మసాలా
 
 
 
 
తిరుపతి లడ్డు అంత గొప్పది
నాకు ఈ కథ గురించి మొదట చెప్పింది నటుడు ఆర్య. తను నా పుట్టిన రోజు పార్టీకి వచ్చినప్పుడు... 'బాలా సార్‌ దగ్గర ఓ మంచి కథ ఉంది. మనిద్దరం కలిసి చేద్దామా !' అని అడిగాడు. బాలా సినిమాలో చేసే అవకాశం వస్తుందంటే వదులుకుంటానా ! అందుకే కథ గురించి ఏ మాత్రమూ ఆలోచించకుండా వెంటనే ఓకే చెప్పేశాను' అని అంటున్న వీడు నటుడు విశాల్‌. తాజా చిత్రం 'వాడు-వీడు'తో తెలుగు ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులే కొట్టేశాడు. మరి దీని వెనుక ఆయన చేసిన హోం వర్క్‌..తదితర విషయాలు ఇలా వివరించాడు...

* ఇప్పటిదాకా విశాల్‌ను ఓ కథానాయకుడిగానే చూశారు. ఇకపై నటుడిగానూ గుర్తిస్తారు. ఇంకా ఎన్నేళ్లు చిత్ర పరిశ్రమలో ఉన్నా...నేనిలాంటి పాత్ర చేయను, చేయలేను. బయట దొరికే లడ్డుకు, తిరుపతి లడ్డుకు చాలా వ్యత్యాసం ఉంది. 'వాడు-వీడు'లో నాకు వచ్చిన అవకాశం కూడా అలాంటిదే. తిరుపతి లడ్డు అంతటి పవిత్రమైన పాత్ర అది. సినిమా సీడీని తీసుకెళ్లి, ప్రపంచంలో ఏ పరిశ్రమలోకి వెళ్లినా నాకు అవకాశమిస్తారు.

* సినిమాలో నేనొక డ్రామా ఆర్టిస్ట్‌ను. చిత్ర విచిత్రమైన వేషాలతో కనిపించాలి. మొత్తం పది గెటప్పులు వేశాను. అన్నిటి కంటే అమ్మాయి వేశం...మంచి మార్కులు కొట్టేసింది. అమ్మాయిలా అందంగా కనిపించాలని షూటింగ్‌కి ముందు దాదాపు 24 కేజీల బరువు పెరిగాను. ఇది ఏమాత్రం సరిపోదని, ఇంకా బరువు పెరగాలని నెలరోజులు బాలా షూటింగ్‌ వాయిదా వేశారు. దాంతో నాకిష్టంలేని వంటలు కూడా తినేసి, బరువు పెరిగాను.

* ఎంత కష్టపడ్డానో, అంతకు రెట్టింపు ఆనందాన్ని అందుకున్నా. అమ్మాయిల విషయంలో, వారికున్న ఇబ్బందులు నాకర్థమయ్యాయి. ముఖ్యంగా మేకప్‌ వేసుకొని, ఎంతో శ్రద్ధగా, ఎన్నో విషయాల్ని దృష్టిలో ఉంచుకొని వారు కెమరా ముందుకు రావాలి. అదే కథానాయకుడికి కొన్ని మినహాయింపులుంటాయి.

* కథలో అసలు మెల్లకన్ను ప్రస్తావనే లేదు. పదిహేను రోజులు షూటింగ్‌ అయ్యాక...బాలా నా దగ్గరకొచ్చి 'నువ్వింకా లయోలా కాలేజ్‌ విశాల్‌గానే కనిపిస్తున్నావు. ఏదైనా కొత్తగా చూపెట్టాలి'అని చెప్పారు. అప్పుడే మెల్లకన్ను అనే ఆలోచన వచ్చింది. వెంటనే ఫ్యామిలీ డాక్టర్‌ దగ్గరికెళ్లి అడిగా. దానికి ఆయన...'ఎవరైనా మెళ్ల కన్ను సరిచేసుకోవటానికి వస్తారు. నువ్వు మాత్రం మెల్లకన్ను కోసం వచ్చావు. నీకేమైనా పిచ్చిపట్టిందా' అని తిట్టిపోశారు.

* ఇంటర్నెట్‌లోనూ వెదికా. చివరికి తెలిసిందేం టంటే...మెల్లకన్ను వచ్చేలా చేసే విధానం ఎక్కడా లేదని తెలిసింది. ఇక బలవంతంగా కళ్లు తిప్పుకుంటూ కొన్ని నెలలు సాధన చేశా.

* ఇబ్బందులంటే...షూటింగ్‌ జరిగినన్ని రోజులు విపరీతమైన తలనొప్పి వచ్చేది. కంటి దగ్గర నరాలు ఉబ్బిపోయేవి. తదుపరి చిత్రం ప్రభుదేవా దర్శకత్వంలో ఉంది. త్వరలోనే షూటింగ్‌ ఆరంభమవుతుంది.

* నేనేది ప్లాన్‌ చేసుకొని రాలేదు. దర్శకత్వం చేయాలన్న ఆలోచన ఉంది. కానీ అదెప్పుడు నెరవేరుతుందో చెప్పలేను. సమయం దొరికితే వచ్చే ఏడాది ఒక సినిమాకు దర్శకత్వం చేస్తా.

* తెలుగు దర్శకులెవ్వరూ ఇప్పటిదాకా నాకు ఒక్క కథ కూడా వినిపించలేదు. మంచి కథతో వస్తే తప్పక ఆలోచిస్తా.