న్యూస్/వ్యూస్
 
 
 
 

నాని ద్విపాత్రల 'జెండా పై కపిరాజు' ఆగస్ట్ 8న
యువ హీరో నాని తొలిసారిగా ద్విపాత్రాభినయం చేస్తూ నటిస్తున్న చిత్రం 'జెండా పై కపిరాజు'. సముద్రఖని దర్శకత్వంలో మల్టీడైమ్షన్ ఎంటర్ టైన్ మెంట్స్ ప్రై.లిమిటెడ్ పతాకంపై రజత్ పార్ధసారధి ఈ చిత్రాన్ని నిర్మించారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే నెల 8న ప్రేక్షకుల ముందుకురానుంది.నిర్మాత రజత్ పార్ధసారధి మాట్లాడుతూ - ''ప్రతి వ్యక్తి తనని తాను సంస్కరించుకుంటే దేశాన్ని సంస్కరించినట్లే -అనే కాన్సెఫ్ట్ ని వినోదభరితంగా తెరకెక్కించడం జరిగింది. ఈ చిత్రం ఆడియోకి విశేష స్పందన లభించింది. 'శంభో శివ శంభో' వంటి మంచి చిత్రానికి దర్శకత్వం వహించిన సముద్రఖని దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం యూత్ కి బాగా నచ్చుతుంది. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. మిగతా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి ఆగస్ట్ 8న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాం. ఈ చిత్రంలో ప్రముఖ తమిళ నటుడు శరత్ కుమార్ ప్రత్యేక పాత్రలో సి.బి.ఐ అధికారిగా నటించారు. అమలాపాల్, రాగిణి ద్వివేది హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందనే నమ్మకం ఉంది'' అని తెలిపారు.శివబాలాజి, వెన్నెల కిషోర్, తనికెళ్ల భరణి, ఆహుతిప్రసాద్, ధనరాజ్, ఫృధ్వీ తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు - శశాంక్ వెన్నెలకంటి, సంగీతం - జి.వి.ప్రకాష్ కుమార్, కెమెరా - సుకుమార్.

ఒకసారి కమిట్ అయితే ప్రాణంగా ప్రేమించాలి!
నా దృష్టిలో ప్రేమ చాలా పవిత్రమైనది. ఎలాంటి దాపరికాలు లేకుండా స్వచ్ఛమైన హృదయంతో ప్రేమిస్తే కలకాలం కలిసి వుండొచ్చు. కొందరు ప్రేమికుల మధ్య మనస్పర్ధలు ఎందుకు వస్తాయో నాకర్థం కాదు. కలహించుకొని విడిపోతే అది ప్రేమే కాదు అని ప్రేమతత్వాన్ని వల్లిస్తోంది గోవాభామ ఇలియానా. ఆస్ట్రేలియాకు చెందిన ఫొటోగ్రాఫర్ ఆండ్రూతో ఈ సుందరి ప్రేమాయణం సాగిస్తోన్న విషయం తెలిసిందే. మరో ఏడాదిలో ఈ జంట పెళ్లిచేసుకోబోతున్నారని ముంబై మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం ఇలియానా హ్యాపీ ఎండింగ్ అనే చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. ఇటీవల ముంబైలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రేమపై తన మనోభావాల్ని వ్యక్తం చేసింది ఇలియానా. ఆమె మాట్లాడుతూ- ప్రేమలో ఒకసారి కమిట్ అయితే ప్రాణంగా ప్రేమించాలి.ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఆ బంధాన్ని పెళ్లివరకు తీసుకెళ్లగలగాలి. అప్పుడే ప్రేమకు పరిపూర్ణత చేకూరుతుంది. తాత్కాలిక ఆకర్షణకులోనై ప్రేమిస్తే జీవితంలో చాలా బాధపడాల్సివుంటుంది అని చెప్పింది. గత రెండేళ్లుగా తెలుగు సినీ పరిశ్రమకు దూరంగా వుంటోన్న ఈ సొగసరి త్వరలో తెలుగు సినిమాల్లో రీఎంట్రీ ఇస్తానని చెప్పింది. కొన్ని చిత్రాలు చర్చల దశలో వున్నాయని పేర్కొంది.

