| |
|
సినిమాకు క్రికెట్ పోటు |
ప్రస్తుతం సినిమాకి మహరాజ పోషకులు యువకులు. వారికి సినిమాకన్నా క్రికెట్ అంటేనే ఎక్కువ మోజు. దాంతో ఎప్పుడు క్రికెట్ మ్యాచ్‌లు జరిగినా సినిమాల వసూళ్ళు గణనీయంగా తగ్గిపోవడం సర్వసాధారణంగా మారింది. గత సంవత్సరం మన తెలుగు సినిమాల సక్సెస్ శాతం ఎప్పుడూ లేనంత తక్కువకి చేరింది. ఈ ఏడాది మొదటిరెండు నెలల్లోనూ ఒక్క విజయం కూడా దక్కలేదు. ఒకటి రెండు సినిమాలకి మంచి ఓపెనింగ్స్ మాత్రమే వచ్చాయి. ఇటువంటి పరిస్థితుల్లో పరీక్షలు ఓ పక్క, ఐపిఎల్ క్రికెట్ మ్యాచ్ మరో పక్క రావడం సినిమాపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం వుంది. మామూలు మ్యాచ్‌లకన్నా ట్వంటీ20 మ్యాచ్‌లకి క్రేజ్ ఎక్కువ కావడంతో, యువత మరింత ఎక్కువగా ఈ మ్యాచ్‌లవేపు మొగ్గుతారని అంటున్నారు. వీటి ప్రభావం వల్ల సినిమాలకు యాభైశాతం వసూళ్ళు తగ్గే అవకాశం వుందని పరిశీలకులు చెబుతున్నారు. అసలే విజయాలులేని క్లిష్టపరిస్థితుల్లో వున్న పరిశ్రమకు నిజంగా ఇది పెద్ద దెబ్బ. ఈ పరిస్థితుల్లో విడుదల వాయిదా వేసుకోవాలని కొందరు అనుకున్నప్పటికీ, కొన్ని చిత్రాలకు తప్పనిసరిగా విడుదల చేయాల్సిన ఆర్థిక కారణాలున్నాయి. పైగా వేసవిలో సాధారణంగా పెద్ద సినిమాల జోరు నడుస్తుంది. కనుక, లాభమైనా నష్టమైనా ఈ సీజన్‌లోనే విడుదలకు కొన్ని సినిమాలు సిద్ధమవుతున్నాయి. ఒకపక్క బంద్‌లు, మరోపక్క ఇటువంటి రకరకాల ఇబ్బందులతో తల్లడిల్లుతున్న తెలుగు సినిమారంగానికి త్వరలో మంచి రోజులు రావాలని కోరుకుందాం.
|
- ఎస్.ప్రియమణి, విజయవాడ. |
| --------------------------------------------------- |
| |
|
'విషయం' లేని విజయాలు |
మన తెలుగు సినిమా దర్శకులు తెలివి తెల్లారిందని ఈ మద్య వస్తున్న చిత్రాలు చూస్తే అనిపిస్తుంది. సంక్రాంతికి నానా హంగామా చేసి విడుదలైన 'అదుర్స్', 'నమోవెంకటేశ' చిత్రాలు మంచి ఓపెనింగ్స్ సాధించినప్పటికీ, విషయంలేని సినిమాలుగానే మిగిలాయి. టాప్ హీరోలతో, దాదాపు ముప్పై కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాలు చూస్తే, మన దర్శకులు రొటీన్ మసాలా ఫార్ములాతో వండటానికి తప్ప, కొత్తగా ఆలోచించి చేయడానికి పనికిరారేమోనని అనుమానం కలుగుతుంది.
