సమీక్ష
 
 
 
 
 
'ప్రేమ కావాలి'
సినీవినోదం రేటింగ్‌ : 3/5
మాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ పతాకం ఫై కె.విజయభాస్కర్ దర్శకత్వంలో కె.అచ్చి రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు .

కాలేజి కుర్రాడు శీను ప్రేమ అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. అయితే ఆమె తన అంగీకారాన్ని చెప్పదు. ఓసారి శీను యన్. సి.సి. కాంప్ కి వెళ్ళిన సమయంలో ప్రేమ -శీను ముద్దు పెట్టుకుంటున్న ఫొటోతో కొందరు ప్రేమను బ్లాక్ మెయిల్ చేస్తారు. పోలీసు అధికారి అయిన తండ్రికి ఈ విషయం తెలియడం ఇష్టం లేక ప్రేమ బ్లాక్ మెయిలర్లకు అడిగిన డబ్బు ఇస్తుంటుంది. ఆ విషయం తెలిసిన శీను బ్లాక్ మెయిలర్ల విషయం తెలుసు కోవాలని ప్రయత్నిస్తాడు. కిడ్నాప్ కాబోయే ప్రేమను కాపాడతాడు. ప్రేమ తండ్రి పోలీసు అధికారి ద్వారా ఒక పాకిస్తాన్ తీవ్రవాదిని విడిపించుకోవడానికి ప్రేమను కిడ్నాప్ చేయాలని చేసే ప్రయత్నాన్ని భగ్నం చేసినా, ప్రేమకు తెలియని విధంగా ఆమె తండ్రి మెయిల్ ఐ.డి సంపాయించి తీవ్రవాదిని వారు విడిపించుకుంటారు. తద్వారా నిందల పాలైన ప్రేమ తండ్రిని కాపాడేందుకు శీను... ఆ తీవ్రవాదిని వెంబడించి అతన్ని బంధించి అప్పగిస్తాడు.

ప్రముఖ నటుడు సాయికుమార్ కుమారుడు ఆదిని హీరోగా పరిచయం చేస్తూ ప్రేమ కధల స్పెషలిస్ట్ కె.విజయభాస్కర్ దర్శకత్వంలో కె.అచ్చిరెడ్డి ఈ చిత్రాన్ని భారీ నిర్మాణ విలువలతో రూపొందించారు. తొలి చిత్రంతోనే తన సత్తా నిరూపించుకోవడంలో ఆది విజయవంతం అయ్యాడు. వంశపారంపర్యంగా వచ్చిన మంచి వాచికంతో.... నటనలో, డాన్సులు, పోరాటాల విషయంలో రాణించాడు. ఆది మంచి యువ హీరోగా ఎదిగే అవకాశం ఉంది. అయితే దర్శకుడిగా విజయభాస్కర్ మాత్రం అంతంత మాత్రంగానే చేయగలిగారు. రెగ్యులర్ ప్రేమకథనే మరోసారి వినోదాత్మకంగా చూపించాలని ప్రయత్నించారు. చాల సన్నివేశాలు వినోదాత్మకంగానే ఉన్నప్పటికీ... అందులో కొత్తదనం కొరవడింది. పైగా ఇందులో పెట్టిన విలన్ ట్రాక్ మరీ బలహీనంగా ఉంది. జాతీయస్థాయి విలన్ లోకల్ గూండాలతో హీరోయిన్ ని కిడ్నాప్ చేయించాలనుకోవడం, వాళ్ళు కిడ్నాప్ బదులు బ్లాక్ మెయిల్ చేయడం, చివరిలో హీరో ఎంతో ఈజీగా విలన్ లని ఒక్కడే కొట్టి పడేసి, అంతర్జాతీయ తీవ్రవాదిని పట్టేయడం వంటివి మరీ నవ్వు తెప్పించేలా ఉన్నాయి. టాగూర్ గా దేవ్ గిల్ పాత్రకి బిల్డప్ ఎక్కువ ఇచ్చారు... కానీ విషయం లేకపోవడంతో బిజినెస్స్ దెబ్బతింది. ఈ చిత్రం సాంకేతికంగా మాత్రం చాలా బాగుంది. చోటా కే నాయుడు ఫొటోగ్రఫీ ఈ చిత్రంలో హైలైట్. ప్రపంచంలోనే అందమైన కొన్ని ప్రదేశాలను పాటల్లో కనులపండువగా తెలుగు తెరఫై చూపించారు. ఇందులో సంభాషణలు త్రివిక్రమ్ తరహాలో ప్రయత్నించి కొంతవరకు ఫలితం సాధించారు. గౌతం రాజు ఎడిటింగ్ బాగుంది. హీరోయిన్ ని హీరో కాపాడే మూడు ఫైట్లు బాగున్నాయి. అనుప్ పాటల్లో ఒకటి, రెండు పాత రాగాలు వినిపించినా, పాటలు అన్నీ బాగున్నాయి. చిత్రీకరణ మరీ బాగుంది. రీ రికార్డింగ్ బాగుంది. కొన్నిసన్నివేసాల్లో కంప్యూటర్ గ్రాఫిక్స్ ను అందంగా ఉపయోగించారు.

కొత్త హీరోయిన్ ఇషా తాజా అనుభూతిని కలిగిస్తుంది. ప్రేమగా బాగా చేసింది. ఆమెఫై చిత్రీకరించిన తడి పొడి పాట 'తొలకరి చినుకే’ ప్రేక్షకులను బాగా అలరించింది. చెయిన్ రాజుగా అలీ, బ్రహ్మానందం - యం.యస్.నారాయణల కాంబినేషన్ మంచి కామెడీ పండించింది. ఇతర పాత్రల్లో నాజర్, సింధు తులాని, షఫీ, సుప్రీత్, సామ్రాట్ పోషించారు.

- రాజేష్