సురేష్ ప్రొడక్షన్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా రూపొందించిన ఈ చిత్రాన్ని శ్రీనువైట్ల దర్శకత్వంలో రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మించారు.
వయసు ముదిరినా పెళ్ళికాని వెంకటరమణ వెంట్రిలాక్విజమ్, మిమిక్రీ కళాకారుడు. ఎప్పటికైనా తన డ్రీమ్‌గర్ల్ కనిపిస్తుందని, ఆమెతోనే తన పెళ్ళి జరుగుతుందని ఎదురు చూస్తుంటాడు. ఓసారి ప్యారిస్ ప్రసాద్ అనే వ్యక్తి ద్వారా ఇతర కళాకారులతో కలిసి విదేశాల్లో ప్రదర్శనలివ్వడానికి వెళ్తాడు. అక్కడ అతని డ్రీమ్‌గర్ల్ పూజ తారసపడుతుంది. అతని ప్రేమను గమనించిన ప్యారిస్ ప్రసాద్, తన మేనకోడలైన పూజతో వెంకట రమణను ఆటపట్టించాలనుకుంటాడు. దాంతో, అతన్ని ప్రేమిస్తున్నట్లు పూజ నటిస్తుంది. అది నిజమని వెంకటరమణ భావిస్తాడు. ఆ తరువాత తన ఊరు వెళ్ళిన పూజను ఆమె మేనమామ బలవంతంగా తన కొడుకుతో పెళ్ళి చేయాలని చూస్తాడు. అది తెలిసిన వెంకట రమణ పూజ పెళ్ళి ఆపాలని ప్యారిస్ ప్రసాద్‌తో పాటు రాయలసీమ వెళ్తాడు. పూజ పెళ్ళిని ఆపడమే కాకుండా, తన ప్రేమను వెంకటరమణ ఎలా నిజం చేసుకున్నాడనేది ఈ చిత్ర కథాంశం.
పాత కథ, పాత సన్నివేశాలు పాత బ్యాక్‌డ్రాప్‌లో నిర్మించిన కొత్త చిత్రం ఇది. గతంలో వెంకటేష్, శ్రీనువైట్లతో పాటు మరి కొందరు కూడా ఈ మధ్య దాదాపు ఇదే కథతో సినిమాలు చేశారు. కాకుంటే హీరో వెంకటేష్ క్యారెక్టరైజేషన్‌లో మాత్రం కొంచం కొత్తదనం కనిపిస్తుంది. అందుకు వెంకటేష్ కూడా పూర్తి న్యాయం చేశారు. అతనికి బ్రహ్మానందం పాత్ర కూడా తోడయ్యింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం కూడా అదనపు ఆకర్షణ అయ్యింది. సినిమా మొదటి భాగం అంతంత మాత్రంగానే నడిచినా రెండవ భాగం పట్టుగా, వినోదాత్మకంగా సాగింది. ఇటువంటి కథా చిత్రాలకు విదేశాలను బ్యాక్ డ్రాప్‌గా తీసుకోవాల్సిన అవసరం ఎంటో మనకి అర్థంకాదు. సెకండ్ హాఫ్‌కి షరామామూలుగా రాయలసీమ ఉండనే ఉంది. ఈ విషయంలో మాత్రం మన వాళ్ళు ఏమాత్రం కొత్తగా ఆలోచించరు. 'టాకింగ్ డాల్', మిమిక్రీని హీరో పాత్రకు బాగా ఉపయోగించుకున్నారు. ఎమ్మెస్ నారాయణ హీరో జాతకం చెప్పడం, ప్యారిస్ ప్రసాద్ హీరోను ఇంటర్వ్యూ చేయడం, హీరోను ప్యారిస్ ప్రసాద్ ఆటపట్టించడం, ఫ్యాక్టరీ పేరుతో హీరో విలన్లతో ఆడుకోవడం, కాశీవిశ్వనాధ్‌పై ధర్మవరపు నోటి తీట తీర్చుకోవడం... వంటి సన్నివేశాలు బాగున్నాయి. మరీ ముఖ్యంగా మందు తాగి హీరో రెచ్చిపోయే సన్నివేశాలు, విలన్ ఇంట్లో హీరో, ప్యారిస్ ప్రసాద్‌లు రాత్రి పూట తిరిగే సన్నివేశాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. 'డ్రీమ్ గర్ల్' అంటూ బిల్డప్ ఇచ్చినంత గొప్పగా, హీరో హీరోయిన్‌ని తొలిసారి కలిసిన సన్నివేశం లేదు. బాక్సింగ్ పోటీలోను, క్లైమాక్స్‌లోను బలమైన ప్రత్యర్థులను హీరో ఒక్కడే చిత్తు చేయడం వంటివి ఎబ్బెట్టుగా ఉన్నాయి. పూజకు మరో ప్రేమికుడున్నాడన్న విషయం ప్రేక్షఁలకు తెలిసే సందర్భం కూడా అంత బలంగాలేదు.
వెంకటరమణగా వెంకటేష్ ఇందులో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు. తాగిన సీన్‌లోను, క్లైమాక్స్ ముందు హీరోయిన్ ప్రేమ బూటకమని తెలిసినపుడు అతని నటన సినిమాలో హైలైట్‌గా చెప్పుకోవచ్చు. పూజగా త్రిష బాగా చేసింది. కాకుంటే సినిమాలో ఆమె పాత్రకు ప్రాధాన్యత తక్కువ. పైగా ఆమె మరీ బలహీనంగా కనిపించింది. ప్యారిస్ ప్రసాద్‌గా బ్రహ్మానందం నటన ఈ చిత్రంలో ప్రత్యేక ఆకర్షణ. మాయగాడుగా బ్రహ్మానందం తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. మంచి హాస్యాన్ని పండించాడు. ఇతర పాత్రలు కోట, జీవా, శివారెడ్డి, సుబ్బరాజు, పృధ్వీ, సూర్య, సుధ, మాస్టర్ భరత్, మోహన్ రుషి, ప్రగతి, జయప్రకాష్ రెడ్డి, బెనర్జీ, ధర్మవరపు, కాశీవిశ్వనాధ్, సత్యప్రకాష్, ఎమ్మెస్‌నారాయణ, ఢీల్లీ రాజేశ్వరి, రఘుబాబు, చంద్రమోహన్, ఆకాష్ పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ పాటలు దాదాపు అన్నీ బాగున్నాయి. చిత్రీకరణ కూడా ఓకె. మూరెళ్ళ ప్రసాద్ ఫోటోగ్రఫీ, రామజోగయ్య శాస్త్రి సాహిత్యం, చింతపల్లి రమణ సంభాషణలు, వర్మ ఎడిటింగ్ బాగున్నాయి.