మసాలా
 
 
 
 
'ద డర్టీ పిక్చర్' సెట్స్‌పై సెల్‌ఫోన్ల నిషేధం
విద్యాబాలన్ ప్రధాన పాత్రధారిగా బాలీవుడ్‌లో రూపొందుతున్న 'ద డర్టీ పిక్చర్' సెట్స్‌పై మొబైల్ ఫోన్ల వాడకాన్ని ఆ చిత్ర నిర్మాత ఏక్తా కపూర్, దర్శకుడు మిలన్ లూథ్రియా నిషేధించారు. సెట్స్ మీదకు వెళ్లేప్పుడు ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులు, అతిథులు ఎవరైనా తమ సెల్‌ఫోన్లని ప్రొడక్షన్‌వాళ్లకి అందజేయాలనే నిబంధన విధించారు.

సోమవారం (30వ తేదీ) నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలవుతోంది. ఈ చిత్రానికి సంబంధించి సరైన సమయంలోనే స్టిల్స్ కానీ, క్లిప్పింగ్స్ కానీ విడుదల చేయాలని భావించిన నిర్మాతలు, ఈలోగా ఎలాంటి స్టిల్స్, ఎం.ఎం.ఎస్. క్లిప్స్ బయటకు వెళ్లకూడదనే ఉద్దేశంతోటే సెట్స్‌పై మొబైల్ ఫోన్ల మీద నిషేధం విధించారు.

ఇప్పటివరకు చెయ్యని ఓ 'బోల్డ్' కేరక్టర్ని విద్యాబాలన్ చేస్తుండటం దీనికి కారణం. 1980ల నాటి దక్షిణాది చలనచిత్ర సీమ నేపథ్యంలో కథ నడిచే ఈ సినిమాలో అప్పట్లో కొన్నేళ్లపాటు తన రూపంతో, డాన్సులతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసిన సిల్క్‌స్మిత పాత్రని విద్యాబాలన్ పోషిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

"ఇది ఓ చూడచక్కని, వినోదభరిత రొమాంటిక్ డ్రామా. సంగీతానికీ ఇందులో ప్రాముఖ్యం ఉంది'' అని చెప్పారు ఏక్తా. ఈ ఏడాది ఆఖరులో ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలున్నాయి.