Bookmark and Share   Cinevinodam Subscribe
 
‘ఆరెంజ్’ చిత్ర సమీక్ష
సినీవినోదం రేటింగ్‌ : 2/5

అంజనా ప్రొడక్షన్స్‌ పతాకంపై భాస్కర్‌ దర్శకత్వంలో కె.నాగబాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. అద్భుతమైన లొకేషన్లు, చక్కటి చిత్రీకరణ, పాత్రల్లో ఒదిగే నటీనటులు... కానీ ఎక్కడో ఏదో మిస్‌... దాంతో... చేసిందంతా వృధా. 'మగధీరుడు'ని లవర్‌ బారుగా చూపించే క్రమంలో తత్తరబాటు. అసలు భాస్కర్‌ అంటే 'బొమ్మరిల్లు' గుర్తుకు వస్తంది. ఇప్పటికీ మర్చిపోలేని సన్నివేశాలు, ప్రేమికుల ఆలోచనలు, తల్లిదండ్రుల బాధ్యత చక్కగా అవగతం చేశాడు. ఆరెంజ్‌ దానికి విరుద్ధం 'ఎవరైనా జీవితాంతం ప్రేమిస్తూ జీవిస్తారనేది అబద్ధం. అసలు ప్రేమ కొంతకాలమే వుంటుందనే' లాజిక్కులతో చూపించి, చివరికి ఆ లాజిక్‌కు హీరో ఎలా బందీ అయ్యాడనేది కథ. కొన్ని కథలు కన్‌ఫ్యూజ్‌గా వుంటాయి. ఆ కోవలోనిదే ఆరెంజ్‌. లవ్‌ అంటే మూడు అబద్దాలు, మూడు కుళ్ళుజోకులు, మూడు ఎస్‌ఎంఎస్‌లు అనే యూత్‌కు లవ్‌ అంటే నిజం చెప్పడం అనే నవయువకుడి ఆలోచనల మధ్య సాగే కథ ఇది-

ప్రేమించి పెళ్లి చేసుకున్న అక్కా బావ (మంజుల, సంజరు)ల పంచన చేరతాడు రామ్‌ (రామ్‌చరణ్‌). ఆస్ట్రేలియాలోని సిడ్నీలో గ్రాఫిటీ చేయడం (గోడలపై బొమ్మలు వేయడం) అతని వ్యాపకం. లేడీస్‌ కాలేజీ నుండి సడన్‌గా కో-ఎడ్యుకేషన్‌లో చేరిన కాలేజీ అమ్మాయి జాను (జెనీలియా). ఆమె చేసే చిలిపిపనులు, తింగరివేషాలు చూసి మనసు పారేసుకుంటాడు రామ్‌. ఆమెకోసం సిటీ అంతా గాలించి ఎట్టకేలకు పట్టుకుంటాడు. అప్పటికే ఆమె ముగ్గురికి ప్రేమను ఆఫర్‌ చేస్తుంది. తను నాల్గవ వాడిగానే చేరి, ఆమెను బలవంతంగా ప్రేమించేలా చేసి, చివరికి నిన్ను ప్రేమించడంలేదనే ట్విస్ట్‌ ఇస్తాడు. ఎందుకంటే లవ్‌ అనేది కొంతకాలమే వుంటుంది. జీవితాంతం వుండదని సరికొత్త నిర్వచనాన్నిస్తాడు. కొంతకాలమే లవ్‌ అనేది ఆ తింగరికి అర్థంకాదు. ఇదే అభిప్రాయం ప్రేక్షకుడికీ వస్తుంది. ఈ కథంతా సిడ్నీలో పోలీసు అధికారి ప్రకాష్‌రాజ్‌కు చెబుతుంటాడు రామ్‌. తనెందుకు ఇలా అయ్యాడనేది చెబుతాడు ఫ్లాష్‌బ్యాక్‌లో. 5ఏళ్ళకే టీచర్‌కు ప్రేమ లేఖ రాస్తాడు. అలా 16ఏళ్ళకు మరొకరికి.. ఇలా 9మందిని ప్రేమించానని చెప్పి, ప్రేమనేది నిజంకాదనే లాజిక్కుతో వారినుంచి దూరమవుతాడు. అందులో ఒకామె రూపా (షాజన్‌ పదంశీ). ఆ అమ్మాయిని తొలిచూపులోనే ప్రేమించేస్తాడు. ఆమెను సంతోషపెట్టడానికి ఇష్టాల్ని పక్కనపెట్టి అబద్దాలతో మరింత దగ్గరవుతాడు. అయితే పెద్దల సమక్షంలో ఎల్లకాలం ఇదే ప్రేమను ఆమెపై చూపలేనని తేల్చిచెప్పడంతో ఆమె వదిలించుకుంటుంది. ఇలా మారిన రామ్‌ చివరికి జానును ప్రేమిస్తాడు. అటువంటి ప్రవర్తనగల రామ్‌ను జాను తనవైపు తిప్పుకోగలిగింది మిగిలిన సినిమా.

