Bookmark and Share   Cinevinodam Subscribe
 
‘కొమరం భీమ్’
సినీవినోదం రేటింగ్‌ : 3/5

ఆదివాసి చిత్ర, ఫిలిం మీడియా ప్రొడక్షన్స్ సంయుక్తంగా అల్లాణి శ్రీధర్ దర్శకత్వంలో ఈ చిత్రం నిర్మించారు.

తెలంగాణ సాయుధ పోరాటం జరగడానికి ముందే పోరాటాల గడ్డకు పురుడుపోసిన అమరజీవి కొమరం భీమ్1935లోనే నైజాం నిరంకుశ పాలకులకు నిద్రలేకుండా చేసి తన జాతి ప్రజలు, గిరిజన పుత్రులైన గోండు వీరుల పోరాట పటిమను ఇనుమడింపచేసిన స్వేచ్ఛా పిపాసి ఆయన. కాలు కదిపినా ఆంక్షలతో అల్లాడిస్తున్న చట్టాలను ఎదిరించి పోరాట సేద్యం చేసి, తన తదనంతరం ఎందరో వీరులను జాతికి కానుకగా పండించి ఇచ్చిన భూమి పుత్రుడు భీమ్. గిరిజనులకు భూమిపై వున్న మమకారాన్ని గుర్తించి, వారి ఆశయ సాధనకై ప్రాణాలు తృణప్రాయంగా ధారపోసిన సమరయోధుని వీరగాథగా తెలంగాణ పల్లెపల్లెనా ‘భీమ్’ కథ వినబడుతుంది. అటువంటి చారిత్రక పురుషుని కథను తీసుకుని సినిమాటిక్ చిలవలు పలవలు చేర్చకుండా అచ్చమైన కథను స్వచ్ఛంగా అందించిన చిత్రం ఇది.

కథలోకెళితే... ఆదిలాబాద్ వాంకిడి పరిసరాల్లో దట్టమైన అడవులలో గిరిజనులైన గోండులు వ్యవసాయం చేసుకుని బుతుకులు వెళ్ళతీస్తుంటారు. ఆరుగాలం శ్రమించి అడవి సంపద సేకరించి సంతలో అమ్మబోతే, వ్యాపారులు చేసే మోసానికి బలవుతుంటారు. గోండుల కష్టాన్ని వ్యాపారులు ఒకవంక, ప్రభుత్వాధికారులైన ‘పట్వారీ’లు, ‘గిరిధావర్’లు పన్నుల రూపంలో దోచుకుంటుంటారు. పన్ను కట్టనివారికి శిక్షలువేసి అమలు చేస్తుంటారు. ఇలా ఆటవిక న్యాయంలో బాధలు పడుతున్న వారికి, భూమిలేని నిరుపేదలకు పట్వారీ ఓ ముచ్చట చెబుతాడు. ఎవరు ఎంత అడవి నరికి వ్యవసాయ యోగ్యం చేసుకుంటారో ఆ భూమి వారిదేనని వివరిస్తాడు. అందుకు ప్రభుత్వ ఫర్మానా అయిందని పత్రాలు చూపుతాడు. అది నమ్మిన గోండులు అడవి భూమిని తమ రెక్కల కష్టంతో సేద్యానికి అనుకూలంగా చేసుకుంటారు. పంటలు ఏపుగా పండుతుండగా పట్వారీ వచ్చి ఆ భూములన్నీ ఫలానా వారికి చెందినవని, ఆ జాగీర్దారును వెంటబెట్టుకు వచ్చి మరీ చూపుతాడు. తమ రెక్కల కష్టం వృధా అయిందన్న బాధతో గిరిజనులు భూమి వదలడానికి ఇష్టపడరు. వారికి అండగా ఎన్నో బాధలు అనుభవించి, విసిగి వేసారిన కొమరం భీమ్ (భూపాల్ రెడ్డి) నిలబడతాడు. తన జాతి ప్రజల్లో తిరుగుబాటుతత్వాన్ని చైతన్యాన్ని రగిలిస్తాడు. పోరాడితే పోయేది బానిస బతుకులు తప్ప మరేం లేదనీ నమ్ముకున్న భూమి ఆశను నమ్ముచేసేది లేదని తన చర్యలతో నైజాం ప్రభువులకు తెలుపుతాడు. పోరాట బావుటా రెపరెపలాడకముందే అణచివేయాలని డిఎస్పీ హిదయతుల్లా ఆలోచిస్తాడు. పోలీసు బలగాలతో అడవిపై తూటా పేలుస్తాడు. ‘కొమరం భీమ్’ సారధ్యంలో గిరిపుత్రులు ఒక్కటిగా పోరుసల్పి ఆ దాడిని తిప్పికొడతారు. ఎదురుగా వచ్చి పోరాడలేక అర్థరాత్రిలో కొండ వెనకనుంచి దొంగదెబ్బ తియ్యడానికి కంపెనీ బలగాలు చొరబడతాయి. పోరాటమే ధ్యేయంగా బతికిన భీమ్ చివరికి ఏం అయ్యాడన్నది మిగతా కథ.

