'స్టార్ హోదాలు, హీరోగా గౌరవ మర్యాదలు ఇవన్నీ ఒక ఎత్తయితే నా కుటుంబం ఒక ఎత్తు. నిరాడంబర
జీవితం గడపటమే నాకిష్టం' అంటున్నాడు ప్రముఖ కథానాయకుడు విక్రమ్. ఈయనలోని నటుడు బయటి
ప్రపంచానికి తెలియడానికి చాలాకాలమే పట్టింది. సేతు, అపరిచితుడు, మల్లన్న, రావన్ మొదలైవాటితో
నటుడిగా తనదైన గుర్తింపును సాధించాడు. రావన్ చిత్రంతో బాలీవుడ్‌ను సైతం ఆకర్షించారు. తన కెరిర్‌లోని పలు
విషయాలిలా చెప్పుకొస్తున్నారు...
అంతకు మందు ఎన్ని పాత్రలు పోషించినా 'సేతు' చిత్రంలోని చియన్ పాత్రతో ప్రేక్షకుల అభిమానం
పొందగలిగాను. ఈ సినిమాను సల్మాన్‌ఖాన్ కథానాయకుడిగా 'తేరేనామ్' పేరుతో రీమేక్ చేశారు.
సూపర్‌హిట్ అయింది. ఆ తర్వాత ప్రేక్షకులు నన్ను గుర్తుపెట్టుకొనేలా వైవిధ్యమైన చిత్రాల్లో నటించే అవకాశం
దర్శకులు బాల, మణిరత్నం ద్వారా కలిగింది. వారినెప్పటికీ మరిచిపోలేను. స్టార్‌డమ్ రాకముందు నేను
ఎక్కడ నివాసం ఉండేవాడినో ఇప్పుడూ అక్కడే ఉన్నాను. ఆ చుట్టు పక్కల ప్రజలతో నాకు విడదీయరాని
అనుబంధం ఏర్పడింది. వాళ్లమధ్య నేనో సాధారణ వ్యక్తినంతే. నన్ను స్టార్ హీరోలా చూడరు. ఎప్పటిలాగానే
అందరూ నాతో మాట్లాడుతారు. ఉదయాన్నే నా పెంపుడు కుక్కల్ని తీసుకుని వాకింగ్‌కి వెళతాను. ఇంట్లో జిమ్
ఉంది. కానీ బయటి వ్యాయామశాలకు వెళతాను. నాలుగు గోడల మధ్య నేనొక్కణ్నే వ్యాయామం చేయడం నాకు
నచ్చదు. నలుగురితో కలిస్తేనే మనసుకు హాయి. వీలుంటే పక్కనున్న షాపింగ్‌మాల్‌కు కూడా వెళతాను.
నా దృష్టిలో సూపర్ స్టార్స్...
సూపర్‌స్టార్స్ అంటే...రజనీకాంత్, కమల్‌హాసన్. వాళ్లలాగా ఛాలెంజింగ్ పాత్రలు చేయాలి. అందుకే పలు
భాషా చిత్రాల్లో నటించాలనుకుంటున్నా. నా కెరిర్‌లో విలువైన పాత్ర 'రావన్'లో దక్కింది. హిందీలో దేవ్ పాత్రకు
డబ్బింగ్ వేరే వాళ్లతో చెప్పిద్దామనుకున్నారు. కానీ కుదరలేదు. మణిరత్నంగారు మచ్చుకో సన్నివేశానికి
డబ్బింగ్ చెప్పమన్నారు. ఆయన అంత తొందరగా అభిప్రాయాన్ని మార్చుకోరు. వెంటనే ఓకే చెప్పడంతో చాలా
అశ్చర్యమేసింది. నా గెటప్‌కు తగ్గ విధంగా నటన ఉండాలి, వాయిస్ ఉండాలి, చాలా కష్టపడ్డాను. కెరిర్‌లో
విలువైన పాత్ర ఇది.
దక్షిణాదిన మంచి స్పందన వచ్చింది...
'రావణ్' చిత్రానికి దక్షిణాదిన మంచి స్పందన వచ్చింది. లండన్‌లో కూడా ఊహించని ఆదరణ చూపారు.
అందరమూ చాలా కష్టపడ్డాం. కానీ నిరాశ ఎదురైంది. కానీ మాకు మాత్రం చాలా గొప్ప సినిమా.
వైవిధ్యమున్న పాత్రలు నన్ను వెదుక్కుంటూ వస్తున్నాయి. నా వంతు ప్రయత్నం చేస్తాను.
|