Bookmark and Share   Cinevinodam Subscribe
 
‘ఖలేజా’
సినీవినోదం రేటింగ్‌ : 2.5/5

కనకరత్న మూవీస్ పతాకంపై త్రివిక్రమ్ రచన దర్శకత్వంలో సింగనల రమేష్ బాబు, సి.కళ్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

టాక్సీ డ్రైవర్ అల్లూరి సీతారామరాజు ఓ పని మీద రాజస్థాన్ వెళ్తాడు. అంతకు ముందే అతనికి పరిచయమై అడుగడుగునా ఇబ్బందులు పాలు చేస్తున్న సుభాషిణి కూడా అనుకోకుండా అక్కడ అతనికి తారసపడుతుంది. డాక్యుమెంటరీ డైరెక్టర్ సునీల్, మొక్కల పరిశోధకుడు అలీతో పాటు సాగే వారి ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. తమ గ్రామానికి పట్టిన అరిష్టాన్ని తొలగించే దేవుడిని వెదుకుతూ వచ్చిన సిద్దు రాజునే దేవుడిగా భావిస్తాడు. వారి గ్రామానికి చేరుకున్న రాజుకు తను చేస్తున్న పనుల్లో అతీత శక్తి అగుపిస్తూంటుంది. వాస్తవానికి ఆ గ్రామస్థులు మృత్యువాత పడటానికి జె.కె. అనే పారిశ్రామిక వేత్త చేస్తున్న కుట్రే కారణమని ఆ తర్వాత రాజుకు తెలుస్తుంది. ఖరీదైన ఖనిజం ఉన్న ఆ ప్రాంతం నుండి గ్రామస్తులు అడ్డంకిని తొలిగించుకోవడానికి ప్రయత్నిస్తున్న జె.కె ను ఎదుర్కొన్న రాజు ఎలా విజయం సాధించాడనేది ఈ చిత్ర కథాంశం.

ఈ సినిమా పూర్తి కావడానికి మూడేళ్ళు ఎందుకు పట్టిందీ? ఎలా అర్థం కాదో... అలానే ఈ చిత్రం కథ కూడా అర్థం కాదు. మహేష్ బాబుతో చేయించిన కామెడీ విన్యాసాలకు అక్కడక్కడా నవ్వుకోవడం తప్ప, ఒక క్రమం... పద్ధతీ ఈ చిత్రంలో లేదు. సుదీర్ఘకాలం సినిమా నిర్మాణం జరగడం వల్ల కథలో మార్పులు, చేర్పులు జరగడం వల్ల కూడా ఇటువంటి పరిస్థితి వచ్చి ఉండవచ్చు. ఏదేమైనా, ఎప్పటి నుండో ఎదురు చూసిన మహేష్ అభిమాన ప్రేక్షకులకు ఈ చిత్రం నిరుత్సాహ పరుస్తుంది. ‘పోకిరి’లో తక్కువ సంభాషణలతో మహేష్ ఆకట్టుకుంటే, అందుకు భిన్నంగా ఇందులో అతిగా డైలాగ్స్ పెట్టి హోరెత్తించారు. అయితే, అవి మరీ మాస్... ముదురు మాటలు కావడం ఇబ్బంది పెడుతుంది. ‘దొబ్బించుకోవడం’ అనే మాట కనీసం వందసార్లు దొర్లుతుందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. దర్శకుడే సంభాషణల రచయిత కావడంతో తెగ డైలాగ్ పంచ్ లు వాడినప్పటికీ, టేకింగ్ షార్ప్ గా లేకనో... సన్నివేశాన్ని సాగదీయడం వల్లనో ఆశించిన ఫలితం రాలేదు. ఆవారా లక్షణాలన్నీ పుష్కలంగా ఉన్న హీరోకు అతీత శక్తులు తగిలించి, దేవుడిని చేసే ఆలోచన రావడం తమాషాగా ఉంది. హీరో పరిచయం సన్నివేశంలో రాజస్థాన్ లో వరుసపెట్టి అందరినీ చంపేసిన హీరో ఆ తర్వాత దాన్ని - ‘మంచి నీళ్ళ దొంగతనం కోసం’ అని చెప్పడం, మృత్యువాత పడ్డ గ్రామం మొదట రాజస్థాన్ లో ఉందని చెప్పి... ఆ తర్వాత ఆంధ్రాకు మార్చడం వంటి తప్పుల పట్టిక ఈ చిత్రంలో చాలా ఉంది. అనర్థాల హీరోయిన్ తో సన్నివేశాలు, ఇంటర్వెల్ మందు సుబ్బరాజు బ్యాచ్ తో హీరో ఫైట్ బాగున్నాయి.

టాక్సీ డ్రైవర్ రాజుగా మహేష్ బాబు చాలా ఉత్సాహంగా నటించాడు. సంభాషణలు ఎక్కువైనప్పటికీ రక్తికట్టించేందుకు ప్రయత్నించాడు. ఇబ్బందులకు మారుపేరైన సుబ్బు పాత్రను అనూష్క బాగా చేసింది. అందంగా కనిపించింది. విలన్ జె.కె పాత్రలో ప్రకాష్ రాజ్ అతిథిగా కనిపించాడు. సిద్దూగా షఫీ మంచి పాత్ర పోషించాడు. అలీ, సునీల్, రఘుబాబు, బ్రహ్మానందంల కామెడీ ఆశించిన స్థాయిలో లేదు. గ్రామ పెద్దగా రావురమేష్ బాగా చేసినా అతని మేకప్ బాగులేదు. ధర్మవరపు, అర్చన, కోట, ఎమ్మెస్, అనంత్, గుండు సుదర్శనం ఇతర పాత్రలు పోషించారు. మణి శర్మ సంగీతంలో ‘ఓం నమః శివాయ’, ‘భూం షకలక’ వంటి పాటలు వినడానికి బాగున్నాయి. పాటల చిత్రీకరణ బాగుంది. రీరికార్డింగ్ సినిమాకి ఉపయోగకరంగా ఉంది. యష్ భట్ ఫోటోగ్రఫీ, ఆనంద్ సాయి ఆర్ట్, శ్రీకర ప్రసాద్ ఎడిటింగ్ బాగున్నాయి. రాజస్థాన్ లొకేషన్స్ ని అందంగా చూపించారు.

- రాజేష్‌
 

Copy right reserved for www.cinevinodam.com 2005