థింసా నృత్యాలు, తుడుం పోరాటాలు చిత్రంలో కనువిందు చేస్తాయి. ఉన్న కథను, గిరిజనుల సహకారంతో స్ర్కీన్ ప్లే సమకూర్చుకోవడంతో చిత్రానికి ప్రాణం వచ్చినట్టుగా వుంటుంది. స్క్రిప్టు అడవిని వదిలి కదల్లేదు కనుక, అక్కడ కనిపించే అందమైన దృశ్యాలను అద్భుతంగా పట్టింది. నైజాం నిరంకుశ పాలనలో వున్న పాత్రలన్నీ ‘రామ్ రామ్’ అనుకుంటూ పలకరించుకోవడాన్ని బట్టి, అప్పటి పద్ధతి తెలుస్తుంది. అప్పటి తెలంగాణ పల్లెల్లో జన జీవనం ముఖ్యంగా, అడవి నేపథ్యాలలో ఎలా వుండేదో అలానే చిత్రీకరించడం ఆకట్టుకుంటుంది. భీమ్ పెళ్ళి దృశ్యాల్లో గోండుల వివాహ వేడుకలు, వారి వేషధారణలు సరికొత్తగా వుంటాయి. స్త్రీలు వారి కట్టుబాట్లు ఇప్పటి తరాలకు కొత్తగానే వుంటాయి. అడవిపై తమ భూమి హక్కు కాపాడుకోవడానికి మహిళలు ముందు వెనకంజవేసినా, తరువాత భీమ్ ను ఆదర్శంగా తీసుకున్న విధానాన్ని మలిచిన తీరు, ఉద్యమ స్ఫూర్తితో కొమరం ఎదగడం వంటి దృశ్యాలు మనసును పట్టేస్తాయి. నాయిక సోంబాయ్ (మౌనిక) పరిచయం దృశ్యంలో నీళ్ళలో విరిసిన అలల పూలు చూపడం సరికొత్తగా వుంది. సాంకేతికంగా అన్నీ తానై కొమరం భీమ్ గా వేసిన భూపాల్ రెడ్డి చిత్రాన్ని తన నటనతో నడిపించాడు. మౌనిక, తెలంగాణ శకుంతల, ఎస్.ఎం.ప్రాణ్ రావు, కె.ఎల్.ఎన్.రావు, బ్యాంక్ ప్రసాద్ మంచి నటన ప్రదర్శించారు. ‘అందరికోసం ఈ పోరు పోరాటం చావదు. మనిషి సస్తడు అంతే, గెలిస్తిమా తలెత్తుకు బతుకుతం. సచ్చినామనుకో మన పిల్లలు తలెత్తుక బతుకుతరు’. ‘ఇది చావుబతుకుల సమయం. తుపాకులకు ఎదురు నడిచే సమయం’. ‘అటుంటావా ఇటుంటావా, ఉప్పు చెట్టుకు కాస్తదారా’ వంటి ప్రాణ్ రావు మాటలు ఆకట్టుకుంటాయి. కె.భవానీశంకర్ కెమెరా తైలవర్ణ చిత్రాలను ఎన్నో తన కన్నులతో చూసింది. అడవి నేపథ్యంలో గిరిజనుల ఆవాసాలు, పొలం పుట్రలో మంచెలు ఆర్ట్ విభాగంలో అందంగా ఒదిగిపోయాయి. భూపాల్ రాసిన పాటలన్నీ గౌతంఘోష్ సంగీతంలో అందంగా వినిపించాయి. కొన్ని సన్నివేశాల్లో సంగీతమే మాట్లాడింది. ‘రేలారేలా జోజోల’, ‘ఓచ్చిరోచ్చిరో నిజాం బంటులొచ్చిరో అడవి కొచ్చి గిరిజనుల సావుతెచ్చిరో’ వంటి పాటలు సాహితీపరంగా బాగున్నాయి. దర్శకత్వం పరంగా ప్రతి సన్నివేశాన్ని ప్రేక్షకుడికి నచ్చేవిధంగా తీయడంలో అల్లాణి శ్రీధర్ ప్రతిభ తెలుస్తుంది. గోండుల జీవనాన్ని తెరకెక్కించడంలో ఓ పోరాటయోధుని కథను చెప్పడంతో ఇప్పటికే ఉత్తమ దర్శకత్వం నంది అవార్డు రావడం బంగారు పళ్ళేనికి గోడ చేర్పు లభించినట్టు అయ్యింది.

- శేఖర్
 

Copy right reserved for www.cinevinodam.com 2005