'గాడ్‌ఫాదర్' చిత్రాన్నే అటుమార్చి, ఇటుమార్చి ప్రేక్షకుడ్ని ఏమార్చే వర్మ ప్రయత్నం ఈసారీ ఫలించలేదు. అతను నిర్మాతే అయినా, తీసిన
దర్శకుడు వివేక్‌కృష్ణ వర్మ శిష్యుడే. వర్మ సారథ్యంలో వస్తున్న చిత్రాలు చూస్తే...ప్రపంచంలో జరుగుతున్న రకరకాల హత్యలన్నింటినీ తెలుగు
వాళ్లకు పరిచయం చేసే ప్రయత్నం 'బెజవాడ'లో చేశాడనిపిస్తోంది. నాగచైతన్యకు లేనిపోని ఇమేజ్‌ను తీసుకొచ్చే హడావిడే తప్ప అసలు సారం
లేదు. 'దడ' రూపంలో వచ్చిన వైఫల్యం నుంచి నాగచైతన్య ఇంకా నేర్చుకోలేదనే చెప్పాలి. అతనికి ఏమాత్రం సూటవని కథ ఇది. దాంతో ఏం
చూపినా ప్రేక్షకుడు మెచ్చలేకపోయాడు.
కొన్ని ముఠాల మధ్య జరిగిన హత్యల పరంపరను ఓ సినిమా కథగా చూపించాలన్న వర్మ ప్రయత్నమే ఇది. సినిమా ప్రారంభానికి ముందు
పలువురుని కలవడం ద్వారా, తన సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేయటం, ప్రజల్లో ఉద్రిక్తతలకు చోటు కల్పించటం వర్మ ఎత్తుగడగా
'బెజవాడ'ను చెప్పొచ్చు . ఇంతకీ వర్మ ఏం చెప్పాడు అన్న ఆసక్తితో థియేటర్‌కు బయలుదేరే వారెంతోమంది ఉన్నారు. తీరాసినిమా
చూశాక బేజారవటం ప్రేక్షకుడి వంతవుతోంది. తన సినిమా హిట్‌కోసం, గొప్ప దర్శకుడ్ని అనిపించుకోవటం కోసం ఇలాంటి ట్రిక్స్ ప్లే చేయటం
సరైంది కాదు.
బెజవాడలో నివసించే ఒక ప్రాంతం వారికి అండదండగా నిలబడి దందాలు చేసేవాడు కాళీ (ప్రభు). అతనికి కుడిభుజం విజయకృష్ణ
(ముకుల్‌దేవ్). కాళీకి సంబంధించిన అన్ని వ్యవహారాలు ఆచరణలో పెట్టేవాడు. కాళీ తర్వాత రెండవ ముఖ్య వ్యక్తిగా పేరు తెచ్చుకుంటాడు.
అయితే ఇతన్ని చూస్తే కాళీ సోదరడు శంకర్ ప్రసాద్ (అభిమన్యుసింగ్)కు ఈర్ష్య, అసూయ. గ్యాంగ్‌లో ఎదిగేందుకు చేయాల్సిన ప్రయత్నం
చేయలేక, అన్నను చంపి ఆ స్థానాన్ని ఆక్రమిస్తాడు. దీన్ని విజయకృష్ణ చేశాడని అపవాదు వేస్తాడు. కానీ మరోవైపు తన గురువును
చంపినవారిని గుర్తించి, ఒక్కోక్కర్నీ విజయకృష్ణ లేపేస్తుంటాడు. ఇదంతా ఇష్టంలేని శంకర్‌ప్రసాద్, విజయకృష్ణను చంపేస్తాడు. ఈ హత్యను
విజయకృష్ణ తమ్ముడు శివకృష్ణ (నాగచైతన్య) చూస్తాడు. షాక్‌కు గురవుతాడు. ఆ తర్వాత శివకృష్ణ ఏంచేశాడన్నది మిగతా కథ.
ఇందులో అమలాపాల్ బెజవాడ పోలీసు కమిషనర్ కుమార్తెగా నటించింది. అన్యాయాన్ని ఎదిరించే శివకృష్ణ అంటే ఇష్టపడుతుంది. తమ
ప్రేమకు అడ్డు వస్తున్నాడని తండ్రిపై కూడా కేసు పెడుతుంది. పగ, ప్రతీకారం నేపథ్యంగా సాగిన ఈ చిత్రం 'శివ', 'గాయం' చిత్రాలు నడిచిన
దారిలోనే నడుస్తుంది.