రామ్‌ పాత్రలో రామ్‌చరణ్‌ బాగానే చేశాడు. లవర్‌బారు గెటప్‌లో హావభావాలు పలికించాడు. తింగరిదానిలా జెనీలియా జీవించింది. చేష్టలు శృతిమించడంతో ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. పప్పీ పాత్రలో బ్రహ్మానందం చేసిన ప్రయత్నాలకు ప్రేక్షకుడే గిలిగింతలు పెట్టుకోవాలి. ప్రకాష్‌రాజ్‌, రఘు, మంజుల ఇతర పాత్రలు ఫర్వాలేదు. వెన్నెల కిషోర్‌ నుంచి పెద్దగా కామెడీ లభించలేదు. టెక్నికల్‌గా ఉపయోగించేందుకు సన్నివేశాలు లేవు.

మంచి లొకేషన్లు దొరికితే ఏ కెమేరా మెన్‌ అయినా చెలరేగిపోతాడు. ఆకాశంలో పైట్లు, రైలులో ఫైట్లు, థ్రిల్‌ కలిగించినా, కథకు ఏమాత్రం ఉపయోగపడలేదు. కథలో పసలేకపోవడంతో ఇవన్నీ వృధా ప్రయాసగానే మిగిలాయి. ప్రేమంటే ఎమోషన్స్‌, ఫీలింగ్స్‌ కలగలిపి వుంటాయి. అది లెక్క ప్రకారం కొలత వేయాలంటే కష్టం. ఆ దిశలో కొత్తగా ఆలోచించి కన్‌ఫ్యూజ్‌ చేశాడు భాస్కర్‌. హీరోహీరోయిన్ల మధ్య రొమాన్స్‌లో ఫీల్‌ లేదు.

హారిస్‌ జైరాజ్‌ సంగీతం ఫర్వాలేదు. 'సిడ్నీ నగరం... రమ్మంటే వచ్చేది ప్రేమకాదు'... పాటలు బాగున్నాయి. సముద్రమంత ప్రేమను పొందడం చాలా కష్టం. ప్రేమ అనేది ఇరువైపులా వుండాలంటూ సూక్తులు చెప్పే పాత్రలో నాగబాబు కన్పిస్తాడు.

కానీ తను చెప్పినదాంట్లో న్యాయముందని జాను తండ్రి ఫైనల్‌గా అంచనాకు వస్తాడు. ఎవరైనా ప్రేమ మొదట్లో బాగానే ప్రేమించుకుంటారు. ఆ తర్వాత పిల్లలకోసం ప్రేమిస్తారు. కానీ నిజమైన ప్రేమ తర్వాత వుండదు. ప్రేమిస్తున్నట్లు ఒకరికొకరు అబద్దాలతో సర్దుకుని జీవిస్తారు... దానికి ఏం చేయాలి? అనే ముగింపులో క్లారిటీ లోపించింది. మొదటి భాగం చూసినంతసేపు ఇదో పిచ్చి కథ అనిపిస్తుంది. సన్నివేశాలు చూడా అలాగే వుంటాయి. సెకండాఫ్‌లో తను ఎందుకు అలా ప్రవర్తిస్తున్నానని రామ్‌ చెబుతుంటాడు. అందుకోసం రెండున్నరగంటలపాటు ప్రేక్షకుడి సహనానికి పరీక్ష.

- రవళి
 

Copy right reserved for www.cinevinodam.com 2005