విజయంతోనే ఉత్సాహం, ఉత్తేజం వస్తాయని నటుడు విజయ్ అంటున్నారు. ఆయన నటించిన వేలాయుధం చిత్రం దీపావళి కానుకగా విడుదలై విజయం దిశగా దూసుకుపోతోంది. చిత్రం సక్సెస్‌ను ఆయన శుక్రవారం సాయంత్రం విలేకరులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా పాత్రికేయులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు.
రీమేక్ చిత్రాలపై అధిక శ్రద్ధ చూపుతున్నట్లున్నారు?
తెలుగులో తిరుపతి స్వామి దర్శకత్వం వహించిన ఆజాద్ రీమేక్ హక్కులు కొని, వేలాయుధం చిత్రాన్ని రూపొందించిన మాట వాస్తవమే. ఆ చిత్ర కథను దర్శకుడు జయం రాజా తమిళ నేటివిటికి తగ్గట్టుగా మార్పులు, చేర్పులు చేశారు. వేలాయుధం ఘన విజయం సాధించడం సంతోషంగా ఉంది.
దర్శకుడు రాజా గురించి?
నిజం చెప్పాలంటే ఈ చిత్ర విజయంలో దర్శకుడి రాజా కృషి చాలా ఉంది. ఆయన తండ్రి ఎడిటర్ మోహన్, సోదరుడు, నటుడు జయం రవి సహకారం కూడా చాలా ఉంది. వారు కూడా ఈ చిత్ర కథా చర్చల్లో పాల్గొని మరింత మెరుగ్గా రావడానికి కృషి చేశారు. జయం రాజా నన్ను బ్రదర్‌లా ట్రీట్ చేశారు. ఆయన ఎలా చెబితే అలా నటించాను. చాలా హార్డ్ వర్కర్. జయం రాజాలో మంచి నటుడున్నాడు.
వేలాయుధం చిత్రం విడుదల తర్వాత నిర్మాత స్పందన ఎలా ఉంది?
ఈ సమావేశానికి వచ్చే ముందు ఆస్కార్ ఫిలింస్ కార్యాలయానికి వెళ్లి ఆస్కార్ రవిని కలసి వస్తున్నాను. నిర్మాతగా హ్యాపీనా అని నేను ఆయన్ను అడిగాను. చిత్రానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, హ్యాపీగా ఉన్నానని అన్నారు. సూపర్‌హిట్ టాక్ రావడంతో మరిన్ని ప్రింట్లు వేస్తూ, థియేటర్ల సంఖ్యను పెంచుతున్నారట.
ఎంజీఆర్ ఫార్ములాను అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నట్టున్నారు?
నిజం చెప్పాలంటే ఎంజీఆర్ ఫార్ములాలో చిత్రాలను చేయాలని ప్రతి నటుడూ కోరుకుంటారు. నా తండ్రి ఎస్‌ఏ.చంద్రశేఖరన్ ఎప్పుడూ ఒక మాట చెబుతుంటారు. కమర్షియల్ చిత్రాలకు బేస్‌మెంట్ కరెక్ట్‌గా ఉంటే విజయాన్ని ఎవరూ ఆపలేరని.
విజయం వచ్చినప్పుడే మీరు బయట ప్రపంచంలోకి వస్తారని, మిగతా సమయాల్లో కనిపించరనే అపవాదు గురించి?
ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని ఇచ్చేది విజయమే కదా. ఆ విజయాన్ని అందరితో పంచుకోవాలనుకోవడంలో తప్పు లేదుగా. దర్శకుడు జయం రాజా, సంగీత దర్శకుడు విజయ్ ఆంటోని కూడా పాల్గొన్నారు.