నా లోని నటనను ఈ సినిమాలో పూర్తిస్థాయిలో
సీనియర్ నటి రేఖ నటనను తలపింపజేయడం తన వల్ల అయ్యే పనికాదని తెలుసని బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ వ్యాఖ్యానించింది. రేఖ హీరోయిన్‌గా నటించిన ‘ఖూబ్‌సూరత్’ సినిమా రీమేక్‌లో సోనమ్‌కపూర్ నటిస్తోన్న విషయం తెలిసిందే. పాత సినిమాలో రేఖ నటించినట్లు ఇప్పుడు తాను నటించగలనని చెప్పడం అతిశయోక్తి అవుతుందని సోనమ్ వ్యాఖ్యానించింది. పాత ఖూబ్‌సూరత్ సినిమాలో రేఖ నటన అద్భుతం.. అందులో ఆమె హావభావాలు, వేషధారణ, నటన ప్రేక్షకులను కట్టిపడేశాయని సోనమ్ కితాబు ఇచ్చింది. కాగా కొత్త ‘ఖూబ్‌సూరత్’ ట్రయలర్‌ను సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా సోనమ్ మాట్లాడుతూ- రేఖతో తన నటనను పోల్చవద్దని కోరింది. ‘రిషికేష్ సినిమాల్లో ఎక్కువ శాతం సందేశంతో కూడిన హాస్యభరిత సినిమాలే.. అవి ఆద్యంతం నవ్విస్తూనే ఎంతో కొంత ఆలోచింపజేసేలా ఉండేవి..’ అని చెప్పింది. ప్రస్తుతం అలాంటి సినిమాలను రాజు హిరానీ నిర్మిస్తున్నాడని సోనమ్ వ్యాఖ్యానించింది. కాగా, ఖూబ్‌సూరత్‌లో హీరోయిన్ పాత్ర ఆలోచన విధానం, ఆహార్యం నిజజీవితంలో తన వ్యక్తిత్వాన్ని పోలి ఉంటుందని సోనమ్ చెప్పింది. చాలావరకు తాను బయట ఎలా ప్రవర్తిస్తానో ఈ సినిమాలో ‘మిలీ’(పాత్ర పేరు) కూడా అలాగే ప్రవర్తిస్తుందని ఆమె అంది. తనలోని నటనను ఈ సినిమాలో నిర్మాత, డెరైక్టర్లు పూర్తిస్థాయిలో వినియోగించుకున్నారని వ్యాఖ్యానించింది.ఈ సినిమా సెప్టెంబర్ 19న దేశవ్యాప్తంగా విడుదల కానుంది. దీని కోసం తాను ఎంతో ఎదురుచూస్తున్నానని సోనమ్ చెప్పింది. ఇదిలా ఉండగా, ఈ సినిమాలో ప్రముఖ పాకిస్థానీ నటుడు, గాయకుడు ఫవాద్ ఖాన్‌ను హీరోగా పరిచయం చేశారు. అలాగే కిరణ్ ఖేర్, రత్నా పాఠక్ కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్ర లు పోషించారు. డిస్నీ, సోనమ్ సోదరి రియా కపూర్, తండ్రి అనిల్ కపూర్ సంయుక్తంగా దీనిని నిర్మించారు. శశాంఖ్ ఘోష్ దర్శకత్వం వహించాడు.

