శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ పతాకంపై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు.
ప్రముఖ పారిశ్రామిక వేత్త కొడుకు కృష్ణ ఇందు అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. ఇందు స్నేహితురాలు భూమి.
కిరాతకుడైన ఆమె బావకిచ్చి పెళ్ళి చేయాలని భూమి తండ్రి నిర్ణయించడంతో ఇబ్బందుల్లో పడుతుంది. ఈ పెళ్ళిని
తప్పించడం కోసం - భూమి ఇప్పటికే ఒకరితో ప్రేమలో పడిందంటూ భూమి తాత ప్రచారం చేస్తాడు. భూమి
ప్రేమికుడిని ఇంటికి రప్పించి, అతని మనసు మర్చాలనుకున్న భూమి తండ్రి - అతన్ని తీసుకురమ్మంటాడు.
లేని ప్రేమికుడిని తేలేక సతమతమవుతున్న భూమి సమస్యను తీర్చడానికి ఆమే ప్రేమికుడిగా నటించమని కృష్ణను
పంపుతుంది ఇందు. భూమి ఇంటిలోని సమస్యలతో పాటు, భూమి తండ్రి - భూమి బాబాయ్ ల
మద్యనున్న వైరాన్ని కూడా పరిష్కరించడానికి కృష్ణ కృషి చేస్తాడు. దాంతో భూమి తండ్రితో పాటు అందరూ
అతన్ని అభిమానిస్తారు. ఇంతలో ఇందు ఆశ్చర్యకరంగా అక్కడికి వస్తుంది. ఆమె భూమి బాబాయ్ కూతురని
అప్పుడు తెలుస్తుంది. తనను అభిమానిస్తున్న అంతమంది - తమ అబద్ధపు ప్రేమ గురించి చెబితే తట్టుకోలేరని
కృష్ణ మదనపడుతుంటాడు. ఇటు భూమి అటు ఇందుల ప్రేమ మద్య నలిగిపోతుంటాడు. ఈ పరిస్థితుల నుండి
అతను ఎలా బయట పడ్డాడనేది ఈ చిత్ర కథాంశం.
మనం గతంలో చూసిన కొన్ని సినిమాలను కలిపితే ఈ చిత్రం అవుతుంది. కథలో చెప్పుకోదగ్గ కొత్తదనం
లేకపోయినా పక్కా ఫార్ములాతో తీయడమే దీని విజయ రహస్యం. ఇందులోని ప్రధాన పాత్రలన్నింటికీ ప్రముఖ
నటీనటులను ఎంపిక చేయడంతో పాటు, సాంకేతికంగానూ ప్రతిభావంతులను పెట్టుకోవడం కలిసొచ్చింది.
‘మున్నా’లో కనిపించిన లోపాలను వంశీ సరిచేసుకుని మంచి కమర్షియల్ దర్శకుడిని కాగలనని
నిరూపించుకున్నాడు. సినిమా మొదటి భాగం - భూమి ఇంటిలో వారి అభిమానాన్ని కృష్ణ
సంపాయించుకోవడంతో పూర్తవుతుంది. రెండవ భాగం - భూమి తండ్రి, బాబాయ్ లు ఒక్కటి కావడం, ఆ
ఇంట్లో ఇద్దరు హీరోయిన్లతో హీరో మానసిక సంఘర్షణ ప్రధానంగా నడుస్తుంది. దాంట్లో హీరో డూప్లికేట్ తండ్రిగా
బ్రహ్మానందం, భూమి బంధువు చిట్టిగా వేణుమాధవ్ లతో బోలెడంత హాస్యాన్ని కూడా జోడించారు. కోటతో
సెంటిమెంట్ సీన్స్, ఇద్దరు హీరోయిన్ ల కాంబినేషన్ సీన్స్ బాగున్నాయి. ఆహుతి ప్రసాద్, రఘుబాబుల్లో
