Bookmark and Share   Cinevinodam Subscribe
 
‘నాగవల్లి’ చిత్ర సమీక్ష
సినీవినోదం రేటింగ్‌ : 2.5/5
శ్రీ సాయిగణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై పి.వాసు దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

మానసిక వైద్యుడు కైలాష్ పరిష్కరించాడనుకున్న చంద్రముఖి సమస్యను కైలాష్ శిష్యుడు విజయ్ తిరిగి ఎదర్కోవాల్సి వస్తుంది. చంద్రముఖి తైలవర్ణ చిత్రంతో పాటుగా వచ్చి శరత్ బాబు భవంతిలో జరుగుతున్న ఉపద్రవాలను అరికట్టేందుకు సిద్ధాంతిని ఆశ్రయిస్తారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు సిద్ధాంతి విజయ్ ను పిలిపిస్తాడు.

యుద్ధంలో జయించిన వెంకటాపురం రాజు నాగభైరవ రాజశేఖరుడు ఆస్థాన నర్తకి చంద్రముఖిని చెరబడతాడు. ఆమె కళ్ళెదుటనే ఆమె ప్రియుడిని చంపి, ఆమెను సజీవ దహనం చేస్తాడు. శరీరం దహనం అయినా, ఆత్మ చావని చంద్రముఖి, తన తైలవర్ణ చిత్రంతో పాటు శరత్ బాబు ఇంట్లోకి ప్రవేశిస్తుంది. సిద్ధాంతితో కలిసి పరిశోధిస్తున్న విజయ్ కిఅక్కడున్న అయిదుగురు అమ్మాయిల్లో ఒకరిని నాగవల్లి ఆవహించిన విషయం తెలుస్తుంది. అయితే అది ఎవరనేది తెలియదు. అలాగే, చంద్రముఖి పగబట్టిన నాగభైరవుడి ఉనికి గురించి కూడా తెలుసుకుంటాడు. ఆ తర్వాత ఈ సమస్యని విజయ్ ఎలా పరిష్కించాడనేది ఈ చిత్రంలో చూడాలి.

‘చంద్రముఖి’కి కొనసాగింపుగా ఈ చిత్రం రూపొందించారు. ‘చంద్రముఖి’ పకడ్బందీ స్క్రిప్టుతో చక్కటి సస్పెన్స్ థ్రిల్లర్ గా నడిపితే, అందుకు భిన్నంగా - ఏ మాత్రం అర్థం కాని గందరగోళంతో ఈ చిత్రం నడుస్తుంది. ఫ్లాష్ బ్యాక్ లతో కథ నడిపిన తీరు ప్రేక్షకుడిన అయోమయంలోకి నెడుతుంది. ఒక్కోసారి మన రెగ్యులర్ హార్రర్ సినిమాల్లా అనిపిస్తుంది. సినిమాలో ఎక్కడా స్పష్టత లేదు. పైగా సినిమా అంతా అర్థంలేని విషయాలే. ఇందులో ప్రధాన పాత్రతో పాటు రాజుగా వెంకటేష్ చేశారు. గతంలో దీన్ని రజనీకాంత్ చేసి ఉండటంతో, అతన్ని చూసిన ప్రేక్షకులు వెంకటేష్ తో సంతృప్తి చెందలేకపోయారు. ఇక సినిమాలో వినోదం విషయానికొస్తే - బ్రహ్మానందం, ధర్మవరపు వంటి పెద్ద నటులే చేసినా పి.వాసు నాటు పద్ధతి కారణంగా పండలేదు. సినిమా మొదటి భాగం ఫర్వాలేదని పించినా, రెండవ భాగంలో హెచ్చుతగ్గులతో సినిమా నిలకడ కోల్పోయింది. క్లైమాక్స్ సన్నివేశాలు మరీ పేలవంగా ఉన్నాయి.

మానసిక వైద్యుడు విజయ్ గా, రాజుగా, ముసలి రాజుగా తన కెరీర్ లోనే విభిన్నమైన పాత్రలను వెంకటేష్ ఇందులో చేశారు. విలనీ చూపుతూ రాజు పాత్ర పోషించడంలో అతను ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అయితే ముసలి రాజుగా అతని మేకప్ పరిపోకపోగా... అతనితో కుంగ్ ఫూ ఫైట్లు, డాన్స్లులు చేయించడం విడ్డూరంగా ఉంది. డ్యూయట్లు లేకుండా వెంకటేష్ చేసిన తొలి సినిమా బహుశా ఇదేనేమో. ‘అభిమానులపైన’, ‘చంద్రముఖి’పైన వెంకటేష్ కు చాలా రోజులకు బాలు రెండు పాటలు చాలా బాగా పాడారు. వీటి చిత్రీకరణ, వెంకటేష్ నటన కూడా చాలా బాగున్నాయి. ‘ఔర ఔర’ అంటూ రాజు పాత్రతో అనిపించడం ఒక్కోసారి అరుపుల్లా వినిపిస్తుంది. ‘నాగవల్లి’గా అనూష్క చిన్న పాత్ర పోషించినా ‘అరుంధతి’ అనుభవంతో రక్తికట్టించింది. కమలిని రెండుసార్లు సంప్రదాయ నృత్య భంగిమలు బాగా చేసింది. శ్రద్ధా ఆడవేషంలో ఉన్న మగాడిలా కనిపించింది. రిచా బాగా చేసేందుకు ప్రయత్నించింది. పూనమ్ కౌర్, ప్రభ, సమీర్, రక్ష, సుజాత, అవినాష్ ఇతర పాత్రలు పోషించారు.

పరుచూరి సంభాషణలు ఫర్వాలేదు. శ్యాంకె నాయుడు ఫోటోగ్రఫీ, చిన్నా కళ, మార్తాండ్ ఎడిటింగ్ బాగున్నాయి. గురుకిరణ్ పాటలు కన్నా రీరికార్డింగ్ బాగుంది.

- రాజేష్
 

Copy right reserved for www.cinevinodam.com 2005