ఓ మంచి చిత్రాన్ని ఆపడం మంచిది కాదు!
జిగర్థాండ (తెలుగు డబ్బింగ్: చిక్కడు దొరకడు) చిత్రం వివాదంలో చిక్కుకుంది. సినిమా విడుదలను తమకు చెప్పకుండా వాయిదా వేశారనే కారణంతో జిగర్థాండ నిర్మాత కదిరేశన్ పై సినీనటుడు సిద్దార్థ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిగర్థాండ చిత్రం వాస్తవానికి జూలై 25 తేదిన శుక్రవారం తమిళనాడులో విడుదల కావాల్సి ఉంది. అయితే చెప్పపెట్టకుండా విడుదలను నిర్మాత వాయిదా వేశారని సిద్దార్థ్ అన్నారు. మీరెవరైనా కానివ్వండి.. ఇలాంటి డర్టీ గేమ్ ఆడకండి. సినిమాను విడుదల చేయడంలో ఆలస్యం కావొచ్చు. కాని మమ్మల్ని ఆపలేవు అని ట్వీట్ చేశారు. ఓ మంచి చిత్రాన్ని విడుదల కాకుండా ఆపడం మంచిది కాదని సిద్దార్థ్ సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విటర్ లో పలు సందేశాలు పోస్ట్ చేయడం తాజా ఓ వివాదానికి దారి తీసింది. జిగర్థాండ చిత్రం కోసం దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు, ఇతర సభ్యులు చాలా కష్టించి పనిచేశారని.. తమతో సంప్రదించకుండా.. కనీసం గౌరవం కూడా ఇవ్వకుండా.. చిత్ర విడుదలను వాయిదా వేశారు అని ట్విటర్ లో తెలిపారు. జిగర్థాండ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రేక్షకులు, అభిమానులకు క్షమాపణ చెబుతున్నానని సిద్దార్థ్ ట్విటర్ లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. . సిద్దార్థ్ లక్ష్మీ మీనన్ జంటగా నటించిన చిత్రం జిగర్‌తండా. పిజ్జా వంటి విజయవంతమైన చిత్రం తరువాత కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన చిత్రం ఇది. గుప్తా కంపెనీ పతాకంపై ఎస్.కదిరేశన్ నిర్మించిన ఈ చిత్రం ఇప్పటికే విడుదల కావలసింది. దర్శక నిర్మాతల వివాదం కారణంగా చిత్రం విడుదలలో జాప్యం జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. చిత్రం సెన్సార్ కట్స్ విషయంలో దర్శక నిర్మాతల మధ్య వివాదం ఏర్పడినట్లు సమాచారం. జిగర్‌తండా చిత్రానికి సెన్సార్ బృందం కొన్ని కట్స్‌తో యు సర్టిఫికేట్ ఇచ్చారు. ఎట్టకేలకు జిగరతండా చిత్రాన్ని ఈ నెల 25న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పుడీ చిత్రం మరోవారం వెనక్కుపోతోంది. ఆగస్టు ఒకటిన విడుదల చేయనున్నట్లు నిర్మాత ఎస్.కదిరేశన్ వెల్లడించారు. అందుకు కారణాన్ని ఆయన తెలుపుతూ ఇటీవల విడుదలైన ధనుష్ చిత్రం వేలై ఇల్లా పట్టదారి విజయవంతంగా ప్రదర్శితమవుతోందన్నారు. ఈ చిత్రాన్ని దృష్టిలో పెట్టుకుని బయ్యర్లు, పంపిణీదారులు జిగర్‌తండా చిత్రం కూడా చాలా బాగా వచ్చిందని, కొంచెం గ్యాప్ ఇచ్చి విడుదలచేస్తే అధిక థియేటర్లలో ప్రదర్శించవచ్చునని సూచించడంతో వారి శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని జిగర్‌తండా చిత్రాన్ని ఆగస్టు ఒకటో తేదీన విడుదల చేయాలని నిర్ణయించినట్లు నిర్మాత వివరించారు.

భయపడిపోయా, చావును దగ్గరగా చూశా!
'తీన్ మార్' సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నటించిన కృతి కర్బందా... అగ్ని ప్రమాదం నుంచి బయటపడింది. సినిమా షూటింగ్ లో ప్రమాదాలు సాధారణం. ఆమె చేస్తున్న సినిమా షూటింగ్ లో ప్రమాదమేమీ జరగలేదు. కానీ ఆమె బస చేసిన హోటల్ రూమ్ లో జరిగిన అగ్నిప్రమాదం నుంచి తప్పించుకుంది.'హోటల్ చిరాంత్ లో నాకు ఎగ్జిక్యూటివ్ సూట్ ఇచ్చారు. గీజర్ తో వేన్నీళ్లు కాచుకుని సాన్నం చేసి.. కాసేపు టీవీ చూసి నిద్రపోయా. కొంత సమయం గడిచాక నిప్పులు అంటుకున్న చప్పుడు వినబడితే లేచాను. అయితే కలలో అనుకుని మళ్లీ నిద్రపోయాను. మళ్లీ శబ్దం వినబడడంతో మేల్కోని చూసే సరికి గదిలో మంటలు మెల్లగా వ్యాపిస్తున్నాయి. చాలా భయపడిపోయాను. వెంటనే తేరుకుని తడి టవల్ ఒంటికి చుట్టుకుని గట్టిగా కేకలు వేశాను. ఇంతలో సినిమా, హోటల్ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పారు. ఎప్పుడూ భయపడని నేను చావును దగ్గరగా చూశాను' అని కృతి భయంగా చెప్పింది.హోటల్ సిబ్బంది నిర్లక్ష్యం పట్ల ఆమె అసంతృప్తి వ్యక్తం చేసింది. కృతి తెలుగులో నటిస్తున్న 'కరెంట్ తీగ' సినిమా షూటింగ్ లోనూ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం నుంచి మంచు మనోజ్ బయటపడ్డాడు.

