శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై రవి యాదవ్ ఫోటోగ్రఫీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వంలో దిల్ రాజు, శిరీష్, లక్ష్మణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
అమెరికాలో పక్కపక్క ఇళ్ళల్లో ఉండే బాలు, స్వప్న ప్రేమలో పడతారు. అయితే ఒకటి మటన్ ఫ్యామిలీ, మరొకటి మడికట్టుకునే ఫ్యామిలీ కావడంతో వీరి ప్రేమ విషయంలో రెండు కుటుంబాలకు ఏకాభిప్రాయం కుదరదు. వారి ప్రేమ నిజమైనదని నిరూపించుకోవడానికి కొన్నాళ్ళు ఒకరినొకరు కలవకుండా ఉండాలని నిబంధన విధిస్తారు. దానికి అనుగుణంగా ఒకరికొకరు దూరంగా ఉంటున్న బాలు, స్వప్నల మధ్య స్వప్న బావ వల్ల అపోహలు తలెత్తే పరిస్థితి వస్తుంది. అయినా, వాటన్నింటిని దాటుకుని వారు తమ ప్రేమను ఎలా గెలిపించుకున్నారనేది ఈ చిత్ర కథాంశం.
కమల్ హసన్, సరితలతో కె.బాలచందర్ నిర్మించిన సూపర్ హిట్ ‘మరో చరిత్ర’ ఆధారంగా ఈ చిత్రం రూపొందించారు. అయితే, పాత కథను తీసుకుని చేసినా దాన్ని ఆదునీకరించక పోవడం వారు చేసిన పెద్ద తప్పు. కాలంతో పాటే సమాజంలో ఎన్నో మార్పులొస్తాయి. ఒకప్పటి సెంటిమెంట్స్ ఇప్పుడు చాదస్తంగా అనిపిస్తాయి. అదే ఈ చిత్రం విషయంలోనూ జరిగింది. క్లైమాక్స్ లో చనిపోయే హీరో హీరోయిన్లను బతికించడం ఒక్కటే ఈ చిత్రంలో చేసిన చెప్పుకోదగ్గ మార్పు. నేపధ్యం అమెరికా కావడం కూడా కొత్తదనాన్నిచ్చింది. న్యూయార్క్ వంటి అందమైన ప్రదేశంలో మంచి ప్రేమ కథా చిత్రం చేయాలనుకున్న రవియాదవ్ కొత్త కథతో చేసుంటే బాగుండేది. ఇందులో చెప్పుకోదగ్గ విషయం ఏదన్నా ఉందంటే, అది రవియాదవ్ ఫోటోగ్రఫీ. అమెరికాలోని నయాగరా, న్యూయార్క్ అందాలను అతను కన్నులపండువగా తెరకెక్కించాడు.
అమెరికాలో ఉన్నప్పటికీ తెలుగు అబ్బాయికి ‘మనసు’, ‘దొంగ’ వంటి సాధారణమైన మాటలకీ అర్థం తెలియదని చెప్పడం, హీరోయిన్ తో ‘దొంగ సచ్చినోడు’, ‘దొంగనాకొడుకు’ వంటి తక్కువ స్థాయి మాటలు అనిపించడం బాగులేదు. పబ్ లో ముద్దు వద్దని చెప్పిన హీరోయిన్, ఇంటిలో నీకు ఏది కావాలంటే అది తీసుకోమని హీరోతో చెప్పడం, రెండు కుటుంబాల మధ్య వివాదంలో ‘మనకు లేని మోరల్స్ మన పిల్లలకి ఉంటాయా’ అంటూ హీరోయిన్ హీరోను కన్విన్స్ చేయడం అర్థం లేనివి. హీరోహీరోయిన్లు కనీసం చూసుకోకూడదని కండిషన్ పెట్టడమే పిచ్చితనం. అలా, హీరో హీరోయిన్లు న్యూయార్క్ జంక్షన్ లో ఎదురుపడ్డా చూసుకోవడానికి ఇబ్బంది పడ్డ సన్నివేశం చాలా బాగా చిత్రీకరించారు. కానీ దానికి ఏమాత్రం రీజనింగ్ లేదు. చాదస్తపు సన్నివేశానికి మోడ్రన్ రీరికార్డింగ్ చేసినంత మాత్రాన పండదు. వైజాగ్ యాసతో అమెరికా దుర్గగా ఊర్వశి, హీరో తల్లిగా జానకి, పాప్ శాస్త్రిగా అమెరికాలో పోలీసు పంతులుగా నరేష్ పాత్రలు బాగున్నాయి. జనం ఎప్పుడో మర్చిపోయిన మౌత్ ఆర్గన్ ను ఇందులో మళ్ళీ గర్తుచేశారు.
లవర్ బాయ్ బాలుగా వరుణ్ సందేష్ ఇందులో కూడా బాగా చేశాడు. అతని వచ్చీరాని తెలుగుకు సరిగ్గా ఈ పాత్ర సరిపోయింది. స్వప్నగా అమెరికా అమ్మాయి అనిత బాగానే చేసింది. అయితే, ఆమె ఉండాల్సినంత గ్లామర్ గా లేదని యువ ప్రేక్షకులు అసంతృప్తి చెందారు. పైగా ఆమె డబ్బింగ్ కూడా బాగులేదు. పాత్ర చిన్నదే అయినా శ్రద్దాదాస్ అందంగా కనిపించింది. బాగా నటించింది. ఇతర పాత్రల్లో ప్రతాప్ పోతన్, విజయ్, ఆదర్శ్, కోట, వేణు నటించారు. మిక్కీ జె మేయర్ పాటలు ఫర్వాలేదు. పాత ‘మరో చరిత్ర’ నుండి మూడు పాటల సాహిత్యం తీసుకుని కొత్త ట్యూన్స్ కట్టారు. అన్ని పాటల చిత్రీకరణ చాలా బాగుంది. తమన్ రీరికార్డింగ్ బాగుంది. ఉమర్జీ మాటలు అక్కడక్కడా బాగున్నాయి.