'కొత్త ఒక వింత... పాత ఒక రోత' అని అందరూ అంగీకరిస్తారు. అయితే ఆ కొత్తబాటను పట్టడానికి, నూతన
అనుభూతుల్ని ఆస్వాదించడానికి సాహసించే వారు అరుదు. కానీ జయాపజయాలను పక్కన పెడితే తెలుగు
చిత్రసీమలోని చిన్న, పెద్ద నటీనటులు ఈ యేడాది ఆ కొత్తదనం కోసం పరితపించారన్నది వాస్తవం. ఎప్పటిలానే
కాంబినేషన్‌లతో కొందరు కుస్తీపడితే, మరికొందరు కొత్త వారితో ప్రయోగాలు చేయడానికి సిద్ధపడ్డారు. భారీ స్థాయిలో
సినిమాలు తీసి చతికిల పడినవారు కొందరైతే, వినూత్న కథాంశంతో విజయకేతనం ఎగరేసిన వారు మరికొందరు.
ప్రేక్షకుల నుంచి ఆశించిన స్థాయిలో ఆదరణ లభించకపోయినా, అనుకున్న మంచి సినిమా తీశాం అని సంతృప్తి
పడుతున్న వారు మరికొందరు. ఏదేమైనా ఎప్పటిలానే తెలుగు సినిమా పది, పన్నెండు విజయాలు, శతాధిక
పరాజయాలతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతోంది.
2011 ప్రారంభమే ఓ నూతన ఉత్సాహంతో మొదలైంది. కొన్ని దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న దాసరి, బాలకృష్ణ
తొలి కాంబినేషన్‌లో రూపొందిన 'పరమవీరచక్ర' సంక్రాంతి కానుకగా విడుదలైంది. నటుడిగా బాలకృష్ణను కొత్త కోణంలో
దాసరి చూపించినా ఈ సినిమా ఆశించిన విధంగా ప్రేక్షకుల్ని రంజింప చేయలేకపోయింది. ఇక అదే సీజన్‌లో వచ్చిన
రవితేజ 'మిరపకారు' పరవాలేదనిపించింది. దర్శకుడు హరీశ్‌శంకర్‌కు, కొత్త నిర్మాత రమేశ్ పుప్పాలకు మరిన్ని
సినిమాలు చేసే స్ఫూర్తిని ఇచ్చింది. అయితే కె. రాఘవేంద్రరావు నిర్మాతగా ఆయన కుమరుడు కోవెలమూడి ప్రకాశ్
రూపొందించిన 'అనగనగా ఓ థీరుడు' కన్నుల పండువగా ఉన్న ప్రేక్షకుల్ని అలరించలేదు. ఇక సుమంత్ నటించిన
'గోల్కొండ హైస్కూల్'ది అదే పరిస్థితి. స్ఫూర్తిదాయకమైన ఈ సినిమాకు దక్కాల్సిన గౌరవం దక్కలేదు. ఇటువంటి
సమయంలో చిన్న సినిమాలకు కొత్త ఊపిరిపోసింది 'అలా మొదలైంది' చిత్రం. నాని, నిత్యమీనన్ జంటగా నటించిన ఈ
సినిమా ఓపెనింగ్స్ పెద్దగా లేకపోయినా, ఆ తర్వాత బాగుందనే మాట ఆ నోట ఈ నోట పెరిగి పెద్ద విజయాన్ని పొందేలా
చేసింది.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఊపందుకున్న తరుణంలో దర్శక నిర్మాతగా ఎన్. శంకర్ రూపొందించిన 'జై
బోలో తెలంగాణ'కు విమర్శకుల ప్రశంసలు లభించినా, మొత్తం మీద మిశ్రమ స్పందనే లభించింది. సునీల్ హీరోగా
రామ్‌గోపాల్‌వర్మ సినిమా రంగంపై విమర్శనాస్త్రాలతో సంధించిన 'కథ స్క్రీన్‌ప్లే దర్శకత్వం అప్పల్రాజు' యు టర్న్
తీసుకుంది. ఫిబ్రవరిలోనే వచ్చిన నాగార్జున 'గగనం', సునీల్ 'అప్పల్రాజు', విష్ణు 'వస్తాడు నా రాజు' చిత్రాలు
సాంకేతికపరంగా చర్చనీయాంశం అయ్యాయి. నూతన నటీనటులతో ప్రవీణ్ సత్తారు తీసిన 'ఎల్‌బిడబ్య్లు' చిత్రం సినీ
ప్రముఖుల దృష్టిని ఆకర్షించింది. ఈ నెలలో చెప్పుకోదగ్గ విజయాన్ని అందుకున్న సినిమా 'ప్రేమకావాలి'. సాయికుమార్
తనయుడు ఆదిని హీరోగా పరిచయం చేస్తూ విజయభాస్కర్ దర్శకత్వంలో అచ్చిరెడ్డి నిర్మించిన ఈ సినిమా మంచి
విజయాన్ని సాధించడమే కాదు, ఇందులోని హీరోహీరోయిన్లకు గట్టి పునాదిని ఏర్పరచింది.