నాగేష్ మనవడు ఆనంద్‌బాబు కొడుకు హీరోగా
ప్రస్తుతం కోలీవుడ్‌లో రజనీకాంత్‌కు వారసులుగా ఆయన ఇద్దరు కూతుళ్లు (ఐశ్వర్య ధనుష్, సౌందర్య రజనీకాంత్ అశ్విన్) దర్శకత్వంలో రాణిస్తున్నారు. పద్మభూషణ్ వారసురాలు శ్రుతిహాసన్, క్రేజీ హీరోయిన్‌గా వెలుగొందుతున్నారు. రెండో కూతురు అక్షర కూడా హీరోయిన్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అవుతున్నారు. ఇక నటుడు శివకుమార్ వారసులు సూర్య, కార్తీ సూపర్ హీరోలుగా ప్రకాశిస్తున్నారు. శరత్‌కుమార్ కూతురు వరలక్ష్మి హీరోయిన్‌గా ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు.ప్రభు తనయుడు, దివంగత మహానటుడు శివాజీగణేశన్ మనవడు విక్రమ్ ప్రభు యువ హీరోగా దూసుకుపోతున్నారు. అలాగే మురళి కొడుకు అధర్వ, కార్తీక్ వారసుడు గౌతమ్ కార్తీక్, భాగ్యరాజ్ కొడుకు శాంతను, పాండియరాజన్ కొడుకు పృథ్వి తండ్రుల పేరు కాపాడే ప్రయత్నంలో ఉన్నారు. తాజాగా దివంగత హాస్య శిఖామణి నాగేష్ మనవడు, ఆనంద్‌బాబు తనయుడు గజేష్ హీరోగా తెరంగేట్రం చేస్తున్నారు. ఈ చిత్రానికి 'కల్‌కండు' అనే టైటిల్‌ను నిర్ణయించారు.'యారడా మహేశ్' చిత్రం ఫేమ్ డింపుల్ శోబాడే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి నందకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన చిత్ర వివరాలను తెలుపుతూ -మ్యూజిక్‌ను రీక్రియేట్ చేసే నటుడు తన చిత్రంలో హీరోగా నటించాలని భావించనున్నారు. గతంలో తన చిత్రాల్లో దివంగత నటుడు నాగేష్ నటించారని గుర్తు చేశారు. ఆయన మనవడు కూడా నటించడానికి ఆసక్తి చూపుతున్నారని తెలియడంతో ఆయనతోపాటు కుటుంబ సభ్యులందరికీ కథ వినిపించి గజేష్‌ను ఎలా ప్రజెంట్ చేయనున్నది వివరించానన్నారు. చిత్రకథ చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటుందని చెప్పారు. చిత్ర షూటింగ్ దాదాపు పూర్తి అయ్యిందని ఆగస్టు చివరిలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు వెల్లడించారు.

ఆ కెమిస్ట్రీ ఇక వ్యక్తిగత జీవితానికే అంకితం!
'స్లమ్ డాగ్ మిలియనీర్' హీరోయిన్ ఫ్రీదా పింటో బాల్య వివాహాలపై గళం విప్పబోతోంది. బ్రిటన్ లో జరగబోయే ప్రపంచస్థాయి బాలికల సదస్సులో బాల్య వివాహాలపైన, మహిళలకు బలవంతపు సున్తీ చేయించడం వంటి దురాచారాలకు వ్యతిరేకంగా ప్రసంగించబోతోంది. స్వచ్ఛంద సంస్థలు, అంతర్జాతీయ సంస్థలు, ప్రభుత్వాల ప్రతినిధుల సదస్సు ముగింపులో ఆమె ముఖ్య అతిథిగా ప్రసంగించనున్నారు. భారతదేశంలో ఇప్పటికీ బాల్య వివాహాలు, మహిళలకు సున్తీ చేయించడం కొనసాగటం పట్ల ఫ్రీదా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఇప్పటికైనా అందరూ గళం విప్పాలని ఆమె అంటున్నారు. ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ ద్వారా ప్రపంచవ్యాప్తంగా దేవ్ పటేల్, ఫ్రీదా పింటోకి మంచి గుర్తింపు వచ్చిన విషయం తెలిసిందే. ఫ్రీదా కన్నా దేవ్ దాదాపు ఐదేళ్లు చిన్నవాడు. అయినా, ప్రేమలో పడటానికి వీళ్లిద్దరూ వయసును పెద్ద విషయంగా తీసుకోలేదు. ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్న ఈ ఇద్దరూ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? అనే విషయం పక్కన పెడితే.. ఇక ఇద్దరూ కలిసి నటించకూడదనుకుంటున్నారట. ‘‘తొలి కలయికలో రూపొందిన సినిమాలోనే కావాల్సినంత కెమిస్ట్రీ పండించేశాం. ఆ కెమిస్ట్రీని ఇక వ్యక్తిగత జీవితానికి అంకితం చేయాలనుకుంటున్నాం. అందుకే కలిసి నటించకూడదనుకున్నాం’’ అని పేర్కొన్నారు ఫ్రీదా. లాస్ ఏంజిల్స్‌లో దేవ్‌తో ఆమె సహజీవనం చేస్తున్నారు. భవిష్యత్తులో ఆ నగరంలో ఓ రెస్టారెంట్ ఆరంభించాలనుకుంటున్నానని ఫ్రీదా పింటో చెప్పారు.


