సమీక్ష
 
 
 
 
 
'దూకుడు'
సినీవినోదం రేటింగ్‌ : 3.25/5
14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ పతాకం ఫై శ్రీను వైట్ల దర్శకత్వం లో అనిల్ సుంకర ,ఆచంట రామ్, ఆచంట గోపీ చంద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

శంకర నారాయణ అనే మంచి రాజకీయ నాయకుని కొడుకు అజయ్ . నాయక్ అనే మాఫియా నాయకుని ముఠా చేతిలో అతను చనిపోతాడు. దూకుడు ఎక్కువైన పోలీసు అధికారిగా మారిన అజయ్ నాయక్ ముఠాని పట్టుకునే పనిలో ఓసారి టర్కీ వెళ్లి నప్పుడు, అక్కడ ప్రశాంతి అనే అమ్మాయి ప్రేమలో పడతాడు. ఆ తర్వాత... తన తండ్రి శంకర నారాయణ ప్రత్యర్ధుల దాడి లో చనిపోలేదని తెలుసుకుని ఆసుపత్రి లో ఉన్న అతన్ని ఇంటికి తీసుకొస్తాడు. అయితే ప్రత్యర్దుల బారిన పడకుండా, అతన్ని బయట ప్రపంచానికి తెలియకుండా ఉంచుతాడు. అలాగే ఆరోగ్య సమస్యల కారణంగా- బయటి ప్రపంచం విషయాలు తండ్రికి తెలియకుండా, అతనికోసం తను ఆ ప్రాంత యం. యల్ .ఏ గా నటిస్తుంటాడు. తన తండ్రి ఫై హత్యా యత్నం చేసిన ముఠాను తెలివిగా అంతమొందించే పనిలో అజయ్ ఎలా విజయ వంతం అయ్యాడనేదే ఈ చిత్ర కధాంశం.

'ఖలేజ' ఫ్లాప్ తర్వాత మహేష్ బాబు, 'నమో వెంకటేశ' నిరాశ తర్వాత శ్రీను వైట్ల కలిసి చేసిన ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూసారు. వారిని శ్రీను వైట్ల నిరాశ పరచలేదు. అయితే ప్రేక్షకులు ఆశించే కొత్తదనం కూడా ఈ చిత్రం లో ఎక్కడా కనిపించదు. చాలా సన్నివేశాలు ఈ మధ్య వచ్చిన సినిమాల్లో, కొన్ని శ్రీను వైట్ల చేసిన సినిమాల్లో చూసినవే. పోలీసుగా, తండ్రిని కాపాడుకునే కొడుకుగా హీరో పాత్రీకరణ రొటీన్ గానే నడిచింది. కేవలం కామెడీ డ్రామా ఫై శ్రీను వైట్ల కున్న పట్టుతో , గోపీ మోహన్ ల సహకారం తో సినిమాను వినోదాత్మకం గా మలచడంలో విజయవంతం అయ్యారు. అందుకు కోన వెంకట్ సరదా సంభాషణలు చాలా తోడ్పడ్డాయి. మహేష్ బాబు హీరోయిజం, బ్రహ్మానందం, యం. యస్. నారాయణల కామెడీ ఈ చిత్రంలో ప్రత్యకతలు . "ఈ దూకుడున్డక పోతే పోలీసోడికి పోస్ట్ మేన్ కి తేడా ఉండదంటూ ".... పవర్ ఫుల్ గా 'పోలీస్' అని చెబుతూ ...అక్కడక్కడా తెలంగాణా యాస పలుకుతూ మహేష్ బాబు తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు .మహేష్ -శాస్త్రి-హీరోయిన్ ల సన్నివేశాలు , మహేష్-బ్రహ్మి , మహేష్-ఎమ్మెస్ ల సన్నివేశాలు మంచి వినోదాన్ని అందించాయి. సుప్రీత్ ,కోట ల చావు సన్నివేశాలు కొత్తగా ఉన్నాయి. బ్రతికున్న ప్రకాష్ రాజ్ ని ఎవరికి కనిపించకుండా దాయడం ....అతనికి బయటి విషయాలు తెలియ కుండా నటించడం వంటివి కొన్ని మరీ కృతికంగా ఉన్నాయి. బహుమతి మొత్తం కోసం కక్కుర్తి పడి, రియాలిటీ షో లో చేస్తున్నాననుకుని తన్నులు తినే పద్మశ్రీ గా బ్రహ్మానందం .....ఆకారం వికారం గా ఉన్నా, హీరో కావాలనుకునే బొక్కా గా యం. యస్. నారాయణ లు విశేషం గా నవ్వులు పండించారు. పాత్ర చిన్నదే అయినా.... మేకప్ మోతాదు మించినట్లనిపించినా పాటలకి సమంతా అందాలు చిందించింది. అజయ్ తండ్రి శంకర నారాయణగా ప్రకాష్ రాజ్ సహజం గానే బాగా చేసాడు. తన పాత్రని సరిగా మలచక పోయినా నాయక్ గా సోను సూద్ బాగా చేసాడు. శాస్త్రి గా వెన్నెల కిషోర్ కామెడి లో రాణించాడు. శివారెడ్డిలోని మిమిక్రీ ని బాగా వాడుకున్నారు. సుమన్, నాజర్, చంద్ర మోహన్, భరణి, సయ్యాజి షిండే , అజయ్, సుప్రీత్, సుబ్బరాజు, నాగ బాబు, ధర్మవరపు, షఫీ, రాజీవ్ కనకాల, సుధా, రవిప్రకాష్, ప్రగతి, ఆదిత్య మీనన్ ఈ చిత్రం లో ఇతర పాత్రలు పోషించారు. 'ఖలేజ' లో మహేష్ పక్కన చేయాల్సిన పార్వతి మెల్టన్ పరిస్థితి తిరగబడి, ఈ మహేష్ చిత్రం లో ఓ ప్రత్యేక గీతం లో శృంగారాన్ని ఒలికించింది.

తమన్ పాటల్లో ఒకటి, రెండు బాగున్నాయి. పాటల చిత్రీకరణ కలర్ ఫుల్ గా ఉంది. గుహన్ ఫోటో గ్రఫీ, విజయ్ ద్రిల్స్ బాగున్నాయి. వర్మ ఎడిటింగ్ ఫర్వాలేదు.

- రాజేష్