న్యూస్/వ్యూస్
 
 
 
 

శింబు, నయనతార మళ్లీ కలసి నటింప చేసే ప్రయత్నాలు
మాజీ ప్రేమికులు శింబు, నయనతార మళ్లీ కలసి నటిస్తారా? ప్రస్తుతం కోడంబాక్కమ్‌లో వేడి వాడి చర్చ ఇదే. ఒకప్పుడు వీరిద్దరూ డీప్ లవర్స్. పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే ప్రచారం జరిగింది. శింబు, నయనతార కలిసి వల్లవన్ చిత్రంలో నటించారు. ఆ చిత్రంలోని రొమాన్సింగ్ సన్నివేశాలకు సినీ విమర్శకులు సైతం ముక్కున వేలేసుకున్నారు. అంత గాఢమైన ప్రేమ ఆ తరువాత బెడిసి కొట్టింది. దీంతో నయనతార కొంతకాలం కోలీవుడ్ పక్కకే రాలేదు. ఆ తరువాత విజయ్ సరసన విల్లు చిత్రంలో నటించారు. ఆ సమయంలోనే ఆ చిత్ర దర్శకుడు ప్రభుదేవాతో ఏర్పడిన సాన్నిహిత్యం ప్రేమగా మారి, పెళ్లి వరకు దారి తీసింది. ఈ పెళ్లి కథ ఇప్పుడు కంచికి చేరినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు వీరిద్దరి మధ్య ఏమి జరిగిందోగాని నయనతార మళ్లీ నటించడానికి సన్నద్ధం అవుతున్నారు. తెలుగులో నాగార్జునతో జత కట్టడానికి అంగీకరించారు. ఇక కోలీవుడ్‌లో కూడా ఒక భారీ చిత్రంలో అజిత్ సరసన నటించే విషయమై చర్చలు జరుగుతున్నాయి. దీంతో తాజాగా మరో కొత్త ప్రచారం కోలీవుడ్‌లో ఆసక్తిగా మారింది.ఇంతకుముందు సంచలన జంటగా గుర్తింపు పొందిన శింబు, నయనతార మళ్లీ కలసి నటింప చేసే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నట్లు తెలిసింది. ఒక ప్రముఖ దర్శకుడు ఈ విషయంలో ఇప్పటికే రంగంలోకి దిగినట్లు ఆయన ప్రయత్నం ఫలిస్తే ఈ క్రేజీ కాంబినేషన్‌లో చిత్రాన్ని నిర్మించడానికి భారీ నిర్మాత సిద్ధంగా ఉన్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. కాగా ప్రేమికుల రోజు సందర్భంగా ప్రభుదేవా, నయనతారల మధ్య సయోధ్య కుదర్చడానికి కొందరు సన్నిహితులు ప్రయత్నించగా నయనతార అందుకు ససేమిరా అన్నారట.

విజయ్ అమలాపాల్ కు అత్యంత సన్నిహితుడట
దర్శకుడు విజయ్ తనకు మంచి మిత్రుడని, అంతకు మించి తమ మధ్య ఎలాంటి సంబంధం లేదని నటి అమలాపాల్ పేర్కొంది. అనతికాలంలోనే అందలం ఎక్కిన అతికొద్దిమంది హీరోయిన్లలో కేరళ గడుగ్గాయి అమలాపాల్ ఒకరు. మైనా పాత్రలో జీవించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం క్రేజీ హీరోయిన్‌గా మారింది. అమలాపాల్ నటించిన కాదలిల్ సొదప్పువదు ఎప్పడి, ముప్పొళుదుమ్ ఉన్ కర్ఫణైగళ్ చిత్రాలు శుక్రవారం తెరపైకి రానున్నాయి.నటిగా దినదినాభివృద్ది చెందుతున్న ఈ అమ్మడుపై వదంతులు విహారం చేస్తున్నాయి. మైనాతో పక్కింటి అమ్మాయి ఇమేజ్ తెచ్చుకున్న అమలాపాల్ ఈ మధ్య విడుదలైనవేట్టై చిత్రంలో గ్లామర్ విషయంలో కాస్త శృతిమించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయాన్ని ఆమె ముందుంచగా ఒకే పాత్రను అంగీకరించిన తరువాత దానికి తగ్గట్టుగా నటించాల్సి ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. గ్లామర్ అనే దాన్ని పాత్ర నిర్ణయిస్తుంది. కాని డబ్బు కాదని పేర్కొంది. కమర్షియల్ చిత్రాలకు విజయం ముఖ్యం. కాబట్టి గ్లామర్‌గా నటించాల్సి ఉంటుందని అంది. ఇక పుకార్ల విషయానికొస్తే ఇంతకుముందు ఆర్యతో ప్రేమ కలాపాలు అంటూ ప్రశ్నించారని ఇప్పుడు దర్శకుడు విజయ్‌తో కలుపుతూ ప్రచారం చేస్తున్నారని వాపోయింది. నిజానికి విజయ్ సినీరంగంలో అత్యంత సన్నిహితుడని పేర్కొంది.