ప్రాణాలు కోల్పోయిన అధికారికి హృతిక్ సహాయం
అగ్నిప్రమాదంలో చనిపోయిన అధికారి కుటుంబానికి బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ బాసటగా నిలిచారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అధికారి నితిన్ యెవ్లేకర్ కుటుంబానికి హృతిక్ ఆర్దిక సహాయంతో పాటు సంతాపాన్ని తెలియచేశారు. గత శుక్రవారం ముంబై సబర్బన్ అంధేరిలోని లోటస్ బిజినెస్ పార్క్ లోని 22 అంతస్తుల భవనంలో ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ భవనంలో హృతిక్ కుటుంబానికి ఐదు ఫ్లోర్లు ఉన్నాయి. ప్రమాదంలో మంటల్ని అదుపులోకి తేవడానికి ప్రయత్నిస్తూ మరణించిన నితిన్ కుటుంబానికి 15 లక్షల ఆర్ధిక సహాయాన్ని ప్రకటించినట్టు సమాచారం. అయితే హృతిక్ కుటుంబం అధికారికంగా ప్రకటించలేదు. మనకు అవసరం ఏర్పడినపుడు ఇతరులు సహాయం అందించడమనేది ప్రధానం. సహకరించుకోవడమే ముఖ్యం. ఇలాంటి సంఘటనల్లో మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి కుటుంబాన్ని ఆదుకోవడం ప్రధానం అని హృతిక్ ఓ ప్రకటనలో తెలిపారు.

మరోసారి సమంతను అభినందిద్దాం!
ఎవరైనా ఒక నటి అద్భుతంగా నటిస్తే పొగడ్తలు రావడం సహజం. అందునా చిత్ర పరిశ్రమలో ఒకరినొకరు పొగుడుకునే కల్చర్‌ ఎక్కువ. అయితే అలా పొగిడేప్పుడు ముఖస్తుతి కోసమో, లేక ఇంకో కారణంతోనో పొగిడేస్తే తెలిసిపోతుంది. అయితే సినిమా ఇండస్ట్రీలో కొందరు ప్రముఖులు పక్కా క్యాలిక్యులేటెడ్‌గా ఉంటారు. నచ్చితేనే పొగుడుతారు. నచ్చకపోయినా మొహమాటం లేకుండా చెప్పేస్తారు. అయితే అలాంటి ఓ సందర్భం సమంతకి వచ్చింది. ఈ అమ్మడు ఇటీవలి కాలంలో అద్భుత నటిగా కితాబునందుకుంటోంది. అమ్మడు నటించిన 'మనం' సినిమాలో మైండ్ బ్లోవింగ్‌ పెర్ఫామెన్స్‌ కట్టిపడేసిందని ఇప్పటికే ఆ సినిమాలో స్టార్‌ హీరో నాగార్జున తెగ పొగిడేశారు. అయితే ఆ పొగడ్త అక్కడికే పరిమితం కాలేదు. సమంత ఏ సినిమా సెట్‌లో ఉన్నా 'మనం' సినిమాలో అమ్మడి గురించిన చర్చే. 'అల్లుడు శీను' సెట్‌లో కూడా ఇదే జరిగింది. సమంత అద్భుతంగా నటించిందని -అన్నాడు ప్రకాష్‌రాజ్‌. అంతేకాదు, తను వేరేవాళ్లతో మాట్లాడుతున్నప్పుడు, ఇతరుల ముందు సమంత అద్భుతంగా నటించిందని కితాబిచ్చాను.. అని విలక్షణ నటుడు చెప్పాడు. ఓ గొప్ప నటుడినుంచి ఇలాంటి గొప్ప గుర్తింపు దక్కడం అంటే ఆషామాషీ కాదు. సమంతకు ఆ గౌరవం దక్కింది. అంతెందుకు వి.వి.వినాయక్‌ అంతటి దిగ్గజమే సమంత నటనకు ఫ్లాటయిపోయానని కాంప్లిమెంట్‌ ఇచ్చేశాడంటే ఆలోచించుకోవచ్చు. మరోసారి సమంతను అభినందిద్దాం!

