కె.అచ్చిరెడ్డి సమర్పణలో ఆర్.ఆర్.మూవీమేకర్స్ పతాకంపై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో
వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
శీను చిన్నప్పటి నుండీ అమితాబ్ బచ్చన్ వీరాభిమాని. అతని ‘డాన్’ చిత్రం ప్రేరణతో ‘డాన్
శీను’ అని పిలిపించుకుంటాడు. కారణాంతరాల వల్ల ఇల్లు వదిలిపోయిన శీను పెద్దయ్యాక
నగరానికి చేరుకుంటాడు. నర్సింగ్, మాచిరాజు ప్రత్యర్థి ముఠాలు నగరాన్ని ఏలుతుంటాయి.
నర్సింగ్ చెల్లెలిని ప్రేమించమని శీనును విదేశాలకు పంపుతాడు మాచిరాజు. అయితే, శీను
మాచిరాజు చెల్లెలినే ప్రేమిస్తాడు. స్వదేశం వచ్చాక నర్సింగ్, మాచిరాజు లిద్దరిలోనూ వారి
చెల్లెళ్ళ విషయంలో ఆడుకుంటుంటాడు శీను. తన కొడుక్కి నర్సింగ్, మాచిరాజుల చెల్లెళ్ళలో
ఒకరితో పెళ్ళి చేయాలనుకున్న దుబాయ్ డాన్ దుగ్గల్ - ఆ వ్యవహారాన్ని స్వయంగా
తేల్చుకోవాలని ఇక్కడికి వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందీ సినిమాలో చూడాలి.
‘కిక్’ వంటి సూపర్ హిట్ అందించిన ఆర్.ఆర్.మూవీ మేకర్స్ పతాకంపై తిరిగి రవితేజతో
నిర్మించిన ఈ చిత్రం ఆ స్థాయిలో కాకున్నా, మంచి వినోదాన్ని అందిస్తుంది. చక్కటి
సాంకుతిక సహకారంతో నూతన దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ చిత్రాన్ని పూర్తి వినోదాత్మకంగా
రూపొందించారు. కామెడీలో కొత్త ఎత్తులకు ఎదిగిన రవితేజతో మరోసారి కామెడీ చేయడమంటేనే
కత్తిమీద సాము. దాన్ని గోపీచంద్ సజావుగానే చేశాడు. రవితేజ నటన, సమీర్ రెడ్డి
ఫోటోగ్రఫీ, కోన వెంకట్ సంభాషణలు ఈ చిత్రంలో హైలైట్స్. హీరో ఫ్రెండ్ గా అలీ ఎంపిక
బాగుంది. అతని కాంబినేషన్ లో చేసిన సన్నివేశాలు బాగున్నాయి. కాకుంటే, అలీ
సంభాషణల్లో ద్వంద్వార్థాల మోతాదు కాస్త ఎక్కువైంది. కళ్ళు కనపడవనే పిత్రేగా వేణుమాధవ్
సీన్స్ కూడా పండాయి. బీహారీ బిల్డర్ తో, విదేశాల్లో దొంగలతో చేసిన యాక్షన్ సన్నివేశాలు
బాగున్నాయి. విశ్వాస్ గా బ్రహ్మానందంతో చేసిన సన్నివేశాలు కూడా వినోదాన్ని పంచాయి.
అయితే, దుబాయ్ డాన్ ఇక్కడ అమ్మాయితోనే కొడుకు పెళ్ళి చేయాలని ఎందుకు ఆదుర్థా
పడుతుంటాడో అర్థంకాదు. ప్రత్యర్థులు నర్సింగ్, మాచిరాజు లిద్దరితోనూ హీరో స్నేహం
చేయడంలో కొంత గదరగోళం నెలకొంది. అందుకనే సినిమా రెండవ భాగం కాస్త బలహీన
బడింది. అయితే క్లైమాక్స్ లో ఫ్లాష్ బ్యాక్ చెప్పడం ద్వారా కొంత కన్సిన్స్ చేయగలిగారు.
బ్రహ్మాజీ కారణంగా హీరో ఒకరి బదులు మరొకరిని ప్రేమించే ట్విస్ట్ బాగుంది. క్లైమాక్స్ ఫైట్ మరీ
ఆర్టిఫీషియల్ గా ఉంది. సురేఖావాణి పాత్ర ‘రెడీ’ ని, క్లైమాక్స్ ‘అదుర్స్’ని గుర్తుకు
తెచ్చింది.
‘డాన్ శీను’గా రవితేజ మరోసారి తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించాడు. శారీరకంగా
అమితాబ్ పోలికలున్న రవితేజతో అమితాబ్ ఫ్యాన్ గా చేయించడం బాగుంది. శ్రియ మరోసారి
గ్లామర్ తో సినిమాని నింపేసింది. మరో హీరోయిన్ గా అంజనా సుఖానీ నటించింది. నర్సింగ్
గా శ్రీహరి మరోసారి హీరోయిన్ అన్నగా, డాన్ గా బాగా నటించారు. మాచిరాజుగా సయ్యాజీ
షిండే, దుగ్గల్ గా మహేష్ మంజ్రేకర్, ఇతర పాత్రల్లో బ్రహ్మాజీ, సూర్య, సత్యంరాజేష్,
రఘుబాబు, బెనర్జీ, కస్తూరి, సుధ నటించారు.
మణిశర్మ పాటల్లో చెప్పుకోదగ్గవి లేవుకానీ సినిమాలో చూస్తున్నంతసేపూ బాగానే ఉన్నాయి.
రీరికార్డింగ్ చాలా బాగుంది. గౌతంరాజు ఎడిటింగ్ బాగుంది. విదేశీ లొకేషన్లు, పాటల
చిత్రీకరణ బాగున్నాయి. సినిమా ప్రారంభంలో జగపతిబాబు వ్యాఖ్యాన్యం ఇందులో ఓ అదనపు
విశేషం.