాడు. మూడేళ్ల శిక్ష అనంతరం మరియా ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే. సునీల్ బోహ్రా నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలవుతోంది. కన్నడ నటి మరియా, నేవీ మాజీ అధికారి ఎమైల్ జెరోమ్ మాథ్యూ కలిసి గ్రోవర్‌ను ఆమె ఫ్లాట్‌లోనే హతమార్చినట్టు కోర్టు నిర్ధారించింది. జెరోమ్‌కు ముంబై కోర్టు పదేళ్ల శిక్ష విధించడంతో అతను ఇప్పటికీ జైల్లోనే ఉన్నాడు. మరో సంగతేమంటే గ్రోవర్‌ను హతమార్చాక.. ఆ శవం పక్కనే వీరిద్దరూ శృంగారంలో పాల్గొన్నారని వార్తలు వచ్చాయి.

క్రైమ్ థ్రిల్లర్‌లా అనిపించే ఈ ఘటనను సినిమాగా తీయాలని వర్మ నిర్ణయించుకున్నాడు. దీంతో విడుదలకు ముందే ఈ సినిమాకు విపరీతమైన ప్రచారం వచ్చిపడింది. నటీనటులుగా మహీ గిల్, దీపక్ దోబ్రియాల్, అజయ్ గెహీ, ఊర్మిళా మతోంద్కర్‌ను ఎంచుకున్నాడు. ఇది ఆత్మకథలాంటి చిత్రమన్న వార్తలను వర్మ తోసిపుచ్చాడు. ప్రచార వీడియాల్లో మాత్రం మహీ, దీపక్‌లు అజయ్ గెహీని హతమార్చి అడవిలో అతని శరీర భాగాలను దహనం చేసినట్టు చూపిస్తున్నారు. మరియా, జెరోమ్ కూడా గ్రోవర్‌ను ముక్కలు ముక్కలుగా నరికి దహనం చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు.

మరో సంగతేమంటే ఈ సినిమా తన కథను పోలి ఉందని అనుమానించిన మరియా.. విడుదలకు ముందే దీనిని తనకు చూపించాలంటూ వర్మకు నోటీసులు పంపింది. తనను చెడుగా చూపించినట్టు ఆమె అనుమానిస్తోంది. జెరోమ్ కూడా నోటీసులు పంపించాడు. నేరగాళ్ల మానసిక ప్రవర్తనకు సంబంధించిన అంశాలు తనకు ఇష్టం కాబట్టే ఈ కథను తన సినిమాకు ఎంచుకున్నానని వర్మ వివరణ ఇచ్చాడు. ఒక మహిళ, ఆమె ప్రియుడు వేరే వ్యక్తిని చంపి, శవం పక్కనే శృంగారంలో పాల్గొన్నారంటూ వచ్చిన వార్తలతో షాక్ తిన్నానని చెప్పాడు. సాదాసీదాగా ఉండే వ్యక్తులు ఎందుకు ఇలా చేస్తారో తెలుసుకోవాలని అనిపించిందని రామ్‌గోపాల్‌వర్మ వివరించాడు.