సమీక్ష
 
 
 
 
 
‘అనగనగా ఓ ధీరుడు’
సినీవినోదం రేటింగ్‌ : 2.5/5
డిస్నీ- కె.రాఘవేంద్రరావుల సమర్పణలో ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో ప్రసాద్ దేవినేని, ప్రకాష్ కోవెలమూడి ఈ చిత్రాన్ని నిర్మించారు.

అంగరాజ్యాన్ని ఐరేంద్రి అనే దుష్టశక్తి స్వాధీనపరచుకుంటుంది. తన శక్తిని పెంచుకోవడానికి అగర్తలో వున్న మోక్ష అనే బాలికను బలి ఇవ్వాలనుకుంటుంది. దైవాంశతో వున్న మోక్షను ఐరేంద్రి సైనికుల నుండి, కాకాసురులనుండి యోధ అనే ఆమె అంధ అంగరక్షకుడు కాపాడతాడు. గతంలో పైలాపచ్చీసుగా యోధ తిరిగే రోజుల్లో జోస్యం చెప్పే ప్రియ ప్రేమలో పడతాడు. అదే సమయంలో సుడిగుండం అనే దుష్టుడి చేతుల్లో పడి కళ్ళు పోగొట్టుకుంటాడు. అదేసమయంలో ఆవిర్భవించిన దుష్టశక్తి ఐరేంద్రి ప్రియను తన స్థావరంలో బంధిస్తుంది. అనుకోని పరిస్థితులలో మోక్షను ఐరేంద్రి మనుషులు ఎత్తుకురావడంతో ఆమెను కాపాడేందుకు యోధ ఐరేంద్రి స్థావరంలోకి వస్తాడు. ఆ తర్వాత మోక్షను, ప్రియను యోధ ఎలా కాపాడిందీ ఈ చిత్ర కథాంశం.

‘అరుంధతి’, ‘మగధీర’ వరుసలో గ్రాఫిక్స్ ప్రధానంగా వచ్చిన చిత్రం ఇది. డిస్నీ వారి సాంకేతికత వల్ల విజువల్ ఎఫెక్ట్ లో మరింత మంచి ఫలితాలు సాధించగలిగారు. ఈ చిత్రంలో సీతాకోకచిలుకలు, పాములు, కాకాసురులు, క్లైమాక్స్ లో సర్పిణితో సహా పలు సన్నివేశాలు మంచి అనుభూతిని అందిస్తాయి. అయితే మంచికథ, కథనం లేకుండా ఎవరెంత చేసినా వృధా ప్రయాసేనని ఈ చిత్రం విషయంలో కూడా మరోసారి రుజువయ్యింది. సాంకేతికంగా ఎంతబాగున్నా, మంచి స్క్రీన్ ప్లే లేకపోవడం ఈ చిత్రానికి మైనస్. ఈ చిత్రం స్క్రీన్ ప్లే మరీ దయనీయంగా వుంది. ఈ చిత్రానికి క్రియేటివ్ సూపర్ విజన్ చేసిన కె.రాఘవేంద్రరావు ఏంచేశారో అర్థంకాదు. దర్శకుడు ప్రకాష్ అపరిపక్వతకు తోడు, మేధావి హీరో సిద్దార్థ పైత్యం కూడా కలగలిపి ఈ చిత్రాన్నినిజంగానే పిల్లల చిత్రంగా మార్చేసాయి. ఎంతబాగా చేయాలని ప్రయత్నించినప్పటికీ సిద్దార్థ సున్నితమైన ముఖంలో కరుకుదనం, యోధుడికుండాల్సిన శరీరదారుఢ్యం మిస్ అయ్యాయి. దైవాంశ సంభూతురాలని చెప్పిన మోక్షకు అంగరక్షకుల ఆర్భాటం ఎందుకో? ఒకటి, రెండుసార్లు తప్ప మోక్ష సాధారణ బాలికగా కనిపిస్తుంది. అదేవిధంగా పెద్ద దుష్టశక్తిగా చెప్పిన ఐరేంద్రి కూడా కేవలం సైనికులపైనే ఆధారపడుతుంది. ఇంకో తమాషా ఏంటంటే- దుష్టశక్తి ఐరేంద్రి దైవశక్తి కోసం చేసే సంప్రదాయ యాగాలను చేస్తుంది. ఆమెపై అమ్మవారి పాట తరహాలో గంభీరమైన పాట పెట్టి ప్రేక్షకులకు చిర్రెత్తించారు. అనుభవజ్ఞులైన ఫైట్ మాస్టర్స్ చేశారు గనుక కొన్ని ఫైట్లు బాగున్నాయి. కోటి, కీరవాణి, మిక్కీ జె.మేయర్ సంగీతంలో ఈ చిత్రంలోని 4 పాటల్లో రెండు బాగున్నాయి. సలీమ్ సులేమాన్ రీరికార్డింగ్, భూపతి ఆర్ట్, సౌందర్ రాజన్ ఫొటోగ్రఫీ, శ్రవణ్ ఎడిటింగ్ బాగున్నాయి. శశిరాజసింహ సంభాషణల్లో- బొక్క, ఏం పీకావ్, జఫ్ఫా వంటి ఎంతమాత్రం ఈ చిత్రానికి సరిపడని పదాలు వినిపిస్తాయి. డెప్త్ లేదు. హీరోను హీరోయిన్ ‘సొట్టబుగ్గలోడా’ అని, హీరోయిన్ ను ‘ఉసిరికాయ్’ అని పిలవడం బాగుంది. రవిబాబు ‘అమ్మా దానిమ్మా’ అని అనడం కూడా వినోదాత్మకంగా వుంది.

అందమైన కాస్ట్యూమ్స్ తో శృతి అందంగా కనిపించింది. సిద్దార్థతో ఆమె కాంబినేషన్ బాగుంది. లక్ష్మీప్రసన్న లేడీ విలన్ పాత్రను అంగీకరించడం నిజంగా సాహసమే. సినిమాలో భారీ ఖర్చుతో పలు రకాల కాస్ట్యూమ్స్ తో ఆమె పాత్రను ఎలివేట్ చేయడానికి బాగా ప్రయత్నించారు. నటనలోనూ, సంభాషణల్లోనూ బాగుందనిపించింది. అయితే పాత్రకు తగ్గ గాంభీర్యం ఆమె డబ్బింగ్ లో లేదు. సుడిగుండంగా రవిబాబు బాగా చేశాడు. అదోరకం పాత్రలో అలీ, జఫ్పా పాత్రలో బ్రహ్మానందం కాసేపు కనిపించారు. మోక్షగా హర్షిత, ఇతర పాత్రల్లో సుబ్బరాయశర్మ, తనికెళ్ళ భరణి, వల్లభనేని రామ్ నటించారు.

- రాజేష్