|
ఇకపై ఏడాదికి రెండు సినిమాలు విడుదలయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నాను. 2010లో మాత్రం మూడు సినిమాలు వస్తాయి. ఒకటి మణిరత్నం ‘రావణ్’ (తెలుగులో ‘అశోకవనం’) ఇంకొకటి సెల్వరాఘవన్ దర్శకత్వంలో చిత్రం, మూడొకది ‘24’- అంటూ చెప్పారు విక్రమ్ వరద బాధితుల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి 15లక్షలు ఇచ్చేందుకు వచ్చిన సందర్భంగా మాట్లాడుతూ.
మణిరత్నంతో చాలా కాలంగా చేయాలనే కోరిక వుంది. అయితే ఇప్పటి వరకూ కుదరలేదు. ‘యువ’లో కూడా చివరి నిముషం వరకూ ప్రయత్నించాను కానీ, చేయలేకపోయాను. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో చేస్తున్న ‘రావణ్’లోని నా పాత్ర నటుడిగా నా స్థాయిని పెంచుతుంది. ఇంకా చెప్పాలంటే- జాతీయ అవార్డుకు అర్హత వున్నపాత్ర. సాధారణంగా ఒక నటుడు ఒకే పాత్రను రెండు భాషల్లో చేస్తాడు. అయితే నేను మాత్రం ఈ చిత్రంలో వేర్వేరుగా చేశాను. నాకిది అరుదైన అనుభవం. నేను తమిళంలో చేస్తున్న పాత్రను హిందీలో అభిషేక్ బచ్చన్ చేస్తున్నారు. నేను వేరే పాత్ర పోషిస్తున్నాను. అందరూ అడుగుతున్నట్లు నేను ఇందులో రావణుడి పాత్రనే పోషించాను. అయితే, తమిళంలోనా, హిందీలోనా, అన్నది మీరు చూసి తెలుసుకోవాల్సిందే. తమిళంలో ఐశ్వర్యరాయ్ నా పక్కన చేశారు. ఈ చిత్రం ఫ్యాచ్ వర్క్ మినహా పూర్తయ్యింది. సెల్వరాఘవన్ దర్శకత్వంలో చేస్తున్న చిత్రంలో కలర్స్ స్వాతి హీరోయిన్ గా చేస్తోంది. ఈ చిత్రం తొలి షెడ్యూల్ ను కాశ్మీర్లో ఇటీవలనే పూర్తి చేశాం. ఇక ‘24’ గురించి... 24 గంటల్లో జరిగే కథ కాబట్టి టైటిల్ అలా పెట్టారు. ‘13-బి’ చిత్రానికి దర్శకత్వం వహించిన విక్రమ్ కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. త్వరలో హీరోయిన్ ను ఫైనలైజ్ చేసి, డిసెంబర్ 4 షూటింగ్ ప్రారంభిస్తారు. నేను ఇప్పుడు చేస్తున్న మూడు చిత్రాలు ఫక్తు కమర్షియల్ చిత్రాల్లా అనిపిస్తూనే, ప్రయోగాత్మక విధానంలో నడుస్తాయి. ఈ మూడు చిత్రాలు నాకు వెరైటీ అవుతాయి. ఇందులో ఓ స్సెషల్ విక్రమ్ కనిపిస్తాడు మీకు- అని అంటున్నారు విక్రమ్.
|