Bookmark and Share   Cinevinodam Subscribe
 
‘పంచాక్షరి’
సినీవినోదం రేటింగ్‌ : 2/5

సాయిరత్న క్రియేషన్స్ పతాకంపై సముద్ర దర్శకత్వంలో బొమ్మదేవర రామచంద్రరావు ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఫ్యాషన్ డిజైనర్ హనీ ప్యారిస్ లో తన వస్త్రాల ప్రదర్శన పెట్టడం లక్ష్యంగా పెట్టుకుంటుంది. నాన్నమ్మ ఒత్తిడితో ఓ ఫొటోలోని వ్యక్తిని చూపించి అతన్ని ప్రేమిస్తున్నానని చెబుతుంది. ఈలోగా శ్రీరామ్ అనే మరో యువకుడు ఆమె వెంటపడుతుంటాడు. ఓ సారి అతన్ని హనీ నిలదీస్తే అసలు విషయం తెలుస్తుంది - హనీ బాబాయ్ కూతురు అమ్మవారికి ఇష్టమైన ముహూర్తంలో పుట్టడంతో ‘పంచాక్షరి’ అని పేరు పెట్టుకుంటారు. ఆమెను అమ్మవారి ప్రతిరూపంగా ఊరి వారంతా భావిస్తారు. ఆ ఊరి భూస్వామి నిధి కోసం పన్నిన కుట్రలో పంచాక్షరి మరణిస్తుంది. పంచాక్షరి భర్తే శ్రీరామ్. అచ్చం పంచాక్షరిలానే హనీ ఉంటుంది. అతనితో వారి ఊరికి వెళ్ళిన హనీని పంచాక్షరి ఆత్మ ఆవహించి, భూస్వామి పన్నాగాలను అడ్డుకుని, వారిని అంతం చేస్తుంది.

‘అమ్మోరు’, ‘అరుంధతి’ తరహా చిత్రాలను కలిపి, మళ్ళీ అదే మూసలో ఈ చిత్రం తీసారు. మాస్ ప్రేక్షకులు, మహిళా ప్రేక్షకులనే లక్ష్యంగా పెట్టుకున్నారు. పరమ రొటీన్ కథతో తీసిన ఈ చిత్రం స్ర్కీన్ ప్లేలో కొన్ని కొత్త మలుపులు, సస్పెన్స్ పెట్టే ప్రయత్నం చేశారు. అయితే, అవి అర్థవంతంగాలేక పోవడంతో సినిమా చతికిల పడింది. కథా విలువలు లేని ఈ చిత్రంలో నిర్మాణ విలువలు కూడా లేవు. ఇటువంటి చిత్రాల్లో ప్రధాన ఆకర్షణ, బలం అయిన గ్రాఫిక్స్ మరీ నాసిరకంగా ఉన్నాయి. అనూష్క వంటి గ్లామర్, ఇమేజ్ ఉన్న నటిని సద్వినియోగం చేసుకుని, సినిమాని సక్సెస్ చేయడంలో దర్శకుడు విఫలమయ్యాడు. గత చిత్రాలకి భిన్నంగా అన్నదమ్ముల కూతుళ్ళిద్దరు ఒకేలా ఉండటం ఇందులో ప్రత్యేకత. ‘హనీ’ పై సినిమా ప్రారంభంలో చిత్రీకరించిన ‘నేను లుక్కేస్తే’ పాట మరీ ఊర స్టైల్ లో దర్శకుడు చిత్రీకరించాడు. అక్కడక్కడా కొద్ది సన్నివేశాలు మాత్రమే పండాయి. బోనాల పండగలో భవిష్యత్ చెబుతున్న పంచాక్షరి గంధకం కలిపిన పసుపు వల్ల కాలిపోవడం వెరైటీగా ఉంది. ఈ తరహా చిత్రానికి తగినట్లు తోట ప్రసాద్ మాటలున్నాయి. పాటలకి ప్రాధాన్యత లేని ఈ చిత్రంలో చిన్నా నేపథ్య సంగీతం కాస్త ఎక్కువగా అనిపించినా, బాగుంది.

పంచాక్షరి, హనీ పాత్రల్లో అనూష్క బాగా చేసింది. హనీగా అధునాతనంగా, పంచాక్షరిగా సంప్రదాయకంగానూ అందంగా కనిపించింది. శ్రీరామ్ గా సామ్రాట్, విలన్ గా ప్రదీప్ రావత్, ఇతర పాత్రల్లో నాజర్, తెలంగాణ శకుంతల, సుధ, రఘుబాబు, డా. రవిప్రకాష్, సుబ్బరాయశర్మ, జయవాణి నటించారు. ‘మగధీర’ కథతో బ్రహ్మానందాన్ని బురిడీ కొట్టిన సుఖానంద స్వామిగా అలీ, ఫోటో స్టూడియో ఓనర్ గా ఎమ్మెస్ నారాయణల కామెడీ బాగుంది. ‘మిత్ర విందా’ అంటూ మగధీర స్టైల్లో, అనూష్కతో బ్రహ్మానందం చేసిన ఊహా గీతం బాగుంది. అయితే, మిగతా సన్నివేశాలు చిరాకెత్తించాయి.

- రాజేష్‌
 

Copy right reserved for www.cinevinodam.com 2005