'మిస్ ఇండియా యూనివర్స్ 'అయామ్ షీ-2011' పోటీల్లో పాల్గొన్నప్పుడు గెలవగలను అనే ఆత్మ విశ్వాసంతో ఉన్నాను. ఫైనల్‌లో
గెలుపొందినట్లు నా పేరు ప్రకటించగానే నా మైండ్ ఒక్కసారిగా బ్లాంక్. చాలా ఆనందంగా ఉంది. ఆ క్షణంలో నాకు కల్గిన అనుభూతి మాటల్లో
చెప్పలేను. దేశానికి ప్రాతినిథ్యం వహించడం గర్వంగా ఉంది. అదే సమయంలో ఎంతో బాధ్యత కూడా' అని మిస్ ఇండియా యూనివర్స్‌గా
ఎంపికైన తొలి తెలుగమ్మాయి సుంకవల్లి వాసుకి అన్నారు. శుక్రవారం రాత్రి ముంబయిలో జరిగిన ఫైనల్ పోటీలో గెలుపొందినప్పటి నుంచి
మిత్రులు, శ్రేయోభిలాషులు, మీడియా ఫోన్లతో బిజీబిజీగా ఉన్న వాసుకి కాసేపు మాట్లాడారు. సెప్టెంబరులో జరిగే మిస్ యూనివర్స్-2011లో
భారత్‌కు అందాల కిరీటాన్ని అందిస్తాననే ధీమాని వ్యక్తం చేశారు. ఇది అతిశయోక్తి కాదు. ఎందుకంటే.. సాధారణంగా అందాల పోటీల్లో జడ్జీలు
ఒక్కొక్కరు మార్కులు వేసి వాటిని సగటు చేసి ఎక్కువ మార్కులు వచ్చినవారిని ఫైనల్ విజేతగా ప్రకటిస్తారు. వాసుకి ఆత్మవిశ్వాసానికి
ముగ్ధులైన జడ్జీలంతా ఏకగ్రీవంగా ఆమెను ఎంపిక చేయడం అందాల పోటీల్లో చాలా అరుదైన విషయం. అయితే ఆమె గురించి మనకు ఆసక్తే
కదూ! ఆ వివరాలు..
బాల్యం:
బంజారాహిల్స్ రోడ్ నెంబరు 2లో నివసించే వాసుకి పుట్టి పెరిగింది అంతా నగరంలోనే. తల్లిదండ్రులు
సుంకవల్లి వెంకటరమణ, సూర్యప్రభ స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా ఉంగటూరు అయినా హైదరాబాద్‌లో దశాబ్దాలుగా స్థిరాస్తి, వెండి
వ్యాపారంలో స్థిరపడ్డారు. వీరికి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. అమ్మాయి వాసుకి సికింద్రాబాద్‌లోని సెయింట్ ఆన్స్‌లో పదోతరగతి వరకు,
కోయంబత్తూర్‌లోని చిన్మయ కళాశాలలో, హైదరాబాద్‌లోని విల్లామేరిలో ఇంటర్ చదివారు. పుణెలో ఐదేళ్ల న్యాయశాస్త్రం అభ్యసించారు.
హాబీగా:
డిప్లామా ఇన్ లా చదివేందుకు ఢిల్లీ రావడం ఆమె కెరీర్‌ను మలుపు తిప్పింది. ఆ సమయంలో
మోడలింగ్‌పై ఆసక్తి ఏర్పడింది. చదువుకు ఆటంకం కల్గకుండా హాబీగా కొన్ని ప్రకటనల్లో నటించింది. రీబాక్, నైకి, కిట్‌క్యాట్ వంటి అంతర్జాతీయ
బ్రాండ్లకు మోడల్‌గా చేసింది. కానీ ఎప్పుడూ ప్రొఫెషనల్‌గా గ్రూమ్ అయ్యింది లేదు. మిస్ వరల్డ్, మిస్ ఇండియా యూనివర్స్‌కు పోటీపడమని
అభ్యర్థనలు వచ్చినా మూడేళ్లుగా తిరస్కరిస్తూ వస్తోంది. అందుకు కారణం తాను అనుకున్న లక్ష్యం. అదే న్యూయార్క్‌లో ఇంటర్నేషనల్ లా
అండ్ హ్యుమనిటీస్ పూర్తిచేయడం. అనంతరం కొద్దికాలం యూఎస్‌లో న్యాయవాదిగా చేశారు. ఇప్పుడు ఈ పోటీల్లో పాల్గొనే మిస్
యూనివర్స్‌కు భారత్ తరఫున అర్హత సాధించారు.
