శ్రేయ ప్రొడక్షన్స్ పతాకంఫై రాంగోపాల్ వర్మ రచన, దర్శకత్వంలో కోనేరు కిరణ్ కుమార్
ఈ చిత్రాన్ని నిర్మించారు.
అమలాపురం రంభా టాకీస్ లో తెగ సినిమాలు చూసి ఇప్పుడొస్తున్న సినిమాలను తలదన్నేట్లు తన దర్శకత్వంలో చిత్రం చేయాలని అప్పలరాజు 'నాయకి' అనే కధ తయారు చేసుకుంటాడు. హైదరాబాద్ వచ్చి అవకాశం కోసం ప్రయత్నాలు చేస్తాడు. రాకీ అనే ఓ నిర్మాత అప్పలరాజుతో సినిమా చేయడానికి ముందుకొస్తాడు. అయితే ఆ సినిమా పెట్టుబడి కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ, టాప్ హీరోయిన్ కనిష్కను అందులో చేయడానికి ఒప్పిస్తారు. ఆమె ద్వారా టాప్ హీరో బాబు కూడా ఆ చిత్రంలో చేసేందుకు వప్పుకుంటాడు. అనుకోకుండా కనిష్క - బాబు ల మధ్య విభేదాలు రావడంతో మరో హీరో కే.టి ని ఆశ్రయిస్తారు. పెట్టుబడి కోసం శ్రీశైలం అనే గూండా ని కలిస్తే... ఆ సినిమాలోని పాటలన్నీ అతనే రాస్తానని అంటాడు. బాబు - కే.టి ల మధ్య ఉన్న విభేదాల వల్ల 'నాయకి' పూర్తి కాకుండా, విడుదల కాకుండా బాబు బృందం ప్రయత్నిస్తుంది. 'నాయకి ' నిర్మాణంలో కలిగిన ఇబ్బందులవల్ల చాల విధాల రాజీపడి అప్పలరాజు సినిమాను పూర్తిచేస్తాడు. బాబు బృందం కుట్రలను దాటుకుని ఆ చిత్రం విడుదలయ్యిందా... విజయం సాదించిందా.... అనేది వెండితెరఫై చూడాలి.
సినిమా రంగంఫై సెటైర్ లతో రాంగోపాల్ వర్మ నిర్మించిన పూర్తి కామిడి చిత్రం ఇది. సినిమా ప్రముఖుల ను పోలిన పాత్రలను పెట్టి ఈ చిత్రం ప్రచారంలో సంచలనం .... తమ గురించి ఏమి చూపాడోననే గుబులు చిత్ర పరిశ్రమలో పుట్టించాడు వర్మ. కొందరు వ్యక్తులు తమను పోలిన పేర్లను మార్పించు కునేందుకు వర్మఫై వత్తిడి తెచ్చారు కూడా. సినిమా రంగంఫై సెటైర్ లతో నిర్మించిన ఈ చిత్రం ఫెయిల్ అవ్వాలని సినిమా రంగంలోని వారు కూడా కోరుకున్నారు. చివరికి వారి కోరికనే వర్మ తీర్చారు. మసాలా, ఫార్ములా సినిమాలకు భిన్నంగా ఒక మంచి సినిమా తియ్యాలనుకున్న ఒక కొత్త దర్శకుడు సినిమా రంగంలోని అవరోధాల వల్ల చివరికి ఎంత చెత్త చిత్రం చెయ్యాల్సి వచ్చింది.... అయితే ఆ చెత్త చిత్రానికే
గొప్ప చిత్రం అంటూ అభినందనలు, అవార్డులు ఎలా వచ్చాయి- అనే చక్కటి కధతో తీసిన ఈ చిత్రం చెత్త స్క్రీన్ ప్లే వల్ల సుత్తి సినిమాగా మారింది. మొదటి భాగం ఫరవాలేదనిపించినా, రెండో భాగంలో హీరోల గొడవ దగ్గరినుండి పరమ రొటీన్ గా మారిపోయింది. సినిమాలో హైలైట్ కావాల్సిన బ్రహ్మానందం కామెడి చాల సన్నివేశాల్లో బోర్ కొట్టింది. హీరో పాత్రను నిలకడగా నడపలేదు. సహజత్వం ఉన్న సినిమా తీస్తానన్న హీరో... ఎడారిలో వర్షం కురిసే సీన్ పెడతానంటాడు... అన్నింటికీ రాజీ పడిపోయి సినిమా విడుదల తర్వాత వాటి గురించి బాధ పడిపోతాడు. ఫిలిం ల్యాబ్ లో సన్నివేశాలు మరీ నాసి రకంగా ఉన్నాయి. రవితేజ కనిపించిన సన్నివేశం కూడా బాగా చేయలేకపోయారు. హీరోయిన్ తల్లికి కధ చెప్పడం... కృష్ణ భగవాన్ ఆఫీసులో సన్నివేశాలు... క్లైమాక్స్ గుర్రం అవార్డ్స్ క్లైమాక్స్ వంటి కొన్ని బాగున్నాయి. కొంత నాటకీయత ఉన్నప్పటికీ ఇందులో వర్మ చూపిన పాత్రలు... వాటి ప్రవర్తన వాస్తవానికి దగ్గరగానే ఉన్నాయి. అయితే ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో మాత్రం విఫలమయ్యారు.
అప్పలరాజుగా సునీల్ పరిణితి చెందిన నటన ప్రదర్శించాడు. నడవడిక... సంభాషణ... అన్నింటిలోను కమెడియన్ లక్షణాలు వదులుకుని హీరోలా చేసాడు. అతను చేసిన డాన్స్ లు ఈ చిత్రంలో హైలైట్. అసిస్టెంట్ డైరెక్టర్ గా స్వాతి చిన్న పాత్రే అయినా బాగా చేసింది. కనిష్కగా సాక్షిని అందంగా చూపించారు. హీరోలు గా ఆదర్శ్, సుబ్బరాజు, సంగీత దర్శకుడు రెహ్మాన్ శాస్త్రి గా అలీ, దాదా శ్రీశైలంగా బ్రహ్మానందం, గన్ మాన్ గా వేణుమాధవ్,ఇతర పాత్రల్లో కోవయ్ సరళ, తనికెళ్ళ భరణి, కోట, రాజేష్, రఘు బాబు, హర్ష వర్ధన్, రాజా రవీంద్ర, ఎమ్మెస్ నారాయణ, నర్సింగ్ యాదవ్, తానూరాయ్ నటించారు. కోటి పాటల్లో 'ఎవడబ్బ సొమ్ము కాదురా', 'పబ్లిసిటీ', 'రింగురోడ్డు కాడ' ఓకే. కలువ సాయితో పాటు ఇందులో ఓ సెక్సీ పాట వర్మ రాయడం, బ్రహ్మానందం ఓ పాట పాడటం విశేషం. సుధాకర్ ఫోటోగ్రఫీ, ప్రవీణ్ ఎడిటింగ్ బాగున్నాయి.