Bookmark and Share   Cinevinodam Subscribe
 
‘అందరి బంధువయా’
సినీవినోదం రేటింగ్‌ : 3.25/5

ఫిల్మోత్సవ్, యుటోపియా సంస్థలు చంద్రసిద్దార్థ దర్శకత్వంలో ఆర్కె, చంద్రసిద్దార్థ ఈ చిత్రాన్ని నిర్మించారు.

గ్రామీణ వాతావరణం నుండి నగరానికి వచ్చిన నందు ఇక్కడ కూడా తనదైన శైలిలో అందరికీ సహాయపడుతుంటాడు. ‘తను, తన కుటుంబం’ అంటూ ఉండే తన కొలీగ్ పద్దు ఇంట్లో నందు అద్దెకు వుంటాడు. ఓసారి తండ్రికి బాగులేదని తెలిసి పద్దూతో కలిసి ఊరికి వెళ్తాడు. నందు తండ్రి హనుమంతు తన ఆస్తులను అమ్మి మరీ గ్రామస్థులకు సహాయపడుతుంటాడు. అందుకనే గ్రామస్థులు అతన్ని స్వంత మనిషిగా అభిమానిస్తుంటారు. అక్కడి అనురాగం, ఆప్యాయతలు, నిష్కల్మషమైన వాతావరణం పద్దూ ఆలోచనా విధానాన్ని మార్చేస్తాయి. అదే సమయంలో నందూ స్వంత తండ్రిని అంటూ మరో వ్యక్తి వస్తాడు. కోటీశ్వరుడైన అతన్ని వద్దనుకుని విలువలున్న హనుమంతు దగ్గరనే నందు ఉండిపోతాడు. నందు, పద్దు ఒకరినొకరు ఇష్టపడ్డా, ఆ విషయం చెప్పుకోరు. దాంతో పద్దూకి ఓ అమెరికా సంబంధం వస్తుంది. ఒకరికి సాయపడేందుకు, తన కళ్ళూ, గుండె తనకా పెట్టి నందు జంగయ్య దగ్గర తెచ్చిన డబ్బుకు గడువు దాటిపోతుంది. ఈ పరిస్థితులను అధిగమించి నందు ‘అందరి బంధువయా’ అని ఎలా అనిపించుకున్నాడన్నదే ఈ చిత్ర కథాంశం.

సమాజంలో నానాటికీ విలువలు, తోటివాడికి సహాయపడే గుణం కనుమరుగయిపోతున్నాయి. దాంతో సహజంగానే సినిమా రంగంలోనూ మంచి సినిమాలు తగ్గిపోతున్నాయి. పూర్తి వ్యాపారాత్మకంగా మారిపోయిన ఈ రోజుల్లో కూడా మానవతావిలువలను పెంపొందించే సినిమా తీసిన ఆర్కే, చంద్రసిద్దార్థలను అభినందించాలి. బహుశా ఈ చిత్రం చివరిలో హీరోతో చెప్పించినట్లు- ‘‘మనిషి మీద నమ్మకం - మానవత్వం మీద విశ్వాసం’’ వారితో ఈ చిత్రం తీయించి వుంటుంది. ‘‘పక్షికి ఇంత ధాన్యం, పశువుకి ఇంత గ్రాసం, మనిషికి ఇంత సాయం’’ అంటూ తండ్రీకొడుకులు హనుమంతు, నందూలతో చేసిన సన్నివేశాలు మనసుని తాకుతాయి. కళ్ళు చెమరుస్తాయి. సహజమైన విధానంలో స్లోగానే అయినా సరళంగా ఈ సినిమాని దర్శకుడు నడిపించాడు. సినిమా చివరి భాగంలో మాత్రం రెగ్యులర్ డ్రామా కొంత చోటుచేసుకుంది. కమర్షియల్ సినిమాకి కాకుండా, ఒక మంచి సినిమాకి వెళ్తున్నామనే ఉద్దేశంతో వెళ్ళేవారిని ఈ చిత్రం తప్పక స్పందింపచేస్తుంది.

ఊర్లో శర్వానంద్ కి స్నానం చేయించడం, హనుమంతుకి తేలుకుడితే గ్రామస్తులు పడే ఆరాటం, ‘‘వారసత్వం అంటే రక్తం కాదు... సుగుణాలు రావడం’’ అంటూ ధనవంతుడైన తండ్రిని నందూ వదులుకోవడం హృద్యంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. పద్దూ అమెరికా బావ పెళ్ళి సన్నాహాలు, వాటిని అడ్డుకోవడానికి హీరో హీరోయిన్లు చేసే ప్రయత్నాలు వినోదాత్మకంగా వుంటాయి. అయితే, చిన్నప్పుడు వర్షంలో గొడుకు ఇచ్చిన మాష్టారి కష్టం తీర్చడం కోసం గూండా వడ్డీ వ్యాపారి జంగయ్య దగ్గర నందూ 5లక్షలు అప్పు చేయడం ‘అతి’గా వుంది. పైగా దానికోసం కళ్ళు, గుండె తాకట్టు పెట్టడం సహజత్వానికి దూరంగావుంది. జంగయ్య పాత్రని కేవలం సస్పెన్స్ కోసం వాడుకున్నారు. మాస్ కోసం కృష్ణ భగవాన్ పై సన్నివేశాలు పెట్టారు.

మంచి కథా చిత్రాలు ఎంచుకుంటున్న శర్వానంద్ ఇందులో నందుగా ఉదాత్తమైన పాత్రని చాలా బాగాచేశాడు. హనుమంతుగా నరేష్ కి ఈ పాత్ర తన కెరీర్ లోనే ‘ది బెస్ట్’ అనిపించేలా వుంటుంది. ప్రేక్షకుల మనసులపై ముద్రవేసేలా ఈ పాత్రని నరేష్ పోషించాడు. పద్దూగా చేసిన పద్మప్రియను హీరోయిన్ గా చూస్తే చాలా ఇబ్బంది పెడుతుంది. అయితే, రోజూ మనం చూసే పక్కింటి అమ్మాయిలా ఫీలయితే పెద్ద ఇబ్బంది వుండదు. ఇతర పాత్రలను విజయసారథి, ప్రగతి, దువ్వాసి మోహన్, ఎమ్మెస్ నారాయణ, సూర్య, ఆనంద్, ఆర్కే, సి.వి.ఎల్. పోషించారు. అనూప్ పాటలు కూడా రెగ్యులర్ సినిమాల్లాగ కాకుండా కథకు అనుగుణంగా వున్నాయి. చైతన్యప్రసాద్ సాహిత్యం, జయకృష్ణ గుమ్మడి ఫొటోగ్రఫీ బాగున్నాయి. కథ, మాటలు అందించిన బలభద్రపాత్రుని రమణిని ప్రత్యేకంగా అభినందించాలి.

- రాజేష్‌
 

Copy right reserved for www.cinevinodam.com 2005