మార్చి మాసం తెలుగు సినిమాలకు కలిసి రాలేదనే చెప్పాలి. ఛార్మి 'మంగళ' ఓపెనింగ్స్ బాగున్నా, సినిమా
ఆడలేదు. విడుదలకు ముందు ఆలీ 'తిమ్మరాజు'కు పేరొచ్చినా ఆ తర్వాత అది నిలబడలేదు. సుమంత్ 'రాజ్',
జగపతిబాబు 'చట్టం' సినిమాల్లో కథ భిన్నమైనదే అయినా ప్రేక్షకులు మెచ్చలేదు. ఈ నెలలో విజేత అల్లరి నరేశ్ అని
చెప్పాలి. వీరభద్రం తొలిసారి దర్శకత్వం వహించిన 'అహ నా పెళ్ళంట' కామెడీని ఇష్టపడే వారిని అలరించింది. నరేశ్
ఖాతాలో మరో విజయాన్ని ఈ సినిమా జత చేసింది. ఇక సునీల్‌కుమార్ రూపొందించిన 'గంగపుత్రులు' సినిమా
ప్రేక్షకాదరణ పొందకపోయినా, విమర్శకులు ప్రశంసల్ని, చిత్రోత్సవాల్లో అవార్డులను అందుకుంటోంది. ఏప్రిల్ మాసంలో
వచ్చిన ఎన్టీయార్ 'శక్తి' నిర్మాణంలోని భారీతనాన్ని విజయంలో అందుకోలేకపోయింది. ఇక పవన్ కళ్యాణ్ 'తీన్‌మార్'
నటుడిగా అతన్ని కొత్త కోణంలో చూపించినా, కథాంశాన్ని ప్రేక్షకులు ఆకళింపు చేసుకోలేకపోయారు. రానా సైతం
ఇలియానాతో 'నేను నా రాక్షసి'గా వచ్చి పరాజయాన్నే చవిచూశారు. ఈ నెల విజేత 'మిస్టర్ పర్‌ఫెక్ట్' ప్రభాస్. భారీ
సినిమాలకు విజయం ఎండమావేనా అని అందరూ అనుకుంటున్న సమయంలో 'మిస్టర్ పర్‌ఫెక్ట్' భారీ విజయాన్ని
సొంతం చేసుకుంది. ఆ విజయపరంపరను నాగ చైతన్య నటించిన '100 పర్సంట్ లవ్' కొనసాగించింది. అలానే
మరోసారి తాను కామెడీ టపాసును అద్భుతంగా పేల్చగలనని నరేశ్ 'సీమటపాకారు' సక్సెస్‌తో నిరూపించాడు. రవితేజ
'వీర', శ్రీకాంత్ 'దుశ్శాసన' ఇదే నెలలో విడుదల అయినా మొదటి రెండు సినిమాలే విజయాన్ని సాధించాయి. ఇక వివి
వినాయక్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన 'బద్రీనాథ్' ఓపెనింగ్స్ కొత్త రికార్డుల్ని సృష్టించాయి. అయితే ఈ
సక్సెస్‌ఫుల్ కాంబినేషన్ ఈ సారి అంచనాలను అందుకోలేదనే చెప్పాలి.