ఇంట్లో కూర్చోబెట్టే హీరోయిన్లను చేయగలను!
‘నా కూతురు తెరంగేట్రంపై అంత ఆసక్తి ఎందుకు’’ అంటూ నటి శ్రీదేవి రుసరుసలాడుతున్నారు. నిజంగానే ఆలూ లేదు చూలూ లేదు అబ్బాయి పేరు సోమలింగం అన్న చందాన అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వి సినీ రంగ ప్రవేశం గురించి చాలా కాలం నుంచి చాలానే ప్రచారం జరుగుతోంది. అదిగో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా పరిచయం అవుతున్నారు. ఇదిగో కోలీవుడ్ కొస్తున్నారు. లేదు లేదు తొలుత బాలీవుడ్‌లోనే రంగ ప్రవేశం చేయనున్నారంటూ -సత్య దూర ప్రచారం హోరెత్తుతోంది.ఇలాంటి అసత్య ప్రచారానికి ఫుల్‌స్టాప్ పెట్టేలా నటి శ్రీదేవి ప్రకటించారు. తన కుమార్తె చదువుకుంటోందని, తన సినీ రంగ ప్రవేశం ఇప్పట్లో ఉండదంటూ స్పష్టం చేశారు. తన కూతురు సినీ తెరంగేట్రం గురించి ఎందుకంత ఆసక్తి చూపుతున్నారో అర్థం కావడం లేదు అంటూ మీడియాపై విరుచుకుపడ్డారు. ఆ తరువాత బహుశా ఆమె తల్లినయిన తాను సినిమా రంగంలో ఉండటం వల్లనేమోనంటూ, తనకు తానే సమాధానం ఇచ్చుకున్నారు.ఇంకా శ్రీదేవి మాట్లాడుతూ మరెందుకు సినిమా కార్యక్రమాలకు కూతుళ్లను వెంటేసుకొస్తున్నారని అడుగుతున్నారు. 15 ఏళ్ల తరువాత మళ్లీ తాను నటిస్తున్నానని తన సినీ కార్యక్రమాల్లో పాల్గొనాలన్న ఆసక్తి తన కూతుళ్లకు ఉండదా? అంటూ ప్రశ్నించారు. అలాగని తన కూతుళ్ల రంగ ప్రవేశానికి ప్రయత్నిస్తున్నట్లు అర్థమా? అన్నారు. తాను తన కూతుళ్లను హీరోయిన్‌గా పరిచయం చెయ్యదలిస్తే ఇలాంటి కార్యక్రమాలకు తీసుకు రానవసరం లేదన్నారు. ఇంట్లో కూర్చోబెట్టే హీరోయిన్లను చేయగలనని శ్రీదేవి ఆవేశపూరితంగా పేర్కొన్నారు.

నచ్చిన పాత్ర కోసం...కష్టం కూడా ఇష్టంగానే!
బాలీవుడ్ అగ్ర కథానాయికలందరూ గత కొంతకాలంగా తమ పంథాకు భిన్నంగా అడుగులు వేస్తున్నారు. అభినయ ప్రధాన చిత్రాల ద్వారా ప్రేక్షకుల్ని మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. తమ పాత్రల్లో పరిపూర్ణత కోసం ఎలాంటి కష్టనష్టాలకైనా సిద్ధమంటున్నారు. 'బాబీ జాసూస్' చిత్రంలో తాను పోషించిన డిటెక్టివ్ పాత్ర కోసం విద్యాబాలన్ ప్రత్యేక శ్రద్ధతీసుకున్న విషయం తెలిసిందే. 'మేరీకోమ్' చిత్రం కోసం ప్రియాంకచోప్రా రెండు సంవత్సరాలుగా కఠోర సాధన చేస్తోంది. వీరి స్ఫూర్తితో బెంగళూరు సుందరి దీపికాపదుకునే సైతం పాత్రకోసం ఎలాంటి ప్రయాసకైనా సిద్ధమంటోంది. సంజయ్‌లీలాభన్సాలీ దర్శకత్వంలో రూపొందనున్న 'బాజీరావు మస్తానీ' చిత్రంలో దీపికా కథానాయికగా ఎంపికైన విషయం తెలిసిందే. చారిత్రక నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ ప్రేమకథా చిత్రంలో రణవీర్‌కపూర్ కథానాయకుడిగా నటిస్తున్నారు.ఈ చిత్రంలో చరిత్ర పురుషుడు బాజీరావ్ ప్రియురాలిగా, పోరాటయోధురాలిగా రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనుంది దీపికాపదుకునే. ఈ పాత్రకోసం ఆమె కొన్ని నెలలుగా కథక్‌లాంటి సంప్రదాయ నృత్యాలతో పాటు కళారీపట్టు వంటి యుద్ధ విద్యల్లో శిక్షణ తీసుకుంటోందట. ఇందుకోసం ఆమె ప్రత్యేక శిక్షకురాలిని కూడా నియమించుకున్నట్లు తెలిసింది. చారిత్రక చిత్రంలో నటించడం అదృష్టంగా భావిస్తున్నాను. మనసుకు నచ్చిన పాత్ర కోసం పడే కష్టం కూడా ఇష్టంగానే అనిపిస్తుంది. నా కెరీర్‌లో ఎంతో సవాల్‌తో కూడుకున్న పాత్రను బాజీరావు మస్తానీలో చేయడం ఆనందంగా వుంది అని పేర్కొంది దీపికాపదుకునే.