మలైకా అరోరా ‘అనార్కలీ డిస్కో చలీ’ ఐటెంసాంగు
దబంగ్‌లో ‘మున్నీ బద్నామ్ హుయీ’ ఐటెంసాంగ్ సూపర్‌హిట్ అయిన తరువాత నుంచి మలైకా అరోరా ఇప్పటి వరకు తెరపై కనిపించలేదు. సాజిద్‌ఖాన్ రూపొందిస్తున్న హౌస్‌ఫుల్2లో హల్‌చల్ చేయడానికి ఈ బ్యూటీ సిద్ధమవుతోంది. ‘అనార్కలీ డిస్కో చలీ’ ఐటెంసాంగుకు అదిరిపోయే స్టెప్పులు వేయనుంది. మున్నీ బద్నామ్‌కు పని చేసిన ఫరాఖానే ఈ పాటకూ నృత్యదర్శకురాలిగా వ్యవహరిస్తోంది. ఈ రెండు పాటలను పోల్చడం సరికాదని మల్లిక అంటోంది. ‘అనార్కలీ పాట ఉర్రూతలూగిస్తుంది. మున్నీ పాటలో ఆరాధన ఎక్కువ. ఈ తాజా పాటను ప్రత్యేకంగా రూపొందించడానికి ప్రయత్నం చేస్తున్నాం’ అని చెప్పింది. దీనికోసం ప్రత్యేక జాగ్రత్తలు ఏమైనా తీసుకుంటున్నావా అన్న ప్రశ్నకు.. అలాంటిదేమీ లేదని, కొరియోగ్రాఫర్ చెప్పినట్టు నర్తించడమే తన పని అని వివరించింది. దబంగ్ హిట్‌కు మున్నీ పాట సాయపడిందనడం సరికాదని, అదొక అద్భుత చిత్రమని తెలిపింది. ఈ రెండు పాటలను పోల్చినా పోల్చకున్నా తనకు అభ్యంతరమేమీ లేదని ఫరా అంటోంది. డాన్స్‌ను ఆస్వాదించడమే తనకు తెలిసిన విద్య అని చెప్పింది. అయితే మల్లిక తన శక్తిసామర్థ్యాలతో సినీ పరిశ్రమలో అగ్రస్థానానికి చేరుకుందని అభిప్రాయపడింది. 2010లో విడుదలైన హాస్‌ఫుల్‌కు హౌస్‌ఫుల్2 సీక్వెల్. ఇందులో అక్షయ్‌కుమార్, ఆసిన్ ప్రధాన జోడీగా కనిపిస్తారు. బొమన్ ఇరానీ, రితేశ్ దేశ్‌ముఖ్, చుంకీపాండే, రణ్‌ధీర్‌కపూర్, మిథున్ చక్రవర్తి, జాన్ అబ్రహం, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, షాజన్ పదమ్సీ, రిషి కపూర్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ ఐదో తేదీన విడుదలవుతోంది. దీని ప్రచార వీడియోలు ఇది వరకే టీవీల్లో వినోదం పంచుతున్నాయి. సాజిద్-వాజిద్ ద్వయం స్వరాలు సమకూర్చింది.

ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకొని ఒక్కో రకమైన ముగిం పు
ఏక్‌ దివానా థా'...హిందీ చిత్రం విడుదల కానుంది. తమిళం (విన్నాయ్‌ తాండి వరువాయ) తెలుగు (ఏ మాయ చేసావె)లలో ఈ చిత్రం ఇప్పటికే ఘన విజయం సాధించింది. ఏ చిత్రానికైనా ముగింపు ఒకటే ఉంటుంది. ఈ చిత్రానికి మాత్రం మొత్తానికి నాలుగు రకాలు ముగింపులను చూడవచ్చు. తెలుగులో ఒక రకంగా, తమిళంలో మరో రకంగా ముగింపు ఉంది. హిందీలో ఈ సినిమాకు రెండు ముగింపులు ఉండనున్నాయి. ఒక ముగింపు సుఖాంతమైతే, మరో ముగింపు మాత్రం దర్శకుడి అభిరుచి మేరకు ఓ మలుపు తిరగనుంది. ఆ మలుపు ఏమిటో చూడా లంటే, దాన్ని ప్రదర్శించే థియేటర్‌లోనే సాధ్యం. సుఖాంతం ముగింపుతో కూడిన చిత్రాన్ని దేశవ్యాప్తం గా 500 స్క్రీన్‌లపై రిలీజ్‌ చేస్తుండగా, 20 స్క్రీన్‌లపై మాత్రం మరో మలుపు తిరిగే ముగింపుతో కూడిన చిత్రాన్ని ప్రదర్శించను న్నారు. ఆ విధంగా ఈ సినిమా కథ మొత్తానికి నాలుగు రకాల ముగింపుతో ప్రేక్షకులను అలరిస్తోంది. గౌతం వాసుదేవ్‌ మీనన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ‘ఏ ఇద్దరు వ్యక్తులు కూడా ఒకే విధంగా ఆలోచించరు. అలాగే ఒక్కో ప్రాంతం / భాష ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకొని ఒక్కో రకమైన ముగిం పును ఇచ్చాం’ అని అంటారు ఆయన. తమిళ ప్రేక్షకులు అసాధారణ ముగింపులను కోరుకుంటారని, తెలుగు వారు సుఖాంతాన్ని ఇష్టపడుతారని వ్యాఖ్యానించారు..

అందుకే ఈ పాత్రకోసం కాస్త ఒళ్ళు చేసి నటించా
'ద డర్టీ పిక్చర్' చిత్రంతో యూత్‌లో ఎంతో క్రేజ్ సంపాదించుకుంది విద్యాబాలన్. ఈ చిత్రంలో సిల్క్ పాత్రలో నటించి అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించింది ఈ మలయాళీ ముద్దుగుమ్మ. ఈ చిత్రానికి ఫిల్మ్‌ఫేర్ అవార్డును కూడా గెలుచుకుంది. బాలీవుడ్‌లో స్టార్ హీరోల సినిమాలకు ధీటుగా ఈ అమ్మడు చిత్రం బాక్సాఫీస్‌ని బద్దలు కొట్టి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపోయేలా చేసింది. దాంతో ఇప్పుడు విద్య ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. అందుకే ఈ అమ్మడు నటిస్తున్న తదుపరి చిత్రం 'కహానీ'పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రంలో విద్యాబాలన్ గర్భవతిగా నటిస్తోంది. దీనికోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుందట అమ్మడు. "చేసే పాత్ర ఏదైనా నాచురల్‌గా ఉండాలి.అప్పుడే పాత్రలోని నిజాయితీని ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారు. ఏదో చేశాం అనేలా కాకుండా పాత్ర పండేలా నటించాలి. గర్భవతి పాత్ర కదా అని సాదా సీదాగా నటిస్తే ఏం బాగుంటుంది. అందుకే ఈ పాత్రకోసం కాస్త ఒళ్ళు చేసి నటించా. దాంతో ఆ పాత్రకి న్యాయం చేయగలిగా. దర్శకుడుతో పాటు సినిమా యూనిట్ సభ్యులంతా నన్ను అభినందించారు. ఇటీవలే ఈ చిత్రం ఆడియో విడుదలైంది. అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది'' అంటోంది విద్యా. రూ.వంద కోట్లకు పైగా వసూలు చేసిన ఈ అమ్మడు మరి 'ద డర్టీ పిక్చర్' చిత్రం...త్వరలో విడుదల కానున్న 'కహానీ' చిత్రంతో ఇంకెంత వసూలు చేస్తుందో వేచి చూడాలి.

 
ToP