సమీక్ష
 
 
 
 
 
ప్రతినాయకులకు కాదు.... ప్రేక్షకులకు 'దడ'
సినిమా కథకు, దాని పేరుకు అస్సలు సంబంధమే ఉండటం లేదని కొందరు కొన్ని సినిమాలు చూసినప్పుడు వాపోతుంటారు. కానీ, అటువంటి విమర్శ 'దడ' సినిమా విషయంలో వినిపించనే వినిపించదు. పైగా ఈ కథ, కథనాలకు ఇదే సరైన పేరు అని సర్టిఫికెట్‌ కూడా ఇస్తారు. అయితే బాధాకరమైన విషయం ఏమంటే కథానుగుణంగా ప్రతినాయకులకు 'దడ' పుట్టించాల్సిన హీరో, గంపెడు ఆశతో థియేటర్‌కు వచ్చిన ప్రేక్షకులకు 'దడ' పుట్టించాడు.

నాగార్జున కుమారుడు నాగ చైతన్యకు మొదటి నుండి మాస్‌ హీరోగా పేరు తెచ్చుకోవాలనే కోరిక బలీయంగా ఉందనిపిస్తోంది. మొదటి సినిమా 'జోష్‌'లో అటువంటి ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. ఆ తర్వాత వచ్చిన 'ఏం మాయ చేశావె', '100 పర్సంట్‌ లవ్‌' సినిమాలతో లవర్‌బోరుగా కాస్త పేరుతో పాటు విజయాన్ని సంపాదించుకున్నాడు. ఆ విజయాన్ని ఇప్పుడీ 'దడ' సమూలంగా తుడిచిపెట్టేసింది. నూనూగు మీసాల కుర్రాళ్ళను మాస్‌ హీరోలుగా భరించే శక్తి మాకు లేదని తెలుగు ప్రేక్షకులు నిర్మొహమాటంగా చెప్పేశారు.

కథ విషయానికి వస్తే... అమెరికాలో జరిగే తెలుగు కుర్రాడి కథ. తల్లిదండ్రుల్ని కోల్పోయిన అన్నదమ్ములు (శ్రీరామ్‌, నాగ చైతన్య) కాస్త వయసు రాగానే అమెరికాకు వెళ్ళి అక్కడే స్థిరపడిపోతారు. అన్నయ్య ఓ మాఫియా డాన్‌కు కుడి భుజం (ఈ విషయం ద్వితీయార్థం వరకూ సస్పెన్స్‌గా ఉంచుతాడు డైరెక్టర్‌, ట్విస్ట్‌ కావాలి కదా!). తమ్ముడు ఫ్రెష్‌గా డిగ్రీ పూర్తి చేస్తాడు. సగటు తెలుగు సినిమా హీరో మాదిరిగానే ఆపదలో ఉండే వారిని ఆదుకోవడం అతని అలవాటు. ఆ కారణంగా ఓసారి తెలిసి ఓ అమ్మాయిని, తెలియక మరో తొంభై తొమ్మిది మంది అమ్మాయిలనూ రక్షిస్తాడు. దీంతో తన అన్న పనిచేసే డాన్‌ (రాహుల్‌ దేవ్‌)కు, అతనితో అమ్మాయిల వ్యాపారం విషయమై ఒప్పందం పెట్టుకున్న కెల్లీకి కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుంది. అంతేకాదు వాళ్ళ మనుషులూ హతమవుతారు. ఇక ఈ ఇద్దరూ డాన్లు హీరో కోసం వెతుకుతూ ఉంటారు. ఇదిలా జరుగుతుండగా, హీరో కథానాయిక కాజల్‌తో తొలిచూపు ప్రేమలో పడతాడు. కాజల్‌కు తల్లి లేదు. తండ్రి కోటీశ్వరుడు. అతను మరో పెద్ద కోటీశ్వరుడితో తన కూతురు వివాహం జరిపించాలనుకుంటాడు. కాజల్‌కు ఇది ఇష్టం ఉండదు. ఈలోగా ఆమె జీవితంలోకి నాగ చైతన్య ప్రవేశిస్తాడు. ఇద్దరూ పరస్పరం ప్రేమించుకుంటారు. నాగ చైతన్య కాజల్‌ను తనదానిని ఎలా చేసుకున్నాడు? తన కోసం వెదుకుతున్న కరడుగట్టిన అండర్‌వరల్డ్‌ డాన్ల నుండి ఎలా తప్పించుకున్నాడు? ఇది మిగతా కథ.