పరమ పేలవమైన కథ, కథనంతో వినాయక్ 'అదుర్స్' చేశారు. ఎన్టీఆర్‌తో చారి అనే పాత్ర వేయించడం తప్ప, ఈ చిత్రంలో కనీస స్థాయి కూడా కనిపించదు. వెంకటేష్ విశ్వరూపం చూస్తారంటూ ఊదరగొట్టిన 'నమోవెంకటేశ'లో ఎన్నో చిత్రాల్లో వెంకీ చేసిన పాత రూపాన్నే చూపించి శ్రీనువైట్ల చిరాకెత్తించాడు. పెద్ద హీరోలు, పండగ సీజన్ కారణంగా ఈ చిత్రాలకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. అంత మాత్రానికే 'సక్సెస్ మీట్'లు పెట్టి... ప్రేక్షకుల పల్స్ మాకే తెలుసు... మేము తీసింది కళాఖండం - అన్న లెవెల్‌లో బిల్డప్ ఇవ్వడం మాత్రం ఆత్మవంచనకు పరాకాష్ట.
హాలీవుడ్, బాలీవుడ్, దక్షిణాది భాషా చిత్రాలు తెలుగులో అనువాదమై తెలుగు సినిమాలను మించి వసూళ్ళు చేస్తున్నాయంటే కారణం - మన సినిమాల్లో దమ్ములేకపోవడమే. దర్శకుడనేవాడు కోట్లు తీసుకోవడం, మీడియా దగ్గర ఎగస్ట్రాలు చేయడమే కాకుండా - బాధ్యతగా, స్వంత బుర్రపెట్టి మంచి స్క్రిప్టు తయారు చేసుకోవాలి. డబ్బులు పెట్టే వాడు దొరికాడు కదా అని, విపరీతంగా ఖర్చు చేయడంపైనే దృష్టి పెట్టి, సినిమాని చుట్టేస్తే జనం చూసే రోజులు పోయాయి. టివితో అవగాహన పరిధిని ఎంతో పెంచుకున్న ప్రేక్షకుడిని మాయచేయడం ఇప్పుడు సాధ్యం కాదని తెలుసుకోవాలి.
|
- కె. నిరంజన్ రెడ్డి, హైదరాబాద్ |
| --------------------------------------------------- |
| |
|
మహా దర్శకులున్నారు ! |
కె.వి.రెడ్డి, కమలాకర కామేశ్వరరావు, బాపు, కె.విశ్వనాథ్ వంటి మహా దర్శకులు తమ ఊహా ప్రతిభతో తెలుగు తెరకు కొత్తదనాన్ని, గొప్పదనాన్ని తెచ్చారు. ఇప్పుడొస్తున్న కొందరు దర్శకులు మహాదర్శకుల్లా ఫోజులిస్తూ చెత్త సినిమాలను అందిస్తున్నారు. వీరిలో సృజనాత్మకత తక్కువ... సాగదీసుడు ఎక్కువ. వీరు సినిమాని అమితంగా ప్రేమిస్తున్నారట. (నిర్మాతపై మాత్రం జాలి చూపించారు). సినిమాని నెలలు, సంవత్సరాల తరబడి తీస్తూనే వుంటారు. వీరి ఊహాశక్తికి హైదరాబాద్.... ఆంధ్రప్రదేశ్... చివరికి మన దేశం కూడా సరిపోదు. విదేశాలకు ప్రయాణం కడతారు. అసలు, సినిమా కథా చర్చలు కూడా విదేశాల్లోనే చేసేంత ‘అంతర్జాతీయ’ స్థాయికి ఎదిగిపోయారు మన మహా దర్శకులు. ‘ముడ్డి మనది కాకుంటే కాశీ వరకూ దేకొచ్చు’ అనే సామెత వీరినుండే పుట్టింది. నిర్మాత డబ్బుతో వీళ్ళు ‘సినిమా తీసింది తక్కువ- హంగామా చేసేది ఎక్కువ’గా మారింది. బడ్జెట్ చూస్తే 20, 30కోట్లు... సినిమాలో చూస్తే విషయం కరువు. ‘మీ సినిమా ఎలా వుంటుందని’ మీడియావారు అడిగితే, సినిమాని కాచి వడబోసినట్లు - అసలు సినిమా అంటే ఏమిటో చెప్పి, ఆ తర్వాత తన సినిమా అద్భుత కళాఖండంగా చేసినట్లు ఒకటే ఊదరగొట్టుడు... తీరా, సినిమా విడుదలయ్యాక చూస్తే ప్రేక్షకులు తలపట్టుకుని వుంటారు. వీరి పారితోషికం కోట్ల మీదే వుంటుంది. దర్శకుడికి, హీరో హీరోయిన్లకి, విదేశీ విహారయాత్రలకి బడ్జెట్లో అధిక భాగం పోతే, ఇక సినిమా తీయడానికేముంటుంది?... చివరికి నిర్మాతకి అప్పులు... బయ్యర్లకి తిప్పలు తప్ప! పటాటోపం ప్రదర్శించే ఈ అర్భక దర్శకులను పక్కనపెట్టి నిర్మాతలు ప్రతిభావంతులైన కొత్తవారికి అవకాశం ఇస్తే- క్వాలిటీకి మినిమం గ్యారంటీతోపాటు పరిశ్రమకు కొత్తదనాన్ని స్వాగతించినట్లుంటుంది.
