Bookmark and Share   Cinevinodam Subscribe
 
‘కత్తి’
సినీవినోదం రేటింగ్‌ : 2.5/5

ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై మల్లికార్జున్ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఫుట్ బాల్ ఆటని, తన కుటుంబాన్ని అమితంగా ప్రేమించే కుర్రాడు రామకృష్ణ. అతని చెల్లెలు హరిత అకస్మాత్తుగా కనబడకపోతే ఆందోళన పడతాడు, చివరికి అనుకోని విధంగా ఇద్దరూ కలుస్తారు. కృష్ణమోహన్ అనే వ్యక్తిని నమ్మి మోసపోయానని, ఓసారి తన వెంటబడితే చెంపదెబ్బ కొట్టడంతో, పగబట్టి తనతో ప్రేమనాటకం ఆడి పెళ్ళి చేసుకున్నాడని - ఆమె చెబుతుంది. కర్నూలులోని కృష్ణమోహన్ గ్రామానికి వెళ్ళి, అక్కడ నరకాన్ని భరించలేక పారిపోయి వచ్చానని అంటుంది. అయితే, రామకృష్ణ హరితను తిరిగి కృష్ణమోహన్ ఇంట్లో అప్పగించి, ఇంటి పెద్ద కోట అభిమానం సంపాయిస్తాడు. క్రమంగా తన బావలో మార్పు తీసుకొచ్చి చెల్లెలి కాపురం చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తాడు. అందులో రామకృష్ణ ఎలా సఫలమయ్యాడో ఈ చిత్రంలో చూడాలి.

మన యువ హీరోలు ఇటీవల చేసిన చిత్రాల నేపథ్యంలోనే కళ్యాణ్ రామ్ ‘కత్తి’ కూడా ఉంది. కథ కొత్తగా లేకపోగా, సన్నివేశాలు, పాత్రలు, క్యారెక్టరైజేషన్ లోనూ కొత్తదనం లేదు. స్క్రిప్టు మీద పట్టులేక పోవడంతో సెకండాఫ్ లో సినిమా ‘కట్టే - కొట్టే - తెచ్చే’ అన్నట్లు అయిపోతుంది. ఫ్యాక్షనిస్ట్ కుటుంబంలోని తన బావను హీరో మార్చే క్రమాన్ని మరింత విపులంగా చూపితే బాగుండేది. కుటుంబమంతా ఎంతగానో ప్రేమించే శరణ్య ప్రేమలో పడి, ఎవరికీ చెప్పకుండా పెళ్ళి చేసుకుని వెళ్ళిపోవడం, కేవలం చెంపదెబ్బ కొట్టినందుకే రాయలసీమ గ్రామంలో తెలిసిపోవడం... దానికి ప్రతీకారం తీర్చుకోవడం మరీ హాస్యాస్పదంగా ఉన్నాయి. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో శ్యామ్ గెటప్ ఎంతమాత్రం ఇమడలేదు. ఆహుతి ప్రసాద్ కు హీరో వార్నింగ్ ఇవ్వడం, ‘నా దైవం’ అంటూ కోట ఫోటో పెట్టుకోవడం, చివరిలో కళ్యాణ్ రామ్ ఫోటోను కోట పెట్టుకోవడం వంటివి బాగున్నాయి. క్లైమాక్స్ కూడా ఆసక్తి కరంగా లేదు. యాక్షన్ కే ప్రాధాన్యత ఉన్న ఈ చిత్రంలో మినిస్టర్ ఇంట్లో ఫైట్, జాతరలో అజయ్ తో ఫైట్, శ్యామ్ ని కాపాడే సన్నివేశాలు బాగున్నాయి.

రామకృష్ణగా కళ్యాణ్ రామ్ చాలా బాగా చేశాడు. యాక్షన్ సన్నివేశాల్లో రాణించాడు, డాన్స్ లు బాగా చేసేందుకు కష్టపడ్డాడు. హీరోయిన్ గా సనాఖాన్ ప్రాధాన్యత లేని పాత్రలో అందంగా కనిపించింది. హీరో చెల్లి హరితగా శరణ్యామోహన్ పాత్రకి న్యాయం చేసింది. ఆమె భర్త కృష్ణమోహన్ గా ‘కిక్’శ్యామ్ బాగా చేశాడు. హీరో తండ్రిగా చంద్రమోహన్, ఫ్యాక్షనిస్ట్ గా కోట, అవ్వగా తెలంగాణ శకుంతల, పనిమనిషిగా ఝాన్సీ పాత పాత్రలే మళ్ళీ చేశారు. ఇతర పాత్రల్లో రఘుబాబు, సమీర, సత్యకృష్ణ, రాఘవ, ధర్మవరపు, ఆహుతి ప్రసాద్, విజయ రంగరాజా చేశారు. అజయ్ ఓ ప్రత్యేక విలన్ పాత్ర పోషించారు. వేణుమాధవ్ బ్రహ్మానందంల కామెడీ ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. బ్రహ్మానందం సెల్ నంబర్ ట్విస్ట్ మరీ సిల్లీగా ఉంది.

మణిశర్మ పాటల్లో ‘ఏ మవుతుందో గుడెల్లో’, ‘నాటుకోడి కూర’ పాటలు ఒక మోస్తరుగా ఉన్నాయి. రీరికార్డింగ్ బాగుంది. సర్వేష్ మురారి ఫోటోగ్రఫీ, గౌతంరాజు ఎడిటింగ్ బాగున్నాయి. రత్నం సంభాషణలు అంతంత మాత్రంగానే ఉన్నాయి.

- రాజేష్‌
 

Copy right reserved for www.cinevinodam.com 2005