Bookmark and Share   Cinevinodam Subscribe
 
''గాయం - 2''
సినీవినోదం రేటింగ్‌ : 2.5/5

కర్తక్రియేషన్స్ పతాకంపై ప్రవీణ్ శ్రీ దర్శకత్వంలో దుబాయిలో స్థిరపడ్డ తెలుగు పారిశ్రామిక వేత్త ధర్మ కర్త ఈ చిత్రాన్ని నిర్మించారు.

బ్యాంకాక్ లో రామ్ భార్యాబిడ్డలతో హాయిగా జీవిస్తుంటాడు. ఓ సారి తన రెస్టారెంట్ లో గొడవ చేసిన గూండాలని చంపేస్తాడు. ఆ దృశ్యాలను ఇక్కడ టివిలో చూసిన గురునారాయణ్, అతని కొడుకు శంకర నారాయణ్ - రామ్ ను తమ శతృవు దుర్గాగా భావిస్తారు. బ్యాకాంక్ వెళ్ళిన శంకరనారాయణ్, అతని లాయర్ రామ్ ను వెంటాడి, వేధించి అతను దుర్గాయేనని నిర్థారించుకుంటారు. ఆ సందర్భంగా - రామ్ గతంలో ముఠాకక్షలతో హత్యాకాండలో పాల్గొన్న దుర్గా అనే విషయం అతని భార్యకి తెలుస్తుంది! శతృశేషం లేకుండా చేసేందుకు గురునారాయణ వారిపై దాడి చేయించడంతో దుర్గా కొడుకు గాయపడతాడు. దాంతో రెచ్చిపోయిన దుర్గా ఇక్కడికి వచ్చి, గురునారాయణ్ గ్యాంగ్ ని మట్టుపెట్టడం ఈ చిత్ర కథాంశం.

జగపతిబాబుతో రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘గాయం’ అప్పట్లో గ్యాంగ్ వార్ చిత్రాల్లో కొత్త అనుభూతిని అందిస్తూ విజయవంతమైంది. దానికి సీక్వెల్ చేయాలన్న ఆలోచన వరకూ సరే, కాకుంటే - ఇప్పటి ప్రేక్షకులకు కొత్తగా చూపించే అంశాల పట్ల శ్రద్ధ వహించాలి కదా? జగపతిబాబు, నూతన దర్శకుడు ప్రవీణ్ శ్రీ ఈ విషయాలను పట్టించుకోకుండా, కేవలం గత ‘గాయం’ ఇమేజ్ పైనే కథ నడిపించాలనుకున్నారు. ‘గాయం’ నుండి ఇప్పటి కాలానికి కథ కొనసాగించిన సందర్భం తప్ప - కథ, కథనం, సన్నివేశ రూపకల్పన మరీ రొటీన్ గా బలహీనంగా ఉన్నాయి. మొదటిభాగం ఫర్వాలేదనిపించినా రెండవ భాగం డీలాపడింది. పాత మిత్రురాలు అనిత కొడుకును పెంచుకున్న దుర్గ రామ్ గా మారి, విద్యను ఎలా వివాహమాడాడో స్పష్టత లేదు. బ్యాంకాక్ లో జరిగిన ఓ చిన్న సంఘటన ఇక్కడ తెలుగు టివిలో ప్రసారం కావడం, బ్యాంకాక్ లో కొట ప్రసాద్, తనికెళ్ళ భరణిల కారును హీరో పరుగెడుతూ అందుకోవాలనుకోవడం విడ్డూరంగా ఉంటుంది. గాలి వార్త విని ఎంతో కాలంగా తమతో ఉన్న లాయర్ ని కోటప్రసాద్ మాటకూడా అడగకుండా చంపేయడం, ప్రముఖ రాజకీయ నాయకుడిగా ఎదిగిన హీరో ప్రత్యర్థి కోట ముఠాను, బ్యాంకాక్ నుండి వచ్చిన హీరో పబ్లిక్ లో ఓపెన్ గా తిరుగుతూనే చంపేస్తూ పోవడం, హీరో సమాచారం కోసం అధికారి కుటుంబాన్ని బంధీలను చేయడం వంటివి ఏ మాత్రం కన్విన్సింగ్ గా లేవు. విలన్ అకృత్యాలను అతనితోనే చెప్పిస్తూ, అతనికి తెలియకుండా ఛానెల్స్ లో ప్రసారం చేయడం కూడా పాతబడిపోయింది.

రామ్, దుర్గల మద్య వైవిధ్యాన్ని జగపతిబాబు చాలా బాగా చూపించాడు. అతని భార్యగా ప్రియా రామన్, లాయర్ గా తనికెళ్ల భరణి, పోలీసు అధికారిగా రవి కావే, అలీఖాన్ గా నగేష్, పాండ్యన్ గా జీవా, శంకర్ నారాయణ్ గా కోట ప్రసాద్ బాగా చేశారు. ఇందులో కోట తండ్రిగా, కోట తండ్రిగా, కోట ప్రసాద్ అతని కొడుకుగా నటించడం విశేషం. గురు నారాయణ్ పాత్రలో కోట నటన ఈ చిత్రంలో హైలైట్ గా చెప్పుకోవాలి. కరుడుగట్టిన ముఠా నాయకుడిగా, స్వార్థపరుడైన రాజకీయవేత్తగా కోట నటన కొత్త పుంతలు తొక్కింది. హీరో బావ మరిదిగా హర్షవర్థన్ కామెడీ చిరాకెత్తించింది. ‘గాయం’లో చేసిన రేవతి, శివకృష్ణ అదే పాత్రల్లో ఈ చిత్రం ఫ్లాష్ బ్యాక్ లో కాసేపు కనిపిస్తారు.

‘ఎందుకమ్మా ప్రేమ’ డ్యూయట్ తో పాటు ఇళయరాజా నేపథ్య సంగీతం బాగుంది. ఇందులో ఓ పాటను కూడా ఇళయరాజా పాడారు. ‘రామరాజ్యం‘ పాటలో సాహిత్యం బాగుంది. రవిరెడ్డి, నాగరాజుల సంభాషణలు, అనిల్ బండారి ఫోటోగ్రఫీ ఫర్వలేదు.

- రాజేష్‌
 

Copy right reserved for www.cinevinodam.com 2005