ఇక ద్వితీయార్థంలో శ్రీకాంత్ 'విరోథి' అనే అర్థవంతమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. నీలకంఠ
దర్శకత్వం వహించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసల్ని అందుకోవడమే కాదు, ఇండియన్ పనోరమలోనూ
ప్రదర్శితమైంది. అయితే ద్వితీయార్థంలో తొలి విజయాన్ని రామ్ నటించిన 'కందిరీగ' తెచ్చిపెట్టింది. కెమెరామేన్‌గా
ఉండి తొలిసారి మెగాఫోన్ చేతపట్టిన సంతోష్‌శ్రీనివాస్ దర్శకుడిగా తన సత్తాను బాగానే చాటుకున్నాడు. ఈ యేడాదికి
అసలు సిసలు విజయాన్ని అందించిన సినిమా 'దూకుడు'. మహేశ్‌బాబు కెరీర్‌లో 'పోకిరి'ని మించే సినిమా రావడం
కష్టం అని అందరూ ఓ నిశ్చితాభిప్రాయానికి వస్తున్న తరుణంలో 'దూకుడు'తో ప్రిన్స్ తన దమ్మును మరోసారి
చూపించారు. అదే ఊపుతో వచ్చిన మరో సినిమా 'ఊసరవెల్లి' ఓపెనింగ్స్‌తో అదరగొట్టింది. ఇక సందట్లో సడేమియా
అన్నట్టుగా 'మడతకాజా' వినోదరసాన్ని అందించింది. ఆ తర్వాత వచ్చిన సినిమాల్లో మంచి విజయాన్ని నమోదు
చేసుకుంది 'పిల్ల జమిందార్'. కథల ఎంపికలో నాని స్టైల్ వేరని ఈ సినిమా నిరూపించింది. అలానే రవిబాబు
దర్శకత్వంలో ఉషాకిరణ్ మూవీస్‌పై రామోజీరావు తీసిన 'నువ్విలా' సైతం విజయవంతమైన చిత్రంగా పేరు
తెచ్చుకుంది. ఈ యేడాది ప్రధమార్థంలో వచ్చిన 'వాంటెడ్' మాత్రమే కాదు, ద్వితీయార్థంలోని 'మొగుడు' సైతం
గోపీచంద్‌ను నిరాశకు గురి చేసింది. ఒక రకంగా సిద్ధార్థ్‌దీ అదే పరిస్థితి. ఎంతో ఇష్టపడి చేసిన 'అనగనగా ఓ ధీరుడు',
'180', 'ఓ మై ఫ్రెండ్' చిత్రాలు చేదు అనుభవాన్ని అందించాయి. ఇక మధుర శ్రీధర్ తీసిన 'ఇట్స్ మై లవ్‌స్టోరీ' నెగెటివ్
టాక్‌తో మొదలై, పాజిటివ్ టాక్‌ను సంపాదించుకుని నటీనటులకు మంచి పేరు తెచ్చిపెట్టింది. పవన్ కళ్యాణ్ 'పంజా'
కూడా స్టైలిష్ మూవీగా పేరు తెచ్చుకుంది తప్పితే విజయాన్ని పొందలేదు. మరోసారి 'సోలో'తో నారా రోహిత్ తాను
డిఫరెంట్ అని నిరూపించుకున్నారు. అలానే నిఖిల్‌ను కూడా 'వీడుతేడా' అంటూ భిన్నంగా చూపించి దర్శకుడు
చిన్నికృష్ణ మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక జగపతిబాబు నటించిన 'క్షేత్రం' సినిమా కూడా 'అరుంధతి' ఛాయల్లోనే
సాగి అలరించలేకపోయింది.
ఈ యేడాదిలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన సినిమాలు రెండు. ఒకటి నందమూరి బాలకృష్ణ నటించిన
'శ్రీరామరాజ్యం', మరొకటి అక్కినేని నాగార్జున చేసిన 'రాజన్న'. ఈ ఇద్దరు అగ్ర కథానాయకులు ఎంతో ఇష్టపడి, కష్టపడి
చేసిన సినిమాలు ఇవి. రామాయణ ఇతిహాసాన్ని మరోమారు ఈ తరానికి చెప్పాలనే కాంక్ష బాలకృష్ణది అయితే
అందుకోసం సాహసించిన వ్యక్తి నిర్మాత సాయిబాబు, దర్శకులు బాపు. ఈ సినిమా ఇప్పుడిప్పుడే నిర్మాత
కోరుకుంటున్న యువతరానికీ చేరువ అవుతోంది. ఇక నాగార్జున మనసుపడి చేసిన సినిమా 'రాజన్న'. దేశానికి
స్వాతంత్రం లభించినా, తెలంగాణలోని పలు పల్లెల్లో దొరలు జరిపిన దాష్టికానికి దృశ్య రూపం కల్పించాలని దర్శకుడు
విజయేంద్ర ప్రసాద్ పడిన తపనకు చేయూత నిచ్చారు. తాను హీరోగా నటించడంతో పాటు స్వయంగా ఈ సినిమాను
నిర్మించారు. ఈ ఇద్దరూ ఈ యేడాది తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం మరింత మంది పెద్ద హీరోలకు స్ఫూర్తి
కాగలదు.