దాని ముందు వెనుక కథలను పట్టించుకోను!
‘నేను పుట్టి పెరిగింది ఆస్ట్రేలియాలో.. మోడలింగ్ రంగం నుంచి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టా.. నాలుగు సినిమాలు చేశా.. ప్రస్తుతం నా హిందీ బాగా మెరుగుపడింది. దీని క్రెడిట్ అంతా అక్షయ్‌కే దక్కుతుంది..’ అని ప్రముఖ మోడల్, నటి లిసా హైడన్ ముద్దుగా హిందీలో చెప్పింది. త్వరలో విడుదల కాబోతున్న ‘షౌకీన్’లో ఆమె హీరోయిన్‌గా నటించింది. ఇది 1982లో విడుదలైన సూపర్‌హిట్ రొమేంటిక్ కామెడీ సినిమా ‘షౌకీన్’కు రీమేక్. ఇందులో సూపర్‌స్టార్ అక్షయ్‌కుమార్‌తోపాటు, పరేష్ రావల్, అనుపమ్ ఖేర్, అన్నూకపూర్ వంటి సీనియర్ నటులు ప్రధాన పాత్రలు పోషించారు.ఈ సినిమా షూటింగ్ సమయంలో తాను హిందీలో అనర్గళంగా మాట్లాడగలిగేలా అక్షయ్ సాయం చేశాడని లిసా పేర్కొంది. ‘అక్షయ్ హిందీ చాలా బాగుంటుంది.. అతడు చాలా ఎనర్జిటిక్ యాక్టర్.. ఎప్పుడూ నవ్వుతూ, పక్కవాళ్లను నవ్వి స్తూ ఉంటాడు.. నాతో అతడు ఎప్పుడూ హిందీలోనే మాట్లాడేవాడు.. దాంతో నాకు ఆ భాషపై త్వరగానే పట్టు దొరికింది..’ అని లిసా నవ్వుతూ చెప్పింది. ‘షౌకీన్’లో రతీ అగ్నిహోత్రి పోషించిన పాత్రను ప్రస్తుతం రీమేక్‌లో లిసా పోషిస్తోంది.ఈ పాత్రకు మొదట నర్గిస్ ఫక్రిని తీసుకోవాలని అనుకున్నారు.. అయితే అప్పటికే ఆమె హాలీవుడ్ సినిమా ‘స్పై’కి ఒప్పందం చేసుకుని ఉండటంతో డేట్స్ కేటాయించలేకపోయింది. దాంతో ‘షౌకీన్’ అవకాశం లిసాను వరించింది. అయితే ఇవేమీ తనకు పట్టవని ఆమె చెప్పింది. ‘నాకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవడమే నా డ్యూటీ. అంతే తప్ప దాని ముందు వెనుక కథలను పట్టించుకోన’ని లిసా స్పష్టం చేసింది. కాగా, ఇంతకుముందు తాను నటించిన ‘క్వీన్’ సినిమా కూడా తనకు మంచి పేరు తెచ్చి పెట్టిందని, ప్రస్తుతం అందరూ తనను గుర్తు పడుతున్నారని లిసా ఆనందం వ్యక్తం చేసింది.

