Bookmark and Share   Cinevinodam
Subscribe
 
 
ప్రతి పాత్రా కొత్తగా...

     గ్లామర్‌ ప్రదర్శనకు దూరంగా బాలీవుడ్‌లో నెగ్గుకురావటం దాదాపు అసాధ్యం. కానీ దాన్ని సుసాధ్యం చేసిన అందాల భామ విద్యాబాలన్‌. కేవలం పారితోషికం కోసమని కాకుండా, సబ్జెక్టుకు ప్రాధాన్యం ఇచ్చే అతికొద్దిమంది కథానాయికల్లో ఒకరు. దాంట్లో భాగంగానే పలు భాషల్లో వీలున్నంతమేరకు నటిస్తోంది. మలయాళ, తెలుగు భాషల్లో కూడా త్వరలో కనిపించనుంది. సినీ రంగంలో తన ప్రాధాన్యతల గురించి ఇలా చెబుతోంది...

గ్లామర్‌కు దూరంగా పాత్రల ఎంపిక చేసుకుం టున్నారు. కారణం ?
సినిమా గ్లామరస్‌ ఫీల్డ్‌ అయినప్పటికీ, అవకాశం ఉన్నప్పుడు కొన్ని ఛాలెంజింగ్‌ పాత్రలు స్వీకరిస్తున్నా. నటిగానూ గుర్తింపు పొందాలి కదా ! గ్లామర్‌ ఒక్కటే సరిపోదు. అందులో భాగంగానే ఇష్కియా, నో వన్‌ కిల్డ్‌ జెస్సికా...సినిమాలు ఒప్పుకున్నా. మొదటిదాంట్లో ఫైర్‌బ్రాండ్‌ రోల్‌, దానికి విభిన్నంగా సాధారణ యువతిగా రెండో చిత్రంలో కనబడతా. ఇవి రెండూ చేయడం అంత సులభమేమీ కాదు.

లవ్‌, యాక్షన్‌, మాస్‌ మసాలా అనే ఫార్మాట్‌కు దూరంగా మీ కెరీర్‌ నడుస్తోంది. స్టోరీ డిఫరెంట్‌గా ఉంటే ఓకే చెబుతారా ?
నా రోల్‌ చాలా డిఫరెంట్‌గా ఉండాలి. అదొక్కటే ప్రామాణికత. ఈ భూమిపై ఏ ఇద్దరూ ఒకేవిధంగా ఉండరు. నేనూ తెరపై కనబడిని ప్రతీసారీ ఓ కొత్త రోల్‌లో కనబడాలి. ఆశించిన దానికంటే విద్యాబాలన్‌ బాగా చేసింది...అనే స్పందన వచ్చింది. అదే నన్ను ఉత్సాహ పరుస్తోంది. ఇదే పంథాలో నడుస్తానని ఇప్పుడే ఖచ్చితంగా చెప్పలేను. సుజోరు ఘోష్‌ నాతో ఓ సినిమా తీస్తున్నారు. అందులో సినిమా ఆసాంతం ఓ గర్భిణీ స్త్రీగానే కనిపిస్తాను. ఆ తర్వాత మరో సినిమా సిద్ధంగా ఉంది. అందులో స్క్రిజోఫోనిక్‌ అనే మానసిక వ్యాధితో బాధపడే యువతిగా నటిస్తున్నా.

దక్షిణాది నుంచి వచ్చి, బాలీవుడ్‌లో బిగ్‌స్టార్‌గా ఎదిగారు. ఎలా సాధ్యమైంది ?
చాలా సంతోషంగా ఉంది. నా లుక్‌ను చూసి, కొన్ని పరిమితులున్నాయని దర్శకనిర్మాతలు భావించారు. దానికనుగుణంగానే పాత్రల ఎంపిక జరుగుతోంది. బాలీవుడ్‌ టాప్‌ డైరెక్టర్స్‌ తమ చిత్రాల్లో చేయమని అడుగుతున్నారు. నా పట్ల ఉన్న నమ్మకాన్ని, ఓ నటిగా గుర్తించారనటానికి ఇదే సాక్ష్యం. నా తల్లిదండ్రులు, సన్నిహితుల సహకారంతో నిలబడ్డాను. సరైన స్క్రిప్ట్‌, సరైన దర్శకుడు అవసరం. ఎంపికలోనే అంతా ఉంటుంది. కామెడీ కూడా చేయాలనుంది. చేస్తాను.

దక్షిణాదిన నటించే అవకాశం ఉందా ?
మలయాళంలో నటించమని అమ్మానాన్న అడుగుతున్నారు. తప్పకుండా ఓ రోజు చేస్తాను. 'ఉర్మి' అనే సినిమాలో అతిథి పాత్రలో చేశాను. పూర్తిస్థాయిలో ఓ సినిమా చేస్తాను. అంతేగాక తెలుగు సినిమాలో కూడా చేయాలనుంది.

 
 

Copy right reserved for www.cinevinodam.com 2005