ఇప్పటికే పీకలలోతు సమస్యలతో దిక్కుతోచని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్న నిర్మాతలపై ఇప్పటికే అమలులో ఉన్న వ్యాట్‌తో పాటు అదనపు వ్యాట్ ట్యాక్స్‌ను విధిస్తూ గతంలో (జి.ఓ ఎంఎస్ నెం.54, డేటెడ్ 19.01.2011 పేర) ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే. కాగా ‘దూకుడు’ చిత్రం ప్రింట్ల వ్యవహారంలో రూ.4 కోట్ల మేరకు వ్యాట్ వసూలు చేయాలని ధికారులు సమాయాత్తమవుతున్నారు. దీనితో తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడి బెంబేలెత్తిపోతుంది. సినిమా వ్యాపారం అనేది కూడా విలువ ఆధారిత పన్ను (వ్యాట్) పరిధిలోకి వస్తుందని, ఆ మేరకుఇకనుంచి సినిమాకు సంబంధించిన ఏ విధమైన కొనుగోలైనా అమ్మకమైనా సరే వ్యాట్ కట్టాల్సిందేనని సదరు జి.ఓలోని సారాంశం.
ఇకపై కఠినతరం చేయనున్నట్లు తెలుస్తోంది. ఫలానా హీరో నటించిన సినిమా 1500 ప్రింట్లతో విడుదల చేస్తున్నాం...రెండు వేల ప్రింట్లతో అట్టహాసంగా విడుదల చేస్తున్నాం అని ప్రకటించే నిర్మాతల గుండెల్లో ఇక రైళ్లు పరిగెట్టనున్నాయి. ఎక్కువ ప్రింట్లతో...ఆర్భాటపు ప్రచారాలతో కేవలం తొలి రెండు వారాలలోనే కలెక్షన్లు మడతెట్టేసుకుని సేఫ్ జోన్‌లోకి వెళ్లిపోదామని ఆలోచించే నిర్మాతలకు కొత్తగా కమర్షియల్ టాక్స్ డిపార్ట్‌మెంట్ ‘వ్యాట్’ పేరిట కొరడా ఝుళిపించనుంది. ఇక టాలీవుడ్ తమ ప్రింట్ల సంఖ్యను పెంచేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించాల్సిన పరిస్ధితి వచ్చింది. మేం వెయ్యి ప్రింట్లతో విడుదల చేస్తున్నాం...లక్ష ప్రింట్లతో రిలీజ్ చేస్తున్నాం అంటూ గొప్పలు చెప్పుకోవటానికి వీలులేదు. ఎందుకంటే వ్యాట్‌తో కమర్షియల్ టాక్స్ డిపార్ట్‌మెంట్ ఇప్పుడు రెడీగా ఉంది.
వారి కన్ను ఇప్పుడు తెలుగు సినిమాలపై పడింది. వారు నాలుగు కోట్ల రూపాయలు వ్యాట్ పన్నును ‘దూకుడు’ చిత్రానికి వేసినట్లు సమాచారం. ‘దూకుడు’ సినిమాని వెయ్యి ప్రింట్లకు పైగానే విడుదల చేసామంటూ నిర్మాతలు ప్రకటించారు.అది బేస్ చేసుకునే వారు పన్నును వడ్డించారు. వారు వెంటనే తమ స్టాఫ్‌ని రంగంలోకి దింపి ల్యాబ్‌లో ఎన్ని ప్రింట్స్ డెలవరీ అయ్యాయో లెక్కలు తీయించారని సమాచారం. అలాగే ‘ఊసరవెల్లికి’ చిత్రానికి కూడా ఇదే పరిస్థితి వచ్చింది. అంతకుముందు ‘కొమురం పులి’ చిత్రాన్ని కూడా వారు పరిగణనలోకి తీసుకుంటున్నారు.ఈ విషయమై కమర్షియల్ టాక్స్ డిపార్టమెంట్ డిప్యూటి కమిషనర్ ఉషారాణి మాట్లాడుతూ..‘మేము నిర్మాతలకు ఈ విషయమై నోటీసులు ఇష్యూ చేస్తున్నాం.
వారు తాము డిస్ట్రిబ్యూటర్‌కి పంపిణీ చేసిన ప్రింట్ల మీద వెంటనే టాక్స్ కట్టాలని చెబుతున్నాం’ అన్నారు. ఇక వ్యాట్ రూల్స్ ప్రకారం ముప్పై ఆరు ప్రింట్ల వరకూ పదివేలు ప్రింట్‌కు టాక్స్ చెల్లించాలి. 36 నుంచి 100 ప్రింట్ల వరకూ అయితే ఇరవై వేల టాక్స్ కట్టాలి.101 నుంచి150 ప్రింట్లు అయితే ముప్పై వేలు,ఆ పైన వేసే ప్రతీ ప్రింట్‌కూ నలబై వేలు చొప్పున చెల్లించాలి.
ఇదంతా ఇప్పటికే సమస్యల లోతులో చిక్కుకుపోయిన నిర్మాతలకు తడిసి మోపెడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మన పొరుగు రాష్ట్రాలు ఇప్పటికే వ్యాట్‌ను సినిమా పరిధినుంచి తప్పించాయి. మన రాష్ట్రంలో అటువంటి దిశగా ప్రయత్నాలు ఏమీ జరగడంలేదు. ఇకనైనా ప్రభుత్వం వ్యాట్ విషయంలో సినిమాలు నష్టపోకుండా చూడవలసిన సమయం ఆసన్నమైంది. లేకపోతే భారీ చిత్రాలు తీసే నిర్మాత అంతకన్నా భారీగా నష్టపోవాల్సి వస్తుంది. చలనచిత్ర మనుగడే కష్టమైపోతుంది.