|
- ఎ.కృష్ణకాంత్, చెన్నై |
| --------------------------------------------------- |
| |
|
హాలీవుడ్ కంటే మనమేం తక్కువ? |
‘‘చిత్రీకరణ శైలి, ఎంచుకున్న కథ... కొత్త తరహాలో వుంటాయి కాబట్టి, వాటిని హాలీవుడ్ స్థాయి అంటారు. అయినా మన సినిమాలు హాలీవుడ్ కంటే ఏం తక్కువ? హాలీవుడ్ లో విజువల్ ఎఫెక్ట్ నిపుణులు ఎక్కువమంది వుండొచ్చు. భారీ బడ్జెట్ వుండొచ్చు. మనం అంత సాంకేతిక హంగామా చూపించలేకపోవచ్చు. అయితే, హాలీవుడ్ వాళ్ళని మించిన కథలు మన రచయితల దగ్గర వున్నాయి’’- అంటూ ‘అమరావతి’ విడుదల సందర్భంగా చెప్పారు దర్శకుడు రవిబాబు.
అసలు మనం హాలీవుడ్ తో పోల్చుకోవడం అంటే- నక్కకి... నాగలోకానికీ మధ్య పోలిక తెచ్చినట్టే. మొదటిగా మనం హాలీవుడ్లో వున్నదీ, మనలో లేనిదీ ఏంటో గ్రహించాలి. అక్కడ వున్నది- క్రియేటివిటీ, ఒరిజినాలిటీ. మన దగ్గర లేనిది కూడా అదే. హాలీవుడ్లో స్ర్కిప్టుకి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. దానిపై ఎంతో కష్టపడతారు. సాంకేతిక వసతులు వారికి అదనపు బలం మాత్రమే. అందుకే ఆ చిత్రాలు కొత్తగా వుంటాయి. ‘వండుకున్నోడి కన్నా...దండుకున్నోడు మిన్న’ అన్నట్లు హాలీవుడ్ చిత్రాల్లో నచ్చినవాటిని ఎత్తేసి తమ సినిమాల్లో పెట్టేసుకోవడమే మన క్రియేటివిటీ. దానికి కొందరు ఇన్స్పిరేషన్ అని పేరు పెట్టుకుంటారు. ఏది ఏమైనా ఇంగ్లీషు చిత్రాలను అన్ని విషయాల్లోనూ కొట్టేయడంలోమన రచయితలు, దర్శకులు, సంగీత దర్శకులు ఎంతో ప్రగతిని సాధించారనేది గుర్తించకతప్పని విషయం.కొందరు హార్రర్ చిత్రాలను యదాతథంగా తీసేసి, ఆ చిత్రం పొరపాటున హిట్ అయితే- హాలీవుడ్ మనకన్నా గొప్పదేంకాదంటూ ప్రకటించేస్తుంటారు. మన యువ దర్శకులు ఇటువంటి ‘ఆత్మవంచన’ వదిలేసి, మన నేటివిటీతో స్వంత కథలు తయారుచేసుకుని, మంచి చిత్రాలు అందించే ప్రయత్నం చేయాలి. తద్వారా ప్రపంచ చిత్రాలతో పోటీపడాలి.