మార్పు రావడం, శ్రీహరి ఆవేశం, హీరోని అల్లుడిగా ప్రకాష్ రాజ్ అంగీకరించడం, నా బాయ్ ఫ్రెండ్
‘‘రెండిళ్ళు, రెండూళ్ళు కాపాడాడని’’ కాజల్ చెప్నడం బాగుంది. అయితే, ఇంట్లో వాళ్ళ
అభిమానాన్ని హీరో సంపాయించడాన్ని, తమ్ముడు శ్రీహరితో ప్రకాష్ రాజ్ కలసిపోవడాన్ని... మరింత
బలమైన సన్నివేశాలతో కన్విన్సింగ్ గా చెబితే బాగుండేది. ఒకరి గురించి ఒకరికి తెలియకుండానే హీరోయిన్లు
ప్రాణ స్నేహితులు కావడం వింతగా వుంది. కాజల్ అబద్ధపు ప్రేమను ఫ్లాష్ బ్యాక్ గా చూపడం బాగుంది. బస్సు
- సుమోల ఫైట్, షాపింగ్ మాల్ పార్కింగ్ లో సైలెంట్ ఫైట్ బాగున్నాయి. ‘నారీ నారీ నడుమ మురారి’
క్లైమాక్స్ లానే ఈ చిత్రం క్లైమాక్స్ కూడా ఉంటుంది. క్లైమాక్స్ కి ముందు హీరోని ప్రకాష్ రాజ్, శ్రీహరి కొట్టడం
అన్ని దెబ్బలు తిన్నా హీరో హీరోయిన్ ని కాపాడటం మరీ రొటీన్ గా ఉంది. సినిమా ప్రారంభంలో బృందావనమది
అందరిదీ’ మధురమైన పాత పాటను రంగుల్లో చూపించడం, సినిమా చివరిలో కృష్ణుడిగా ఎన్టీఆర్ కనిపించడం
ఈ చిత్రంలో అదనపు ఆకర్ణణలు.
కృష్ణగా ఎన్టీఆర్ తనకి సరిగ్గా సరిపోయే పాత్రలో, తన సహజశైలిలో జనరంజకంగా నటించాడు. అయితే పాటల్లో
అతని నుండి అభిమానులు ఆశించే స్థాయిలో స్టెప్స్ లేకపోవడం ఒక లోపం, భూమిగా కాజల్, ఇందుగా
సమంత పాత్రలకి న్యాయం చేశారు. లో ప్రొఫైల్ తో తన పాత్రని కొత్త తరహాలో పోషించడానికి ప్రకాష్ రాజ్ చేసిన
ప్రయత్నం బాగుంది. శ్రీహరి తన రెగ్యులర్ తెలంగాణ యాసతో మరోసారి ఆకట్టుకున్నారు. తాతగా కోట పాత్ర
సినిమాకి నిండుదనాన్ని ఇచ్చింది. బ్రహ్మానందం, వేణుమాధవ్ ల కామెడీ ప్రత్యేక ఆకర్షణ అయ్యింది.
ఆహుతి ప్రసాద్, రఘుబాబు, బ్రహ్మాజీ, ప్రగతి, మోహన్ రుషి, సితార, అజయ్, హేమ,
సురేఖావాణి, తనికెళ్ళ భరణి, సన ఇతర పాత్రలు పోషించారు. తమన్ పాటల్లో స్పష్టత కొరవడి, కేవలం
రొదలా వినిపించాయి. ఇద్దరు హీరోయిన్లతో హీరో పాట ఎంత మాత్రం ఆకట్టుకోలేకపోయింది. రీరికార్డింగ్ చాలా
బాగుంది. ఛోటా కె నాయుడు ఫోటోగ్రఫీ కూడా బాగుంది. శ్రీహరిని తప్ప అతను సినిమా అంతటినీ అందంగా
చూపించాడు. కొరటాల శివ సంభాషణలు చాలా సందర్భాల్లో బాగున్నాయి, కొన్ని సందర్భాల్లో మరీ
బలహీనంగా ఉన్నాయి. ఆనంద్ సాయి ఆర్ట్, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ బాగున్నాయి.