‘గోపి.. గోపిక.. గోదావరి’
సినీవినోదం రేటింగ్: 2.25/5

      ఆనంది ఆర్ట్ క్రియేషన్స్‌ సమర్పణలో మహర్షి సినిమా పతాకంపై వంశీ దర్శకత్వంలో వల్లూరిపల్లి రమేష్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. గోదావరి తీర ప్రాంతంలోని పల్లెలకు వైద్యం అందించేందుకు డాక్టర్ గోపిక బోటుపై మొబైల్‌ ఆసుపత్రి నిర్వహిస్తుంటుంది. హైదరాబాద్‌లో గాయకుడు గోపి 'స్వాతి ఆర్కెస్ర్టా' నడుపుతుంటాడు. అనుకోని విధంగా వీరిద్దరూ ఫోన్‌ ద్వారా ఫ్రెండ్స్‌ అవుతారు. ఒకరిని ఒకరు చూసుకోకుండానే ప్రేమలోపడతారు. అయితే గోపికను కలవడానికి వస్తున్న గోపి ప్రమాదకరమైన పరిస్థితుల్లో పడతాడు. అతని కోసం ఎదురుచూస్తున్న గోపిక చివరికి గోపి మరణించాడనే నిర్ణయనికొస్తుంది. దెబ్బలు తగిలి స్పృహలేని స్థితిలో గోదావరిలో కొట్టుకొచ్చి, గోపిక చేతిలో కోలుకున్న ప్రభు గోపికను ఆమె తోటి డాక్టర్‌తో వివాహానికి ఒప్పిస్తాడు. ఆపై కథ సినిమాలో చూడాల్సిందే..

      కళాత్మక, వినోదాత్మక చిత్రాల దర్శకుడిగా వంశీకి ఉన్న ఇమేజ్‌ దృష్ట్యా ప్రేక్షకులు ఈ చిత్రం కోసం ఆసక్తిగానే ఎదురుచూశారు. అయితే క్రియేటివ్‌ దర్శకుల ప్రతిభ కొన్నాళ్ళు, కొన్ని చిత్రాలకే పరిమితం అన్నట్లుగా, వంశీ ఈ చిత్రంలో ప్రేక్షకులను మరోసారి నిరాశకు గురిచేశారు. అతని చిత్రాల్లో ఉండే విధంగా గోదావరి తీరంలో షూటింగ్‌ చేసినప్పటికీ, లోకి ఫొటోగ్రఫీ బాగున్నప్పటికీ గ్రేడింగ్‌ వంటి సాంకేతిక కారణాలవల్ల సినిమా అంతా వెలసిపోయిన వస్త్రంలా కనిపించింది. ఇక కథాంశానికొస్తే- సెల్‌ఫోన్‌ ఫ్రెండ్‌ షిప్‌, యాక్సిండెంట్‌లో మెమరీ లాస్‌ వంటి విషయలు మనం చాలా సినిమాల్లో చూశాం. కథనంలో పాతకాలపు, అర్థంలేని మెలోడ్రామా ట్విస్టులు మనం ఈతరం సినిమా చూడట్లేదని స్పష్టంగా చెబుతుంటాయి. దానికి తోడు హీరో తల్లిగా గీతాంజలితో సెంటిమెంట్‌ కూడా అదనంగా చేర్చారు. సమాజ సేవా దృక్పథం ఉన్న డాక్టర్‌ కమలినీ ముఖర్జీ బొడ్డుకు మరీ కిందకి చీరకట్టి తిరగడం ఇబ్బంది కలిగించే విషయం. గోపీ మిత్రబృందం, గోపిక హాస్పిటల్‌ స్టాఫ్‌తో చేయించిన కామెడీ, డైలాగ్‌ పంచ్‌లు పండాయి. అయితే అవికూడా గతంలో వచ్చిన వంశీ సినిమాల్లో చూసినట్లే అనిపిస్తాయి. గోపికి యాక్సిడెంట్‌ జరిగిన సన్నివేశంలో కూడా స్పష్టతలేదు.

      గోపిగా వేణు, గోపికగా కమలిని ముఖర్జీ తమ పాత్రలకు అనుగుణంగా బాగా నటించారు. ఆస్తికోసం ఆడపిల్లను కనాలని కృష్ణభగవాన్‌ చేసే 'అబద్ధాల వ్రతం', 'ఉడతా లింగరాజు- మిడతా నాగరాజు' అంట తిరిగే ధన్‌రాజ్‌ల కామెడీ బాగానే ఉంది. చక్రి పాటల్లో 'నువ్విక్కడుంటే నేనక్కడుంటే', 'గోగో రైరై' పాటలు చిత్రీకరణతో సహా బాగున్నాయి. ఇప్పుడు హీరోలు సినిమాలో పాటలు పాడడం ఫ్యాషన్‌ అయితే, ఇందులో దర్శకుడు వంశీ పాడడం విశేషం. ఇందులో కృష్ణేశ్వరరావు, ప్రదీప్‌శక్తి, జయలలిత, కొండవలస, సన, జీవా, కళ్యాణ్‌, నర్సింగ్‌యదవ్‌ తదితరులు ఇతర పాత్రలను పోషించారు.

- ఉదయ
 

Copy right reserved for www.cinevinodam.com 2005