ఈ యేడాది దాదాపు 60 మంది కొత్త దర్శకులు పరిచయం అయినా తమదైన ముద్ర వేసుకున్నవారిని, విజయాన్ని
సాధించి మరో అవకాశాన్ని పొందిన వారిని వేళ్ళ మీదే లెక్కించవచ్చు. నిర్మాతలు ఇచ్చిన అవకాశాలను, కారణాలు
ఏవైనా అనేక మంది దర్శకులు నిలబెట్టుకోలేకపోయారు. కథానాయికలు సైతం బాగానే పరిచయం అయినా
నిత్యామీనన్, శ్రుతి హాసన్, ఇషాచావ్లా, అమలాపాల్ వంటివారే నిలబడగలిగారు. మొత్తం మీద ఈ యేడాది దాదాపు
120 స్ట్రయిట్ చిత్రాలు విడుదలైతే, అందులో నిర్మాత పెట్టిన డబ్బుల్ని తిరిగి తెచ్చిపెట్టిన సినిమాలను వేళ్ళ మీద
లెక్కించదగ్గవే. అయితే రాశిలో కాకపోయినా వాసిలో ఈ యేడాది మంచి సినిమాలు వచ్చాయని ఖచ్చితంగా
చెప్పొచ్చు.
నేరు చిత్రాలతో పోటీ పడ్డ అనువాద సినిమాలు!
2011లో విడుదల విషయంలోనే కాదు, విజయం విషయంలోనూ అనువాద చిత్రాలు నేరు చిత్రాలతో పోటీ పడ్డాయి.
ఒకరకంగా నేరు చిత్రాలకంటే అనువాద చిత్రాలే ఐదారు ఎక్కువ విడుదల అయ్యాయి. తొలి మాసాలలో అనువాది
చిత్రాలు పెద్దగా ఆడకపోయినా జీవా నటించిన 'రంగం' ఘన విజయాన్ని సాధించి, అందరూ అనువాద చిత్రాలవైపు
దృష్టి మరల్చేలా చేసింది. ఆ వెనకే వచ్చిన 'కాంచన' విజయంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఆది పినిశెట్టి నటించిన
'వైశాలి', బాల దర్శకత్వం వహించిన 'వాడు-వీడు', విక్రమ్ 'నాన్న', కార్తీ 'నా పేరే శివ', శర్వానంద్ 'జర్నీ' వంటి
సినిమాలు మంచి పేరును, విజయాన్ని పొందాయి. అయితే భారీ అంచనాలతో వచ్చిన '1947 ఎ లవ్‌స్టోరీ', అజిత్
'గ్యాంబ్లర్', సూర్య'సెవెన్త్ సెన్స్', 'ప్రేమఖైదీ', షారూక్ 'జీవన్', 'డాన్-2', విద్యాబాలన్ 'డర్టీ పిక్చర్', విక్రమ్ 'వీడింతే'
చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని పొందలేదు.
అనువాద చిత్రాలపై ఆంక్షలు పెట్టాలని తెలుగు చలన చిత్ర వాణిజ్య సంస్థ, నిర్మాతల మండలి గత కొంత కాలంగా
కసరత్తులు చేస్తున్నాయి. అయితే అలా చేస్తే తమ థియేటర్లకు ఫీడింగ్ సమస్య ఏర్పడుతుందని ఎగ్జిబిటర్లు
అంటున్నారు. అనువాద చిత్రాలను సైతం పెద్ద, చిన్న తరగతులుగా విభజించాలని మరికొందరి వాదన. ఏదేమైనా
మంచి కథాబలం ఉన్న అనువాద చిత్రమే ఆడుతోంది తప్పితే, భారీతనానికి, హంగులు ఆర్భాటాలకు తెలుగు ప్రేక్షకుడు
ప్రాధాన్యం ఇవ్వడం లేదని 2011వ సంవత్సరం నిరూపించింది.