Bookmark and Share   Cinevinodam Subscribe
 
‘కొమరం పులి’
సినీవినోదం రేటింగ్‌ : 2/5

కనకరత్న మూవీస్ పతాకంపై ఎస్.జె.సూర్య దర్శకత్వంలో సింగనమల రమేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

‘‘కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించేవారే దేవుళ్ళు’’ అనే సిద్ధాంతాన్ని నమ్మే సిన్సియర్ పోలీసు అధికారి ‘కొమరం పులి’. ప్రాణాలకు తెగించి పని చేస్తున్న అతన్ని ప్రభుత్వం అభినందించే సమయంలో - సక్రమంగా పనిచేయని పోలీసు అధికారులను దారిలో పెట్టేందుకు ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయమని అభ్యర్థిస్తాడు. దానికి అనుగుణంగా అతని ఆధ్వర్యంలోనే ‘పులి టీమ్’ ఏర్ఫడుతుంది. తద్వారా పోలీసు విభాగంలోని అవినీతి, అలసత్వాలను ప్రక్షాళన చేసే పని చేస్తుంటాడు కొమరం పులి. ఓ పోలీసు అధికారి మాయమయిన కేసులో మాఫియా డాన్ సలీమ్ ను ఎదుర్కొన్న పులి, అతనికి కొరకరాని కొయ్యగా మారుతాడు. వారి మద్య వివాదం నడుస్తూండగానే - నిక్సన్ అనే అంతర్జాతీయ తీవ్రవాదితో సలీమ్ కు ఉన్న సంబంధాన్ని పులి కనుగొంటాడు. ఆ పరిశోధనలో సలీమ్ నుండి పలు దాడులను ఎదుర్కొంటాడు. ఆ సమయంలోనే - పోలీసు అధికారి అయిన తన తండ్రిని చంపింది కూడా సలీమేనని తెలుసుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది సినిమాలో చూడాలి.

‘‘ఎక్కడి నుంచో పుట్టిన కథ కాదిది. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని గమనించి రాసుకొన్నా. సమాజం కోసం ఏదైనా చేయాలని ఆలోచిస్తుంటారాయన’’ - అంటూ ఈ చిత్రం గురించి దర్శకుడు సూర్య చెబుతున్నారు. నిజంగానే ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సామాజిక ఆలోచనా విధానం కనిపిస్తుంది. సమాజాన్ని బాగు చేయాలనే తపనా కనిపిస్తుంది. అయితే, జాతికి నీతులు చెప్పడానికీ ఓ పరిమితీ, పద్ధతీ ఉంటాయి. అవేమీ పాటించకుండా పవన్ కళ్యాణ్ పులి పాత్రతో భారీ డైలాగులు చెప్పి ప్రేక్షకుల సహనాన్ని చంపేశారు. ఇక కథ, కథనం తలాతోకా లేని విధంగా ఉన్నాయి. దాదాపు అన్ని సన్నివేశాలు గతంలో మనం చూసినవే. కొత్తదనం మచ్చుకు కూడా కనిపించలేదు. కోట్లాది బడ్జెట్ తోరెండేళ్ళకు పైగా నిర్మాణమైన ఈ భారీ చిత్రం చూస్తే - పవన్ కళ్యాణే దర్శకత్వం చేసి, సూర్యని తనకు అసిస్టెంట్ గా వాడుకున్నారని అనిపిస్తుంది. హీరో తల్లి శరణ్యది గిరిజన తండా అని చెప్పి, అక్కడ తమిళనాడు దేవుడి గుడి చూపిస్తారు. మాఫియా గ్యాంగ్ లకి పోలీసుల్లో ఇన్ఫార్మర్లు ఉండొచ్చు కానీ, ఏకంగా ‘పులి టీమ్’లో అంతర్జాతీయ తీవ్రవాది చేరడం ఎబ్బెట్టుగా ఉన్నాయి. సినిమా అంతా పరభాషా వాసనలు కనిపిస్తాయి. సినిమా ప్రారంభంలో హీరో పరిచయం ఫైట్ లో గ్రాఫిక్స్ నాసిరకంగా ఉండటంతో కృతకంగా తయారయ్యింది. హీరోయిన్ పాత్రతో ఉన్న అన్ని సన్నివేశాలు చిరాకు పుట్టిస్తాయి. ప్రారంభంలో శరణ్యతో చేసిన సన్నివేశం ఆకట్టుకుంటుంది. కొమరంపులి బ్రహ్మాజీకి తలంటి మంచి పనులు చేయమని చెప్పడం, మాస్టర్ భరత్ తో పార్క్ లో సీన్, నాజర్ చనిపోయినపుడు హీరో ప్రసంగం, విలన్ తో వాదించి శరణ్య తిరిగిరావడం వంటి సన్నివేశాలు బాగున్నాయి.

కొమరంపులి గా పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ గానే నటించారు. కొత్తనటి నికిషా పటేల్ వల్ల సినిమాకి ప్రయోజనం కలగలేదు. ఆమెకు చెప్పించిన డబ్బింగ్ కూడా సరిపోలేదు. సలీమ్ గా మనోజ్ వాజ్ పాయ్ నటనను హైలైట్ గా చెప్పుకోవాలి. శరణ్య, నాజర్, గిరీష్ కర్నాండ్, అలీ, కోవై సరళ, శ్రీధర్ రావు, బ్రహ్మాజీ చరణ్ రాజ్ ఈ చిత్రంలో ఇతర పాత్రలు పోషించారు. రెహమాన్ సంగీతంలో పాటలు చెప్పుకోదగ్గవిగా లేదు. ‘ఓ చెకుముకి’ కాస్త ఫర్వాలేదు. ‘పవర్ స్టార్’ పాట చిత్రీకరణ బాగుంది. రీరికార్డింగ్ సినిమా మూడ్ కి ఉపకరించింది. వినోద్ ప్రధాన్ ఫోటోగ్రఫీ, ప్రభాకరన్ ఎడిటింగ్ బాగున్నాయి.

- రాజేష్‌
 

Copy right reserved for www.cinevinodam.com 2005