Bookmark and Share   Cinevinodam Subscribe
 
‘గోలీమార్’
సినీవినోదం రేటింగ్‌ : 2.5/5

శ్రీ సాయిగణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై పూరిజగన్నాథ్ రచన, దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

చిన్నప్పటి నుండీ పోలీస్ కావాలన్న కోరికతో ఉండే గంగారామ్ కష్టపడి ఎస్.ఐ. అవుతాడు. అతని నిజాయితీని గమనించి మాఫియా గ్యాంగ్ లను మట్టుపెట్టే ఎన్ కౌంటర్ విభాగాన్ని అతనితో ప్రారంభిస్తాడు పోలీసు అధికారి నాజర్. ఖలీద్, తల్వార్ గ్యాంగ్ లకు గంగారామ్ సింహ స్వప్నంగా మారుతాడు. ప్రేమంటూ వెంటపడే ఈవెంట్ మేనేజర్ పవిత్రతో గంగారామ్ ప్రేమలో పడతాడు. అదే సమయంలో అతన్ని అక్రమనేరారోపణలపై అరెస్ట్ చేస్తారు. అప్పుడు గంగారామ్ కి అర్థమవుతుంది - పోలీసు అధికారి నాజర్, మలేషియాలో ఖలీద్ కలిసి చేసిన కుట్రలో తను భాగస్వామిని అయ్యానని. వారి ప్రత్యర్థి తల్వార్ ని తన ద్వారా నిర్మూలించే పనిని వారు విజయవంతంగా చేశారని. బూటకపు ఎన్ కౌంటర్ లో చంపాలనుకున్న పోలీసుల నుండి తప్పించుకున్న గంగారామ్ గ్యాంగ్ స్టర్ గంగూభాయ్ గా మారతాడు. ఆ తర్వాత ఏం జరిగిందీ వెండితెరపై చూడాలి.

ముంబైకి చెందిన ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ దయానాయక్ స్ఫూర్తితో ఈ చిత్రం చేశారు. అయితే ఇంతకు ముందే దయానాయక్ కథాంశంతో చాలా చిత్రాలు రావడం, తెలుగులోనే రెండు చిత్రాలు రావడంతో ప్రేక్షకులకు అంత ఆసక్తిని ఈ చిత్రం కలిగించలేకపోయింది. అయితే వాటికి కొంత భిన్నమైన సన్నివేశాలతోనే ఈ చిత్రం నడుస్తుంది. దయానాయక్ కథతో నానాపాటేకర్ నటించిన ‘అబ్ తక్ చప్పన్’ సహజమైన విధానంలో ఉంటే, ‘గోలీమార్’ సినిమాటిక్ విధానంలో రూపొందించారు. మొదటి నుండి చివరివరకూ యాక్షన్ ప్రధానంగా ఈ చిత్రం బోర్ లేకుండా నడపడానికి దర్శకుడు కృషి చేశాడు. అయితే ఈ యాక్షన్ సన్నివేశాలు మనం ఇంతకు ముందు చూసినవే కావడంతో తాజాదనం లోపించింది. దానికి తోడు ఎంటర్ టైన్ చేసే అంశాలు లేకపోవడం కూడా మరో మైనస్. అమ్మాయిల కంపెనీలో ఇన్ఫార్మర్లని పెట్టడం, క్రిమినల్ భార్యని కాపాడటం, తల్వార్ ని పట్టుకునే సన్నివేశం, లాల్ - ఖలీద్ మాట్లాడుతుంటే హీరో లాల్ ని కొట్టే సీన్, ఖలీద్ ని హీరో ఫోన్ లో బెదిరించే సన్నివేశం. మీడియా ముందు హీరో ఆవేదన సీన్ లు బాగున్నాయి. హీరోయిన్ తల్లి రోజాకు హీరోకు మధ్య వాగ్వాదం, హీరోయిన్ ఎప్పుడూ తన అసిస్టెంట్ కి ఫోన్ చేసి ‘‘గోపి... గోపీ’’ అంటూ మాట్లాడటం, పోలీసు స్టేషన్ లో అధికారిని రోజా నిలదీయడం వంటి సన్నివేశాలు బాగున్నాయి. అలాగే రీజనింగ్ కి అందని సన్నివేశాలు కూడా ఇందులో చాలా ఉన్నాయి. పూరి సంభాషణలు అక్కడక్కడా బాగున్నాయి.

గంగారామ్ గా గోపీచంద్ ఇందులో పవర్ ఫుల్ పోలీసు అధికారిగా చాలా బాగా చేశాడు. అతని నటనలో చాలా అభివృద్ధి కనిపించింది. పవిత్రగా అంతంత మాత్రం అందగత్తె ప్రియమణి చేసింది. ప్రియమణి స్వంతంగా డబ్బింగ్ చెప్పడం ఇందులో ఓ విశేషం. అయితే సినిమాకి ఆమె వల్ల ఒరిగిందేమీ లేదు. ‘ఉయ్ హేట్ మ్యారేజ్’ అనే పవిత్ర తల్లిగా రోజా, పోలీసు అధికారిగా నాజర్, ఖలీద్ గా కెల్లీ దోర్జీ, ఇతర పాత్రల్లో అలీ, ఎమ్మెస్ నారాయణ, సత్యంరాజేష్, జీవి, షవర్ అలీ నటించారు. చివరిలో ప్రకాష్ రాజ్ కూడా ఓసారి కనిపిస్తారు.

చక్రి పాటల్లో ‘లాఠీ పట్టుకు’ పోలీసుల పట్ల గౌరవాన్ని పెంచేలా ఉంది. ‘మగాళ్ళు ఉత్తమ మాయగాళ్ళే’ పాటలో వినోదాత్మకంగా మగాళ్ళపై సెటైర్లున్నాయి. ‘‘గుండెల్లో అలజడి’’ బ్యాంకాక్ డ్యూయట్, ‘‘నీ కళ్ళలోన’’ సెట్ డ్యూయట్ కలర్ ఫుల్ గా ఉన్నాయి. ఇందులో ముమైత్ ఖాన్ ఓ అర్థంకాని గోలపాట పాడటం విశేషం. రీరికార్డింగ్, శ్యామ్ కె నాయుడు ఫోటోగ్రఫీ, వెంకటేష్ ఎడిటింగ్ బాగున్నాయి.

- రాజేష్‌
 

Copy right reserved for www.cinevinodam.com 2005