ఎల్లో ఫ్లవర్స్ పతాకంపై హరీష్ శంకర్ దర్శకత్వంలో రమేష్ పుప్పాల ఈ చిత్రం నిర్మించారు.
ఢిల్లీలో పోలీసు అధికారిగా పనిచేస్తున్న రుషికి మిరపకాయ్ అని డిపార్ట్ మెంట్ లోని వారు
పిలుస్తుంటారు. ఉత్సాహవంతుడైన రుషిని కిట్టూభాయ్ అనే అంతర్జాతీయ క్రిమినల్ ని పట్టుకునే
పని అప్పగిస్తారు. అందుకోసం విశాఖపట్నం వచ్చిన రుషి అక్కడ కాలేజిలో హిందీ లెక్చరర్ గా
చేరతాడు. సంప్రదాయ కుటుంబం నుండి వచ్చిన వినమ్ర అనే స్టూడెంట్ తో ప్రేమలో పడతాడు.
అయితే, కిట్టూ భాయ్ కూతురు వైశాలి అదే కాలేజీలో చేరుతోందని, కిట్టూభాయ్ ఆచూకీ
తెలుసుకోవడానికి ఆమెతో ప్రేమ నటించమని రుషిని అధికారులు ఆదేశిస్తారు. ఆ ప్రకారమే
వైశాలిని ప్రేమలోకి దించడంలో సఫలమైన రుషి కిట్టూభాయ్ ని ఎలా అదుపులోకి
తీసుకున్నాడనేది ఈ చిత్ర కథాంశం.
అదే రవితేజ... అదే నటన... అతి చిన్న కథాంశం... కొత్తదనం లేని కథనం... ఎన్నో
సినిమాల్లో చూసేసిన సన్నివేశాలు... ఇదీ మిరపకాయ్ సినిమా. రవితేజ నటనంటే ఇష్టపడే
వారు ఈ సినిమా చూస్తే ఫర్వాలేదనిపిస్తుంది. కొత్తదనం కోరేవారికి మాత్రం రొటీన్ సినిమా
అనిపిస్తుంది. రవితేజ ఎనర్జిటిక్ కామెడీ, తమన్ సంగీతం ఈ చిత్రంలో హైలైట్స్. ఒకే తరహా
నటనే అయినప్పటికీ రవితేజ ప్రేక్షకులను ఎప్పటిలానే వినోదపరుస్తారు. యాక్షన్, డాన్స్ లు
కూడా బాగా చేశాడు. పట్టు గట కథ ఉంటే రవితేజ వినోదం ఫలించేది. ‘కిక్’ తర్వాత తమన్ ఈ
చిత్రానికే మంచి సంగీతం అందించాడు. మంచి పాటలకి తోడు చక్కటి చిత్రీకరణ జత కూడింది.
రీరికార్డింగ్ కూడా బాగుంది. రాం ప్రసాద్ ఫోటోగ్రఫీ కూడా ఈ చిత్రంలో ప్రత్యేకతను
సంతరించుకుంది. విదేశీ లొకేషన్లు, ఢిల్లీ, ఆగ్రా ప్రాంతాలతో సహా సినిమాని ఎంతో అందంగా
చూపించారు. సినిమా మొదటి భాగం విషయం తక్కువైనా వినోదాత్మకంగానే ఉంది. రెండవ
భాగానికొస్తే - కాలేజి సన్నివేశాలతో కథ కదలడం మానేస్తుంది. చాలా సినిమాల్లో చూసినట్లుగానే
విదేశాల్లో మల్టీస్టోర్డ్ బిల్డింగ్ టాప్ లో హెలీప్యాడ్ పైన రొటీన్ క్లైమాక్స్. రిచాతో ప్రేమ సన్నివేశాలు,
కోటతో, సునీల్ తో, కాలేజీ సన్నివేశాలు బాగున్నాయి. మోడ్రన్ గెటప్ లో బాగుండే రిచ
సంప్రదాయక దుస్తుల్లో వినమ్ర పాత్రలో ముద్ద పప్పులా కనిపించింది. దీక్ష వైశాలి పాత్రకు
న్యాయం చేసింది.
నాగబాబు, చంద్రమోహన్, సుధ, కోట, అజయ్, సుప్రీత్, ఫిష్ వెంకట్, సురేఖా వాణి,
రావు రమేష్, ధర్మవరపు, సుధ, రాజా రవీంద్ర, రవితేజ సహచరుడిగా బ్రహ్మాజీ, సంగీత
కారుడిగా సునీల్, ఆల్ పాసినో గా అలీ, కిట్టూ భాయ్ గా చిన్న పాత్రలో ప్రకాష్ రాజ్ నటించారు.
స్వాతి ఓ ట్రెయిన్ సీన్ లో మెరుపులా కనిపిస్తుంది. రామ్ లక్ష్మణ్ ఫైట్స్ కొన్ని బాగున్నాయి.
దర్శకుడు రాసిన మాటలు, గౌతంరాజు ఎడిటింగ్ బాగున్నాయి.