అర్కా మీడియా వర్క్స్ పతాకంపై రాజమౌళి దర్శకత్వంలో ప్రసాద్ దేవినేని, శోభు యార్లగడ్డ ఈ చిత్రాన్ని నిర్మించారు.
పట్టణంలో పాత సైకిల్ పై తిరుగుతూ పొట్టపోసుకునే రాముకు ఆటో కొనుక్కోవాలనే కోరిక బలంగా
ఉంటుంది. అనుకోకుండా ఊళ్ళోని, చనిపోయిన తల్లి పొలం తనకు దక్కిందని తెలుసుకుని, దాన్ని అమ్మి ఆటో
కొనాలనుకుంటాడు. ఊరికి వెళ్ళేటప్పుడు ప్రయాణంలో అపర్ణ అనే అమ్మాయి అతనికి పరిచయం అవుతుంది. పొలం అమ్మే
పనిమీద ఊరిలో రామినీడు అనే పెద్ద మనిషిని రాము కలుస్తాడు. అపర్ణ అతని కూతురేనని తెలుస్తుంది. రాయలసీమ
పద్ధతిలో అతనికి మర్యాదలు చేస్తారు. ఆ తర్వాత రాముకి తెలుస్తుంది - గతంలో తమ రెండు కుటుంబాల శత్రుత్వం వల్ల
రామినీడు, అతని కొడుకులు తనని చంపబోతున్నారని. అయితే, కుటుంబ ఆచారం ప్రకారం అతిథిని ఇంటిలో
చంపకూడదని, అతను ఇంటి గడప దాటితే లేపేద్దామని రామినీడు ఎదురు చూస్తుంటాడు. ఇంటి గడప దాటకుండా
తెలివిగా తప్పించుకుంటున్న రాము ప్రాణగండం నుండి ఎలా తప్పించుకుని బయటపడ్డాడనేదే ఈ చిత్రం...
భారీ యాక్షన్ చిత్రాలకు పేరు పొందిన రాజమౌళి ఓ కామెడీ హీరోతో వినోద ప్రధానంగా చేసిన లోబడ్జెట్ చిత్రం
ఇది. కథాంశం చిన్నదే అయినప్పటికీ, బిగువైన స్క్రీన్ ప్టే తో వేగవంతంగా నడుపుతూ తనదైన టేకింగ్ తో ప్రేక్షకులను కట్టి
పడేసాడు. సరైన నటీనటుల ఎంపికతో పాటు రామ్ ప్రసాద్ ఫోటోగ్రఫీ, కీరవాణి సంగీతం సినిమాకి వన్నె తెచ్చాయి.
అనవసరమైన విషయాలు జొప్పించి మూడు గంటలు సాగదీయకుండా, కథకు తగ్గట్లు రెండు గంటలకే పరిమితం చేయడం
రాజమౌళి ప్రతిభకు, తనపై తనకున్న నమ్మకానికి తార్కాణం. రాయలసీమ మర్యాదలను వాతావరణాన్ని బాగా
చూపించారు. రైల్లో హీరో హీరోయిన్ల మద్య సన్నివేశాలు ఆహ్లాదకరంగా ఉన్నాయి. అయితే, హీరో తప్పించుకోవడానికి
అనుసరించిన పద్ధతులు సినిమాటిక్ గా ఉన్నాయే తప్ప, కన్విన్సింగ్ గా లేదు.అప్పటి వరకూ భయంతో బితుకు బితుకు
మంటూ ఉన్న సునీల్ సడన్ గా హుషారెత్తిపోయి ‘‘తెలుగమ్మాయి’’ పాట పాడటం సరిగా లేదు.క్లైమాక్స్ కూడా కొత్త
లొకేషన్స్ లో బాగా చేశారు. అయితే కొత్తదనం లేదు. హీరో, హీరోయిన్, హీరోయిన్ బావల మద్య ప్రేమ, పెళ్ళి
మలుపులు బాగున్నాయి. సినిమా రెండవ భాగంలో ప్రేక్షకులు మెచ్చే నాటకీయ సన్నివేశాలు మరికొన్ని చేరిస్తే బాగుండేది.
మొత్తం మీద రాజమౌళి గత చిత్రాల అంచనాలు లేకుండా చూసే ప్రేక్షకులకు ఈ చిత్రం మంచి వినోదాన్నే అందిస్తుంది.
అమాయకుడిగా, అర్భకుడిగా, ప్రాణభయంతో అల్లాడిపోయే రాముగా సునీల్ బాగా చేశాడు. ‘రాయె రాయె సలోని’
పాటలో మంచి స్టెప్స్ కూడా వేశాడు. అపర్ణగా సలోని అందంగా నటించింది. రామినీడుగా ప్రసాద్ ల్యాబ్స్ నాగినీడు పూర్తి
నిడివి పాత్రలో బాగా రాణించారు. అపర్ణ బావగా బ్రహ్మాజీ, నాగినీడు కొడుకులుగా సుప్రీత్, వేణుగోపాల్ బాగా చేశారు.
రావు రమేష్, జయవాణి, కాంచి, అనుజ్, సంధ్య, అనితా నాధ్ ఇతర పాత్రలు పోషించారు. కాంచి
సంభాషణలు సందర్భోచితంగా ఉన్నాయి. రామ్ ప్రాసాద్ ఫోటోగ్రఫీ రాజమౌళి స్థాయిలో ఉంది. ‘‘ఎందుకిలా నా
ఖర్మ’’ పాటలో విజువల్ ఎఫెక్ట్ప్ బాగున్నాయి. కీరవాణి పాటలు కథకి అనుగుణంగా ఉన్నాయి. నేపధ్యంలో
ఉపయోగించిన సాంగ్ బిట్స్ సినిమా మూడ్ కి ఉపకరించాయి. కోటగిరి ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. హీరో సైకిల్ కి
హీరో రవితేజ వాయిస్ ఇవ్వడం ఇందులో ఓ విశేషం.