ఇంట్లో అభ్యంతరమా?
తెలుగువారంటేనే సంప్రదాయ కుటుంబాలు. పిల్లలు మోడలింగ్ అంటే అభ్యంతరాలు వ్యక్తం
అవుతుంటాయి. కానీ వాసుకి వ్యక్తిత్వం, ఆమె నిర్ణయాలపై తల్లిదండ్రులకు ఉన్న నమ్మకం ధైర్యంగా అడుగుల వేసేలా భరోసా నిచ్చాయి. 'మా
పాప దృక్పథం చాలా భిన్నంగా ఉంటుంది. ఆమె తెలివితేటలు, ఏదీ ఎప్పుడు చేయాలనే ప్రణాళిక, తీసుకునే నిర్ణయాలపై మాకు ఆపారమైన
నమ్మకం. మోడలింగ్ చేస్తానను అన్నప్పుడు మద్దతు పలకడం తప్ప మరో ఆలోచనలే రాలేదు' అన్నారు సూర్యప్రభ. తమ జీవితంలో
ఇప్పటివరకు ఇదే అతిపెద్ద ఆనందకర విషయమన్నారు ఆవిడ.
ఖాళీ సమయాల్లో:
వాసుకి ఖాళీ సమయాల్లో పుస్తకాలు చదువుతుంటారు. కవితలు, ఆర్టికల్స్ రాస్తుంటారు.
ప్రయాణాలు చేయడమంటే భలే సరదా. టర్కీ, ఇజ్రాయెల్ ఆమెకు ఇష్టమైన పర్యాటక ప్రదేశాలు. సమకాలీన రాజకీయ అంశాలపై అమెకున్న
విజ్ఞానం అపారం. టెర్రరిజం మీద ఆర్టికల్ 'టార్గెట్ కిల్లింగ్' పేరుతో ఒక జర్నల్ ప్రచురించారు.
ఆటలన్నా..:
బాస్కెట్ బాల్ అంటే ఆమెకు ఆసక్తి ఎక్కువ. చిన్నప్పడు ఆరేళ్ల పాటూ భరతనాట్యం నేర్చుకున్నారు.
ఈమె బహుముఖ ప్రతిభకు పాఠశాల, కళాశాలల్లో ఎన్నో బహుమతులు.. ప్రశంసలు వచ్చాయి.
సదా సేవలో:
సేవను మాటల్లో చెప్పడం కంటే చేతుల్లో చూపించాలంటారు ఆమె. చిన్నప్పటి నుంచి రక్తదాన
శిబిరాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. తన కళ్లను దానం చేసేందుకు అంగీకరించారు. అమ్మానాన్న కళ్లను దానం చేసేలా వారిని ఒప్పించే పనిలో
ఉన్నారు. ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం, నీటి పొదుపు వంటి వాటిపై తన వంతుగా సహాయపడుతుంటారు. రాజకీయాలపై ఆసక్తి. మంచి
చేయాలనే తపన ఉన్నవారు ఇందులోకి రావాలనేది వాసుకి ఆలోచన.
ఫ్యాషన్స్:
సందర్భాన్ని బట్టి వస్త్రాధారణ చేసుకోవడం 26 ఏళ్ల ఈ సందరికిష్టం. సంప్రదాయాన్ని, వెస్ట్రన్ డ్రెస్‌లను
ఇష్టపడుతుంది. అందమంటే ఆత్మ విశ్వాసమనేది ఈమె చెప్పే స్టేట్‌మెంట్. పోటీల్లో పాల్గొనడం ముఖ్యమని భావించే ఈ భామ... గెలిచినా,
ఓడినా ఒకేలా స్వీకరించే తొణకని కుండ.
హైదరాబాద్‌లో ఉంటే:
స్నేహితులతో ఇంట్లో గడపడానికి మొగ్గుచూపుతారు. సిటీల్లో ఉన్న మ్యూజియాలు
సందర్శించడం ఆమెకి ఇష్టం. అమ్మ చేసే ఆలుగడ్డల చిప్స్ మరీ ఇష్టం.