నేను తిండిబోతును, నాతోఆదిత్య పోటీ!
నిజజీవితంలోనూ తాను తిండిబోతునని నిజాయతీగా ఒప్పుకునే పరిణీతి చోప్రాకు సరిపోయే సినిమానే దొరికింది! ఆదిత్యరాయ్ కపూర్‌కు జోడీగా 'దావత్ ఏ ఇష్క్‌'లో నటిస్తోంది పరిణీతి. ఇద్దరం తిండిబోతులం కాబట్టే షూటింగ్ సెట్లపైనే స్నేహితులమైపోయామని చెబుతోంది. హబీబ్ ఫైజల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పరిణీతి హైదరాబాద్ యువతిగా కనిపించనుంది. కెబాబ్‌లు, బిర్యానీతో ఎంతటి వారినైనా కట్టిపడేసే బావర్చీగా ఆదిత్య నటిస్తున్నాడు. ‘నేను తిండిబోతును.ఆదిత్య నాతో పోటీ పడతాడని షూటింగ్ సమయంలోనే అర్థమయింది. మా ఇద్దరికీ తిండి అంటే చాలా ఇష్టం. ప్లేట్లకు ప్లేట్లు సెట్లపైనే లాగించే వాళ్లం. ఈ సినిమాలో నేను బాగా తినాలి. దీని కథ నాకోసమే రాశారేమో అనిపించింది’ అని వివరించింది.'దావత్ ఏ ఇష్క్' పాటల విడుదల కోసం నిర్వహించిన కార్యక్రమంలో పరిణీతి మాట్లాడుతూ ఈ సంగతులన్నీ చెప్పింది. హైదరాబాద్‌తోపాటు లక్నో, ముంబైలో సినిమా షూటింగ్ జరిగింది. లక్నో వంటకాల పుణ్యమాని ఆదిత్య, తాను విపరీతంగా బరువెక్కామంటూ ఈ 25 ఏళ్ల బ్యూటీ నవ్వేసింది. ‘మాతోపాటు అనుపమ్ ఖేర్ కూడా బాగా లాగించేవారు. ఆయన కొన్నాళ్లు లక్నోలోనూ ఉండడం వల్ల అక్కడి స్థానిక వంటకాలు, హోటళ్ల గురించి బాగా తెలుసు’ అని వివరించింది.

ఇప్పుడు ఇంట్లో నిరుద్యోగిగా కూర్చోవాల్సి వస్తోంది!
బాలీవుడ్ విలక్షణ నటుడు ఓం పురి సిగరెట్లు కాల్చడం మానేశాడు. నోట్లో వైట్ ప్యాచ్ రావడం, ముఖంలో కూడా కొంచెం తేడా కనిపించడంతో ఆయన స్నేహితులు, శ్రేయోభిలాషులు అంతా కేన్సర్ వచ్చిందేమోనని భయపడ్డారు. ఇటీవలే నోటికి సంబంధించి చిన్న శస్త్రచికిత్స కూడా చేయించుకున్న ఓం పురి.. ఇక జన్మలో సిగరెట్లు ముట్టేది లేదంటూ వాటిని వదిలిపెట్టేశాడు.నోట్లో వచ్చిన వైట్ ప్యాచ్ ఎంతకీ తగ్గకపోవడంతో ఆస్పత్రిలో చేరానని, దాంతో తనకు వెంటనే శస్త్రచికిత్స చేశారని ఓం పురి తెలిపాడు. అదృష్టవశాత్తు అది ఇంకా కేన్సర్ కారకంగా మారలేదని, అందువల్ల తన ప్రాణానికి వచ్చిన ముప్పేమీ లేదని చెప్పాడు. అయితే వైద్యులు మాత్రం ఆయన్ను సిగరెట్లు మానేయాల్సిందేనని గట్టిగా చెప్పారు.ఇన్ని సంవత్సరాలుగా వాటిని ఏమాత్రం వదిలిపెట్టలేని తాను.. డాక్టర్లు చెప్పడంతో వెంటనే మరునిమిషం నుంచే సిగరెట్లు మానేసినట్లు ఓంపురి చెప్పాడు. మన ఆరోగ్యం కంటే ఏమీ ముఖ్యమైనది కాదని, ఆ విషయం తాను ఆస్పత్రిలో చేరాకే తెలిసిందని అన్నాడు. ఇక సినిమాల గురించి చెబుతూ.. భారతీయ సినిమాల్లో తనకు ఇక అవకాశాలు ఏమీ కనిపించడం లేదని, ఇన్నాళ్ల పాటు అన్ని రకాల పాత్రలు చేసిన తర్వాత ఇప్పుడు ఇంట్లో నిరుద్యోగిగా కూర్చోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే అప్పుడప్పుడు మాత్రం పాశ్చాత్య దేశాల నుంచి ఒకటీ అరా ఆఫర్లు వస్తున్నాయని, వాటివల్లే కాస్త ఊరటగా ఉంటోందని తెలిపాడు.

 

NEWS & VIEWS : 1 - 2 - 3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 -