మసాలా
 
 
 
 
అవకాశాలను వేరే వాళ్లు తన్నుకుపోతారు
బాబూజీ, దమ్ వంటి ఐటెంసాంగ్స్‌తో యానాగుప్తా సాధించిన ఆదరణ అంతా ఇంతా కాదు. తనకిష్టమైన రచనా వ్యాసంగం, సంగీతంతో పోలిస్తే నటనపై ఆసక్తి తక్కువేనని ఈ పాలరాతి శిల్పం చెబుతోంది. ఒక మ్యూజిక్ అల్బమ్‌ను సృజించడంపైనా ఆమె దృష్టి సారించింది. ‘ఇప్పుడు సంగీతం, రచనకే నా ప్రాధాన్యం. నటనను కాస్త పక్కన బెట్టాను. అయితే కొత్త సినిమాలు, డ్యాన్స్ షోలకూ సిద్ధంగా ఉన్నాను. వీటినీ ఇష్టపడతాను’ అని యానాగుప్తా చెప్పింది. ‘హౌ టు లవ్ యువర్ బాడీ అండ్ గెట్ ది బాడీ యు లవ్’ పుస్తకంతో ఈ చెక్ దేశపు బ్యూటీ రచయితగా మారింది.

ఇది ఆరోగ్య సౌష్టవం గురించిన విషయాలు చర్చించే పుస్తకం. రోజూ కఠిన వ్యాయామాలు చేసే యానా అతిగా తినే (ఈటింగ్ డిజార్టర్) జబ్బుతో బాధపడుతోంది. ఈ సమస్య ఉన్నా తన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకుంటుందో ఆ పుస్తకంలో చక్కగా వివరించింది. ఎప్పుడుపడితే అప్పుడు షూటింగులు ఉండడం వల్ల చాలా మంది తారలకు అతిగా తినే అలవాటు వస్తుంది. అందువల్ల సినీజనాలు ఆహార జాబితాను తయారు చేసుకోవడం ఎంతైనా అవసరమన్నది యానా సలహా. ‘సినీ పరిశ్రమలో ఉండే వారికి మంచి శరీర సౌష్టవం తప్పనిసరి. లేకుంటే అవకాశాలను వేరే వాళ్లు తన్నుకుపోతారు.

తారలు నిరంతరం ప్రయాణిస్తూ షూటింగుల సెట్లపై దొరికే చెత్త పదార్థాలను తింటుంటారు. ఆరోగ్యంగా ఉండాలనుకునే వాళ్లు ఇంటి దగ్గర వండిన ఆహారాన్ని తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి. లేకుంటే వేరే వాళ్లతో తెప్పించుకోవాలి’ అని యానా తన పుస్తకంలో రాసింది. రెండో పుస్తకాన్ని కూడా మొదలుపెట్టిన ఈ మిల్క్‌బ్యూటీ మ్యూజిక్‌అల్బం పనినీ చేసుకుపోతోంది. ఇది కొన్ని నెలల్లో మార్కెట్లోకి రానుంది. రెండో పుస్తకంలో ఏం రాస్తున్నదో మాత్రం చెప్పడం లేదు. త్వరలోనే తన జీవిత కథను కూడా రాస్తానని యానా గుప్తా తెలిపింది.