ఫీల్ గుడ్ సినిమా… ‘ప్రేమ‌జంట‌’ చిత్ర సమీక్ష

రేటింగ్ : 3/5

సన్ వుడ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రామ్ ప్రణీత్, సుమయ జంట‌గా న‌టిస్తోన్న చిత్రం ప్రేమ‌జంట‌. స్క్రీన్ మ్యాక్స్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ద‌గ్గుబాటి వ‌రుణ్ సహకారంతో ఈ చిత్రం జూన్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మహేష్ మొగుళ్ళూరి నిర్మాత. నిఖిలేష్ తొగరి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ప్రేమకథా చిత్రం ప్రేమజంట .
కధాంశం… చందు (రామ్ ప్రణీత్), నందు (సుమయ) కాలేజీ విద్యార్థులు. మైనర్లయిన ఈ ఇద్దరు ప్రేమలో పడతారు. పెద్దలు ప్రేమను వ్యతిరేకించడంతో చందు, నందు ఇద్దరు లేచిపోవాలని డిసైడ్ అవుతారు. పారిపోతున్న సమయంలో అల్లరి మూకలు చందు పై దాడి చేస్తారు. ఆ క్రమంలో నందు, చందు పోలీసులకు సేఫ్‌గా చిక్కడంతో మళ్లీ ఇంటికి చేరుతారు. చందు ప్రేమను నిరాకరించిన తండ్రి ఆమెకు పెళ్లి చేయడానికి ప్రయత్నిస్తారు. ఆ క్రమంలో వారు పెళ్లి పీటల మీద నుంచి పరారై హైదరాబాద్‌కు చేరుకొంటారు. చందును బురిడీ కొట్టించి నందును వేశ్యవాటికలకు ఓ వ్యక్తి (షఫీ) అమ్మేస్తాడు.వ్యభిచార కూపం నుంచి నందు ఎలా బయటపడింది? హైదరాబాద్‌కు చేరిన ఈ ప్రేమ జంట ఎలాంటి కష్టాలను అనుభవించింది? చందు, నందు ప్రేమ కథకు ఎలాంటి ముగింపు లభించింది.వారు తమ ప్రేమను గెలిపించుకొన్నారా? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ ‘ప్రేమ జంట’ చిత్రం..
విశ్లేషణ…ఆదిలాబాద్‌లో జరిగే ఈ ‘ప్రేమ జంట’ కథ ప్రయాణం సాగించి హైదరాబాద్‌కు చేరే క్రమంలో ఆసక్తికరమైన సంఘటనలు, ట్విస్టులు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. చిన్న బడ్జెట్ అయినప్పటికీ.. పెద్ద సినిమాకు ఏ మాత్రం తీసిపోకుండా సినిమాను రిచ్‌గా తెరకెక్కించారు.అలాగే ప్రేక్షకులకు ఏమాత్రం పరిచయం లేని రామ్ ప్రణీత్, సుమయ జంట‌గా బాల తారలే ఈసినిమా కధకు జీవం పోసారు.ఈ సినిమాలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది.. సుమయ నటన. ఏ మాత్రం సినిమా అనుభవం లేకపోయినా తన స్క్రీన్ ప్రజెన్స్, హావభావాలు, కీలక సన్నివేశాల్లో ఆమె చూపించిన భావోద్వేగం సినిమాకు అదనపు ప్రధాన బలం. అలాగే రామ్ ప్రణీత్ కూడా మంచి నటనను కనబరిచారు. హీరో ఫ్రెండ్స్ గా నటించిన టిక్ టాక్ దినేష్ తనదైన కామెడీ టైమింగ్ తో , డైలాగ్స్ తో అలరించాడు . రెండో భాగంలో రాజా రవీంద్ర, ఉత్తేజ్, షఫీ, సూర్య బాల నటీనటులకు సపోర్ట్‌గా నిలిచేలా  స్క్రిప్టు రాసుకోవడం నిఖిలేష్ తొగరి దర్శకత్వ ప్రతిభకు నిదర్శనం. కొత్తవాడు అయినప్పటికీ దర్శకుడు నిఖిలేష్ సినిమాను తెరకెక్కించే విషయంలో ఎక్కడా తడబాటు పడలేదు. నటనలో అనుభవం లేని వారితో సినిమాను తెరకెక్కించిన తీరు ప్రశంసనీయం.ఈ చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్తే నిరాశపరచదు.’ప్రేమ జంట’ ఓ మంచి ఫీల్ గుడ్ సినిమా అనిపిస్తుంది.
సాంకేతికంగా… ఆదిలాబాద్ లోకల్ నేటివిటిని తెరకెక్కించిన తీరు అభినందనీయం. నిఖిలేష్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. పాటలు తెర మీద చక్కగా కుదిరాయి. రీరికార్డింగ్ సన్నివేశాలకు బలాన్ని చేకూర్చింది. సురేష్ సినిమాటోగ్రఫి చాలా బాగుంది. కొన్ని షాట్స్ థ్రిల్ చేస్తాయి. మహేష్ మొగులూరి పాటించిన నిర్మాణ విలువలు చాలాబాగున్నాయి.
 
అభినందన… మైనర్ బాలబాలికల ప్రేమ వ్యవహారాన్ని అలాగే పరువు హత్యల నేపథ్యాన్ని ఎంచుకొని మంచి ప్రయత్నం చేసాడు దర్శకుడు . అందుకు తగ్గ నటీనటులను కూడా ఎంచుకొని భేష్ అనిపించుకున్నాడు . వినసొంపైన పాటలతో ఆద్యంతం రక్తికట్టించారు . డైలాగ్స్ బాగున్నాయి . నిర్మాణ విలువలుకూడా బాగున్నాయి . మంచి అంశమే ఎంచుకున్నారు, కానీ స్క్రీన్ ప్లే పరంగా మరికొన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేది. బడ్జెట్ఎక్కువ ఉండి, ఇంకా మంచి నటీనటులు ఉంటే ఈ’ప్రేమ జంట’ గ్యారెంటీగా ఓ ‘సైరత్’,’ ప్రేమిస్తే’ సినిమాల సరసన నిలిచేదనడంలో ఏ మాత్రం సందేహం లేదు.