నాగ చైతన్య పాత్ర మొదలైన దగ్గర నుండి సినిమా పూర్తయ్యే వరకూ మనకు ఎన్నో రకాల సందేహాలు వస్తుంటాయి. ఇది ఇలా ఎందుకు జరుగుతోంది, ఇది ఇలా జరగడం ఎంత మాత్రం సమంజసం కాదే అనిపిస్తుంది. అసహనం, అసంతృప్తి పెల్లుబుకుతాయి. ఏమీ చేయలేని నిస్సహాయత ఆవరిస్తుంది. ఇలాంటి భావన దర్శక నిర్మాతలకు ఎందుకు కలగలేదనే బాధా వేస్తుంది. ఎందుకంటే ఈ సినిమాను తీసింది ఆషామాషీ నిర్మాత కాదు. సినిమా నిర్మాణంలో పాతికేళ్ళ అనుభవం ఉన్న వ్యక్తి. పైగా నాగార్జున కుటుంబం అంటే ఎంతో అభిమానం ఉన్న శివప్రసాద్‌ రెడ్డి తీసిన సినిమా ఇది. కథ, కథతో పాటు దర్శకుడి ఎంపిక... రెండూ ఆయన చేసిన పెద్ద పొరపాట్లు. కనీసం ఈ పొరపాటుని గుర్తించి, సవరించుకోలేదేమిటీ అనిపిస్తుంది.

నటీనటుల విషయానికి వస్తే, నాగ చైతన్యకు మాస్‌పాత్రలు పోషించే వయసు ఇంకా రాలేదని అందరూ అంగీకరిస్తారు. కాజల్‌ వేషధారణ ఎబ్బెట్టుగా ఉండి, ఏమాత్రం ఆకట్టుకోలేదు. పైగా డబ్బింగ్‌ సైతం వేరే వాళ్ళతో చెప్పించడంతో ఏమిటోగా అనిపించింది. హీరో అన్న వదినలుగా నటించిన శ్రీరామ్‌, సమీక్ష జంట చూడటానికి బాగానే ఉన్నా, సెంటిమెంట్‌ సీన్స్‌ పండలేదు. బ్రహ్మానందం, ఆలీ కామెడీ, బార్‌లో ఇతర కమెడియన్స్‌తో చేయించిన కామెడీ ట్రాక్‌ ఏమాత్రం నవ్వు పుట్టించలేదు. ఎదుటి వ్యక్తిని చంపడానికి ముందు రాహుల్‌దేవ్‌ చెప్పే కథలు సైతం చికాకు తెప్పిస్తాయి.

తనకు కూతుర్నే కాదు గొప్ప జీవితాన్ని ఇచ్చిన సొంతమావ (భరణి)ని విలన్‌ ఒత్తిడి మేరకు శ్రీరామ్‌ కాల్చిచంపడమే అసమంజసంగా ఉంది. అక్కడే శ్రీరామ్‌ పాత్ర మీద సానుభూతి పోతుంది. ఇక కాజల్‌ తల్లిది యాక్సిడెంట్‌ కాదు, హత్య అని హీరోతో చెప్పించినా, అది ఎవరు చేశారు, ఎందుకు చేశారనే దానికి దర్శకుడు చివరిలో సైతం వివరణ ఇవ్వలేదు. భర్తే ఆమెను చంపేశాడని అనుకుంటే అతనికి తగిన శిక్ష పడనే లేదు! ఇలాంటి లసుగులు ఎన్నో ఈ సినిమాలో! తమ్ముడే విలన్‌ టార్గెట్‌ అయినప్పుడు అన్న పడే మానసిక క్షోభ తెలుగు సినిమాల్లో కొత్త కాదు. తమ బిజినెస్‌కు ఆటంకం కలిగించే హీరో కోసం విలన్స్‌ వెదుకులాట పాత చింతకాయ ఫార్ములానే. ఇలాంటి రొటీన్‌ సన్నివేశాలు, సంభాషణలూ సినిమా అంతటా ఉన్నాయి. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం కానీ, అబ్బూరి రవి సంభాషణలను కానీ సినిమాకు ఉపయోగపడలేదు. సినిమాలోని ప్రతి ఫ్రేమ్‌ ఎంతో రిచ్‌ ఉండి, ఆహా ఓహౌ అనిపిస్తుంది తప్పితే, కథలో లీనమవడానికి ఉపయోగపడదు. మొత్తం మీద ఇదే బ్యానర్‌లో నాగార్జున హీరోగా వచ్చిన 'కేడి'తో, ఆయన కొడుకు చేసిన 'దడ' పోటీ పడిందని చెప్పొచ్చు.

కొసమెరుపు
'దడ' కంటే ముందు అజరు భూయాన్‌ 'హౌస్‌ఫుల్‌' అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. చాలా నెలల క్రితమే పూర్తయిపోయి, ఫస్ట్‌కాపీ కూడా వచ్చిన ఆ సినిమా విడుదలకు నోచుకోలేదే అనే చిన్న బాధ సినిమా వర్గాలలో ఉండేది. ఇప్పుడది పోయింది!

- ఓం ప్రకాష్ వడ్డి