|
- కోనేరు రామకృష్ణప్రసాద్, యు.ఎస్. |
| --------------------------------------------------- |
| |
|
మగాళ్ళే లేరా? |
‘తారే జమీన్ పర్’ వంటి చిత్రాల్లో అమీర్ ఖాన్ చేసినట్లు మన హీరోలు ఎందుకు చేయరని అడిగితే - ’’అమీర్ ఖాన్ మగాడు కనుక చేశాడు. మన హీరోలు అంత మగాళ్ళు కారు’’ అంటూ ప్రముఖ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్న మాట చర్చకు దారితీసింది. దాన్ని వివాదాస్పదం చేయాలని కొందరు కష్టపడుతున్నారు.‘‘మన హీరోలు మంచి సినిమాలు చేయడానికి ముందుకు రావడంలేదనేదే’’ వాస్తవానికి భరద్వాజ మాటల్లోని భావం. దానికి మన వాళ్ళు భుజాలు తడుముకోవడం విడ్డూరం. ఘనత వహించిన మన హీరోలు కేవలం ఫార్ములా సినిమాలు చేయడానికే కట్టుబడి పోయిన విషయం ‘జగమెరిగిన సత్యం’. హిందీలో అమీర్ ఖాన్, తమిళంలో కమల్ హసన్, మలయాళంలో మమ్ముట్టిలా కొత్తగా ప్రయత్నించడం, నటుడిగా ప్రయోగాలు చేయడం వంటి ఆలోచనలే మన హీరోలకి లేవు. ఇక ప్రయోజనాత్మక చిత్రాలు వారి ఊహల్లోకి కూడా రావు. ‘జన్మానికో శివరాత్రి’లా అప్పుడప్పుడూ ఇలాంటి చిత్రాలు చేయడం ‘సాహసం’ కాబోదు. అభిరుచిని చూపడం, కమర్షియల్ చిత్రాలకన్నా కొంత పారితోషికం తగ్గించుకోవడం- మాత్రమే వారు చేయాల్సింది. ఆపాటి కూడా చేయడానికి ముందుకురాని మన హీరోలని ఏమని పిలవాలి? భరద్వాజ మాటలని తప్పుగా ఎలా అనుకోవాలి?
‘డబ్బు సంపాదన ఒక్కటే మా జీవిత లక్ష్యం’ అన్నట్లుంది మన హీరోల వరస. డబ్బు, పేరు ప్రఖ్యాతులు ఇచ్చిన సమాజం పట్ల బాధ్యత కూడా ఉందనే విషయం ఎవరికీ గుర్తులేదు. అలా గుర్తుచేసే ఆదర్శనీయులు కూడా చిత్రరంగంలో తగ్గిపోతున్నారు. మంచి దర్శకులు ఉన్నప్పటికీ ప్రయోగాత్మక, ప్రయోజనాత్మక చిత్రాలకు హీరోల సహకారం లేకపోవడంతో మన సినిమాల స్థాయి నానాటికీ దిగజారిపోతోంది. ఇటీవల జాతీయ అవార్డుల్లో కూడా మనకు అవమానమే మిగిలింది. ఒకప్పుడు దేశంలోనే గొప్ప సందేశాత్మక చిత్రాలను అందించిన తెలుగు సినిమారంగం- ఆర్థిక విలువలే ప్రధానంగా, వ్యాపార వ్యవస్థగా మిగిలిపోకుండా కాపాడాల్సిన బాధ్యత పరిశ్రమలోని పెద్దలపై వుంది.
|
- సి.రాఘవాచారి, హైదరాబాద్. |
|