కత్తులు, కటారులతో కొత్తగా హింసను ఎలా చేయవచ్చనో దర్శకుడు చూపించటం తప్ప ప్రత్యేకతలేమీ లేవు. కొన్ని సన్నివేశాలు 'నా పేరు
శివ'ను తలపింపజేస్తాయి. క్రూరాతి క్రూరంగా చంపడం, భయంకరంగా రక్తాన్ని పారించడం వంటి హింసాత్మక సన్నివేశాలే పుష్కలంగా
ఉన్నాయి. వీటితో సినిమా ద్వారా ఏం చెప్పాలనుకున్నాడో, చూసిన ప్రేక్షకులు ఎలాంటి మైడ్‌సెట్‌కు దగ్గరవుతారో దర్శకనిర్మాతలకు
తెలియంది కాదు. వీటి వల్ల ఎవరికీ ఎలాంటి ప్రయోజనం లేకపోగా నష్టమే ఎక్కువ. కథరీత్యా ఇంకో నాలుగేళ్ల తర్వాత నాగచైతన్య చేయాల్సిన
పాత్ర. ఓ గ్యాంగ్‌ను నడిపే నాయకుడిగా ఇతని ఆహార్యం సరిపోలేదు. పైగా ఇతను చెప్పే డైలాగ్స్ చాలా పీలగా ఉన్నాయి. ఓ కాలేజ్ కుర్రాడు
గొడవకు దిగటం వేరు, ఓ గ్యాంగ్‌ను మెయింటేన్ చేయటం వేరు. పైగా పలు విషయాల్లో అనుభవంతో రాటుదేలిన వ్యక్తిల్ని ఎదుర్కొనే వ్యక్తిగా
నాగచైతన్యను చూపించారు. ఇది చూస్తున్న ప్రేక్షకుడికి చాలా అసహజంగా కనిపిస్తుంది.
వర్మ అనుకున్నట్టుగా హింస కూడా ఒక ఎమోషనే ! అంటే భావోద్వేగమైంది. దీన్ని 'రక్తచరిత్ర'లో వివేక్ ఒబెరాయి చూపినంత ఇంటెన్సివ్‌గా
నాగచైతన్య చూపలేకపోయాడు. రౌడీలకు లాయర్‌గా వ్యవహరించే పాత్రలో అశోక్‌కుమార్ సరితూగాడు. అవకాశవాద రాజకీయ నాయకుడిగా
కోట శ్రీనివాసరావుకు తగిన పాత్రే దొరికింది. క్రూరమైన వ్యక్తిగా 'రక్త చరిత్ర'లో కన్పించిన అభిమన్యుసింగ్ ఇందులోనూ అదే తరహా పాత్ర
పోషించాడు. ఇక అమలాపాల్ పాత్రలో ఎవరున్నా ఒక్కటే. సీరియస్ కథలో కాస్త తాలింపులా బ్రహ్మానందం, ఎం.ఎస్. నారాయణ పాత్రల
హాస్యం రొటీన్‌గానే ఉంది. నాగచైతన్య అన్నగా అజరుపాత్ర బాగానే ఉంది. వ్యాపారవేత్తగా ఉంటూ ఇరువర్గాలవారికి వారధిగా ఉండే పాత్రను
శుభలేఖ సుధాకర్ పోషించాడు. కథాకథనం విషయంలో దర్శకుడు వివేక్‌కృష్ణ సరైన శ్రమ చేయలేదనే చెప్పాలి. కొన్ని ముఠాల మధ్య జరిగిన
ఘర్షణలను చూపాలనుకున్నప్పుడు సరైన తార్కిక కారణాలతో కథ అల్లుకోవాలి. కొన్ని సన్నివేశాలు టీవీ సీరియల్స్‌గా అనిపిస్తాయి.
బెజవాడంటే రౌడీయిజం, ఎటాక్స్, కౌంటర్స్, కిల్లింగ్, బాంబు బ్లాస్ట్‌లు అంటూ లేనిదాన్ని చెప్పే ప్రయత్నం దర్శకుడు చేశాడు.