Bookmark and Share   Cinevinodam Subscribe
 
‘డార్లింగ్’
సినీవినోదం రేటింగ్‌ : 2.75/5

శ్రీ వెంకటేశ్వరా సినీ చిత్ర పతాకంపై కరుణాకరన్ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వంలో బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

చిన్ననాటి స్నేహితురాలు నందిని పట్ల ప్రేమతో న్యూజిలాండ్ నుండి ఆమె రాకకోసం ఎదురుచూస్తుంటాడు ప్రభాస్. అందుకనే శ్రద్ధ ప్రేమను తిరస్కరిస్తాడు. దాంతో శ్రద్ధ ఆత్మహత్యా ప్రయత్నం చేయడంతో, ఆమె తండ్రి ప్రభాస్ పై దాడి చేస్తాడు. తను ప్రేమించిన నందినితో న్యూజిలాండ్ ప్రేమకథను కల్పించిచెప్పి, అతని బారినుండి బయటపడతాడు. ప్రభాస్ తండ్రి ప్రభు, అతని మిత్రులు కుటుంబాలతో సహా అరకులో కలుస్తారు. వారితో వచ్చిన నందిని ప్రేమను పొందడానికి ప్రభాస్ ప్రయత్నిస్తుంటాడు. అదే సమయంలో రుషి అనే మరో యువకుడు కూడా ప్రభాస్ తో పోటీ పడుతుంటాడు. అతనికి ప్రభాస్ తండ్రి ప్రభు సహకరిస్తుంటాడు. ఈ పరిస్థితుల్లో ప్రభాస్ నందిని ప్రేమను ఎలా సాధించాడనేదే ఈ చిత్ర కథాంశం.సున్నితమైన చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న కరుణాకరన్, మాస్ హీరో ప్రభాస్ ల కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం- పెద్ద అంచనాలు పెట్టుకోకుండా చూసే ప్రేక్షకులకు బాగానే వుంటుంది. సరళమైన కరుణాకరన్ విధానంలో నడిచే ఈ చిత్రంలో ప్రభాస్ నటనతో పాటు స్విట్జర్లాండ్ అందాలు, అండ్రూ ఫొటోగ్రఫీ ప్రత్యేకంగా నిలుస్తాయి. పీటర్ హెయిన్స్ ఫైట్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.

సినిమా ప్రారంభంలో హీరో మొదలుపెట్టే- స్విట్జర్లాండ్ ప్రేమకథ ఇంటర్వెల్ వరకూ సాగుతుంది. తీరా చూస్తే, అదంతా ‘‘ఉత్తుత్తిదే’’నని తేల్చేయడం ప్రేక్షకులను ఇబ్బంది పెడుతుంది. ఇటువంటి ప్రయోగాలు చెయ్యోచ్చుగాని మరీ సగం సినిమాని దీనికోసం వాడుకోవడం కరెక్ట్ కాదు. ఈ ప్రయోగం సినిమాకి పెద్ద మైనస్ గా మారింది. అరకులో రెండవభాగం సినిమా కుటుంబ వాతావరణంలో ఫ్రెష్ గా కాకపోయినా ప్లెజెంట్ గా నడిచింది. ప్రభు, ప్రభాస్ ల మధ్య అనుబంధం, స్నేహితుల పట్ల ప్రభు అభిమానం బాగా చూపించారు. హీరో స్నేహితుల మేనరిజమ్స్ బాగున్నాయి. హీరోయిన్ తమ్ముడితో మంచి వినోదాన్ని పంచారు. హీరో కజిన్ సిస్టర్ కి పెళ్ళి చేసే సన్నివేశాలు మనసులను తాకేలా దర్శకుడు చిత్రీకరించారు. క్లైమాక్స్ సన్నివేశాలు పట్టుగా నడిచాయి.

హీరోగా ప్రభాస్ మరింత పరిణితి గల నటన చూపించాడు. కామెడీ, యాక్షన్, డాన్స్, సెంటిమెంట్ సన్నివేశాలు అన్నింట్లో చక్కగా రాణించాడు. నందినిగా కాజల్ గ్లామర్ తో మంచి నటన ప్రదర్శించింది. శ్రద్దాదాస్ రెండుసార్లు కనిపించింది. తులసితో చేయాలనుకున్న మేనరిజం ఫలించలేదు. హీరో తండ్రిగా ప్రభు పాత్ర, నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. చంద్రమోహన్, శ్రీనివాసరెడ్డి, ధర్మవరపు, శివన్నారాయణ, రాజా శ్రీధర్, వంశీ, ఆహుతి ప్రసాద్, ఎమ్మెస్ నారాయణ, కోట, మోహన్ రుషి ఇతర పాత్రలు పోషించారు.

స్వామి సంభాషణలు, కోటగిరి ఎడిటింగ్ బాగున్నాయి. జి.వి.ప్రకాష్ కుమార్ పాటల్లో క్యాచీగా ఏవీ లేవు కానీ, అన్నీ సందర్భోచితంగా వున్నాయి. రీరికార్డింగ్ బాగుంది. ‘ఇంకా ఏదో’ పాటలో ట్యాంక్ బండ్, చార్మినార్ ను మంచుతో ముంచెత్తిన గ్రాఫిక్స్ గొప్పగా వున్నాయి.

- రాజేష్‌
 

Copy right reserved for www.cinevinodam.com 2005